జగన్ ఢిల్లీ టూర్: పెద్ద ఎజెండానే వుందండోయ్!

Jagan Delhi Tour

వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ ఎజెండా ఏమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, ప్రత్యేక హోదా అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ‘కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో లేదు.. అయినాగానీ, అడుగుతూనే వుంటాం..’ అని పదే పదే వైసీపీ చెబుతున్న విషయం విదితమే. అయితే, సీఎం హోదాలో వైఎస్ జగన్.. కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుతున్నారా.? లేదా.? అన్నదానిపై ఇప్పటిదాకా సరైన స్పష్టత లేదు. ‘రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని వైఎస్ జగన్ ఢిల్లీలో కలుస్తున్నారు..’ అని మాత్రమే వైసీపీ చెబుతోంది.. ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటనలూ ఇలాగే వస్తున్నాయి. ఇదిలా వుంటే, రాజధాని మార్పు సహా పలు కీలక అంశాలపై ఈసారి వైఎస్ జగన్, ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.

Jagan Delhi Tour
Jagan Delhi Tour

‘మూడు నాలుగు నెలల్లో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలి వెళుతుంది..’ అని ఇటీవలే సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కర్నూలు పరిస్థితి ఏంటి.? అన్న ప్రశ్న తెరపైకి రావడంతో అధికార పార్టీ ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఎజెండాలో కర్నూలు న్యాయ రాజధాని అంశాన్ని కూడా చేర్చారట. కేంద్రం నుంచి ఈ విషయమై రాష్ట్రం తగిన సహకారం ఆశిస్తోందనీ, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతారనీ వైసీపీ చెబుతుండడం గమనార్హం. అంతా బాగానే వుందిగానీ, శాసన మండలి రద్దు సంగతి ఏమయ్యింది.? ఈ వ్యవహారంపై కేంద్రానికి వైఎస్ జగన్ ప్రత్యేకంగా చేసే విజ్నప్తి ఈ టూర్‌లో ఏమైనా వుంటుందా.? లేదా.? ఏమో, వైసీపీ ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి వుంది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు సహా అనేక అంశాలపై కేంద్రానికి వైఎస్ జగన్ ఓ నివేదిక కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ ఈ వ్యవహారంపై చేస్తున్నహంగామాపైనా జగన్, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తారా.? అన్న ప్రశ్నకు భిన్న సమాధానాలు వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి.