చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్… లైవ్ ఎప్పటినుంచంటే?

కోట్లమంది భారతీయులతోపాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ – 3 చివరిదశకు చేరుకుంది. ఇక చంద్రుడిపై చేరుకోవడానికి కేవలం 70 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది! ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా తాజాగా కొన్ని ఫోటోలను పంపింది.

అవును… చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భూమి కక్ష్య నుంచి చంద్రుడి కక్షలోకి వెళ్లిన చంద్రయాన్ -3… తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ కేవలం 70 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఈ సందర్భంగా 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడి ఫొటోలు తీసి పంపింది.

తాజాగా చంద్రయాన్ – 3 పంపిన ఫోటోల వల్ల చంద్రుడి దక్షిణ ధృవం ఎలా ఉందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇక ల్యాండింగ్ కు 24గంటలకంటే తక్కువ సమయం ఉండటంతో… ఎప్పటికప్పుడు చంద్రయాన్-3 మిషన్ అప్ డేట్స్ ఇస్తోంది ఇస్రో! తాజాగా వాటికి సంబంధించిన ఫొటోల్ని కూడా విడుదల చేసింది.

చంద్రయాన్-3 కు సంబంధించి ఇస్రో తాజాగా షేర్ చేసిన అప్ డేట్ ప్రకారం.. మిషన్ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం పయనిస్తోంది.. సిస్టమ్‌ లతో సాధారణ తనిఖీలు కొనసాగుతున్నాయి.. మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ శక్తి, ఉత్సాహంతో సందడి చేస్తోంది.. స్మూత్ సెయిలింగ్ కొనసాగుతుంది అని ఇస్రో వెల్లడించింది!

ఇదే సమయంలో చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం రేపు (ఆగస్టు 23) సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రారంభిస్తామని తెలిపింది.

మరోపక్క చందమామపై చంద్రయాన్ – 3 వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్‌ భారతీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది.