మంత్రి కొడాలి నానికి, చంద్రబాబు అంటే ప్రత్యేకమైన ‘ఇది’. ఆ ‘ఇది’ ఏంటన్నది అందరికీ తెల్సిందే. చంద్రబాబుని తిట్టాలంటూ ముందూ వెనుకా ఆలోచించరు కొడాలి నాని. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంలో ‘అదుపు తప్పిన’ మంత్రి కొడాలి, ఈసారి ఇంకాస్త ఎక్కువే ‘అదుపు’ తప్పారు. ఓ సాధారణ ఎమ్మెల్యే అయితే అదొక లెక్క. కానీ, కొడాలి నాని ప్రస్తుతం మంత్రిగా వున్నారు. చంద్రబాబుని రాజకీయంగా విమర్శించొచ్చుగాక. కానీ, హద్దులు మీరి ‘తిడితే’ ఎలా.? అదే సమయంలో, తెలుగుదేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఉద్దేశించి ‘ఏం పీకావ్’ అని ప్రశ్నించడాన్నీ సమర్థించలేం. రాజకీయాల్లో నాయకులంతా హద్దులు దాటేస్తున్నారు. ఒకర్ని మించి ఇంకొరు మీడియాలో ‘స్పేస్’ కోసం ఆరాటపడుతున్నారంతే. అయితే, కొందరు మాత్రం సంయమనం పాటిస్తుండబట్టే.. పరిస్థితి ఇలాగైనా వుంది. ఏం, కొడాలి నాని తిట్టినట్లు, ఆయన్ని ఇంకో టీడీపీ నేత తిట్టలేరా.? అదెంత పని.! టీడీపీలో ‘బూతు’ పండితులు చాలామందే వున్నారు.
వైసీపీకి చేటు చేస్తున్న కొడాలి నాని తిట్ల వ్యవహారం
ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్నప్పుడూ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అవే ఆరోపణలు చేస్తే ప్రయోజనం లేదు. ఆరోపణలు కాదు, ఆచరణ కావాలిక్కడ. చంద్రబాబు మీద చర్యలు తీసుకోగలిగితే, వైఎస్ జజగన్‌ని ‘శెహబాష్’ అనే అంటారు రాష్ట్ర ప్రజానీకమంతా. ఎందుకంటే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టేశారంటూ అమరావతి భూముల వ్యవహారంపై టీడీపీ మీద వైసీపీ నిందారోపణలు చేస్తూ వచ్చింది గనుక. అమరావతిలో పచ్చ దోపిడీ జగమెరిగిన సత్యం. కానీ, ఆ దోపిడీని నిరూపించడానికి 18 నెలల సమయం వైఎస్ జగన్ ప్రభుత్వానికి సరిపోలేదంటే, అది ‘ప్రపంచ వింత’గానే భావించాలేమో.
కొడాలితో చంద్రబాబుని తిట్టిస్తే.. వైసీపికి లాభమా.?
‘ఏం పీకావ్..’ అని చంద్రబాబు, వైఎస్ జగన్‌ని ప్రశ్నించగలిగారంటే.. ఇక్కడ బలం తనవైపే వుందని, వైఎస్ జగన్ తనను ఏమీ చేయలేరన్న ధైర్యం చంద్రబాబులో వుందనీ అర్థమవుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ సర్కార్ ఏమన్నా చర్యలు తీసుకుంటే, ‘రాజకీయ కక్ష సాధింపు చర్యలు..’ అంటూ ఇంకో అస్త్రాన్ని చంద్రబాబు ఎలాగూ తెరపైకి తెస్తారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్, అమరావతి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని ఏడాది పాటు తట్టుకోగలిగిన జగన్.. చంద్రబాబు అవినీతిని నిరూపించలేకపోవడం ఆశ్చర్యకరమే. ఒకవేళ చంద్రబాబుని వైఎస్ జగన్ ప్రభుత్వం దోషిగా నిలబెట్టగలిగితే, అమరావతి ఉద్యమంలో కూడా ‘సడలింపు’ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
కొడాలిని అదుపు చేయకపోతే కష్టమే..
వైఎస్ జగన్ ఉసిగొల్పారు.. కొడాలి నాని రెచ్చిపోయారు.. అన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మాజీ మంత్రి నారా లోకేష్ ఓ అడుగు ముందుకేసి, ‘సమాధానం చెప్పాల్సిందే మీరే తప్ప.. ఊర కుక్కలు కాదు..’ అంటూ ట్వీటేశారంటే.. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇది జనాల్లోకీ బలంగా వెళ్ళిపోతోంది. ‘ఏం పీకావ్’ అని చంద్రబాబు సవాల్ చేసిన దరిమిలా, అచ్చెన్నాయుడి తరహాలో చంద్రబాబుకి ‘సత్కారం’ చేసే పని వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభించకపోతే.. తప్పుడు సంకేతాలు జనంలోకి వెళతాయి. అది వైసీపీ భవిష్యత్తుకి అస్సలేమాత్రం మంచిది కాదు. చంద్రబాబుపై చర్యల సంగతి తర్వాత.. ముందంటూ కొడాలి నానిని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే.