చెప్పడమొక్కటే సరిపోదు.. చేసి చూపించాలి. కొండంత రాగం తీసి.. అన్నట్టుగా అధికారంలో వున్నోళ్ళు వ్యవహరిస్తే, ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి. అందుకు, తెలుగుదేశం పార్టీనే ఉదాహరణ. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లు ఏ స్థాయిలో బెడిసికొట్టాయో చూశాం. 2019 ఎన్నికల్లో టీడీపీకి అత్యంత ఘోరమైన పరిస్థితి రావడానికి కారణం, ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడమే. ఆశలు ఆకాశంలో.. పనులు పాతాళంలో.. అన్నట్టు తయారైంది చంద్రబాబు హయాంలో పాలన. అదే, చంద్రబాబుకి రాజకీయంగా పెను శాపమయ్యింది కూడా. మరి, వైఎస్ జగన్ సర్కార్ పరిస్థితేంటి.? అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ తెరపైకి తెచ్చిన ‘పేదలకు ఇళ్ళ స్థలాలు’ వ్యవహారం ఏమవుతుంది.?
ఇళ్ళు కాదు.. ఊళ్ళు.!
మనం నిర్మిస్తున్నది ఇళ్ళు కాదు, ఊళ్ళు.. అన్నది వైఎస్ జగన్ నినాదం. నిజానికి, ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. అయితే, కొత్తగా ప్రచారంలోకి వస్తోందంతే. ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ఊళ్ళను నిర్మిస్తున్నాయి.. అయితే, స్థలాల్ని కేటాయించడం.. ఇళ్ళ నిర్మాణానికి సబ్సిడీలు ఇవ్వడం.. ఇలా చేస్తూ వచ్చాయి. కానీ, వైఎస్ జగన్ మాత్రం, ఇల్లు కట్టించి మఇచ్చేస్తాని అంటున్నారు. అంటే, ఇది కేవలం ఇళ్ళ స్థలాల వ్యవహారమే కాదు, ఊళ్ళను నిర్మించి ఇచ్చే ప్రతిష్టాత్మక పథకం అన్న మాట. ఒకటి కాదు, రెండు కాదు, వంద కాదు, వెయ్యి కాదు, లక్షల్లో ఇళ్ళ నిర్మాణం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. వేల కోట్లు ఖర్చవుతుంది. ఎంతైనాసరే, కట్టి తీరాల్సిందేనని వైఎస్ జగన్ సర్కార్ భావిస్తోంది.
ప్రకటనలు సరే, ఆచరణో మరి.!
లక్షల సంఖ్యలో ఇళ్ళను నిర్మించడమంటే కత్తి మీద సాములాంటిదే. ‘ఊళ్ళు’ అని చెబుతున్నారంటే, అక్కడ అన్ని రకాల మౌళిక సదుపాయాలూ వుండాలి. గతంలోనూ ఇళ్ళ నిర్మాణం జరిగింది. కానీ, మౌళిక సదుపాయాలే అసలు సమస్య. ట్రాన్స్‌పోర్టేషన్ సహా అన్నీ వుండాలి. మంచి నీటి లభ్యత, కరెంటు.. ఇవన్నీ మామూలే. కనెక్టివిటీ లేకపోతే, ఊళ్ళు ఎందుకూ పనికిరావు. మరి, ఆ దిశగా వైఎస్ జగన్ సర్కార్ ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. పైగా, గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళను ఇవ్వడానికి ఏడాదిన్నర సమయం తీసుకుంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ లెక్కన, ఒకవేళ 2024కి ముందే ప్రభుత్వం మారితే పరిస్థితేంటి.? ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం, జగన్ చేపట్టిన ‘ఊళ్ళ నిర్మాణాన్ని’ కొనసాగిస్తుందా.? ఆపేస్తుందా.?
ఆలస్యం అమృతం విషం
పేదలకు సాయం చేస్తామంటే, విపక్షాలు ఆదుకుంటున్నాయంటూ ఇళ్ళ స్థలాల విషయమై వైఎస్ జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెల్సిందే. కానీ, చాలా తక్కువ శాతం ఇళ్ళ స్థలాలు మాత్రమే వివాదాల్లో వున్నాయని తాజా గణాంకాలు.. అదీ అధికారిక గణాంకాలు చెబుతుండడం గమనార్హం. అంటే, ఇక్కడ అధికార పార్టీ, విపక్షాలపై దుష్ప్రచారం చేస్తోన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకోపక్క, కట్టేసి వున్న ఇళ్ళను పేదలకు అందించడంలో ఆలస్యం కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేసింది. అయితే, డిసెంబర్ 25న ఇళ్ళ స్థలాల పంపిణీ, ఇళ్ళ నిర్మాణం గనుక ప్రారంభించేస్తే.. అది లబ్దిదారులకు ఊరట.. ప్రభుత్వానికీ అది చాలా మేలు చేస్తుంది. అదే సమయంలో, ఇళ్ళ నిర్మాణం ఆలస్యమైతే, కథ మొదటికి వచ్చేస్తుంది.