మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ లో తీర్మానించి శాసన మండలికి పంపించిన నేపథ్యంలో అక్కడ ఎదురుదెబ్బ తగిలినసంగతి తెలిసిందే. మండలి చైర్మన్ షరీఫ్ ఆ బిల్లును విచక్షాణిధికారంతో సెలక్ట్ కమిటీకి పంపించారు. దీంతో జగన్ సర్కార్ మండలిని రద్దు చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్లీ అదే బిల్లును రెండవసారి అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపించినా మళ్లీ ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే తాజాగా మండలి రద్దుపై జగన్ సర్కార్ పునరాలోచనలో ఉన్నట్లు తాజాగా చోటు చేసుకుంటోన్న సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం ఖాళీగా ఉన్న సీటుకు తన అభ్యర్ధిని నిలిపి భర్తీ చేయడంతో శాసనసభ రద్దుకు మంగళం పాడిందా? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని మళ్లీ వైకాపా ఆయనతోనే భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో మండలి రద్దు పై సీన్ మారినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకూ మండలి రద్దుకు కేంద్రంపై పట్టుబట్టిన ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగానే ఉపసంహరించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరి మండలి రద్దుపై ప్రభుత్వ పునరాలోచనకు కారణం ఏమై ఉంటుందంటే? కేంద్రం వైఖరనే స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వద్ద పలు రాష్ర్టాలు పంపించిన మండలి రద్దు వ్యవహారాలు ఉన్నాయి. దీనిపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అన్నింటిని కేంద్రం పెండింగ్ లో పెట్టి వదిలేసింది. ఏపీ మండలి రద్దు కూడా అలాగే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పైగా ప్రస్తుతం దేశమంతా కరోనామయం. కేంద్రం ఇప్పుడు దానిపైనే దృష్టి పని చేస్తుంది. పార్లమెంట్ సమావేశాలు సైతం వాయిదా పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ మండలి రద్దు ఆలోచనని విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా నాన్చుకుంటూ ముందుకు వెళ్తే రాజధానుల బిల్లు పెండింగ్ తప్పదు. అందుకే రద్దు దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది చివరి నాటికి వైకాపా మరో రెండు, మూడు ఎమ్మెల్సీలు గెలుచుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నుంచి క్రమంగా టీడీపీ బలం కూడా తగ్గుతుంది. అంటే మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మండలిలో వైకాపా బలం కచ్చితంగా పెరుగుతుంది. ఈ లోపు మండలి రద్దయితే ఎవరికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుకే సీఎం జగన్ మండలి రద్దు పై పునరాలొచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజధానుల తరలింపు పై ఇప్పటికే సర్కార్ బలంగా తన బాణీని వినిపిస్తోంది. అసెంబ్లీ లో ఆమోదం పొందిన బిల్లులకు మండలితో సంబంధం ఏముందని…బిల్లుపై అభిప్రాయం మాత్రమే కోరడం జరిగిందన్నట్లు స్వరం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.