ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎక్కువ మంది ఆశ్రయించే పేరు ఒక్కటే అదే చికెన్. తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఈ ఆహారం ప్రోటీన్‌కు మంచి వనరుగా మారింది. జిమ్‌కు వెళ్లే యువత నుంచి, డైట్ పాటించే వారివరకు అందరి ప్లేట్‌లో చికెన్ తప్పనిసరిగా ఉంటోంది. కానీ చికెన్ మంచిదే కదా అని ప్రతిరోజూ తింటే నిజంగా శరీరానికి లాభమా? లేక తెలియని ప్రమాదాలున్నాయా.. అన్న ప్రశ్నలకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు మెకెంజీ బర్గెస్ ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు.
చికెన్‌ను సూపర్ ప్రోటీన్ గా పిలుస్తారు. మన శరీరానికి అత్యవసరమైన అమైనో ఆమ్లాలన్నీ ఇందులో దాదాపుగా లభిస్తాయి. ముఖ్యంగా శరీరం తయారు చేసుకోలేని తొమ్మిది ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు చికెన్‌లో సమృద్ధిగా ఉంటాయి. కేవలం నాలుగు ఔన్సుల చికెన్ తీసుకుంటేనే సుమారు 35 గ్రాముల లీన్ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణాల మరమ్మత్తుకు కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, చికెన్‌లో ఉండే బి విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరానికి శక్తినిస్తాయి. ఎక్కువసేపు ఆకలివేయకుండా ఉండటం వల్ల బరువు నియంత్రణలో కూడా చికెన్ ఉపయోగపడుతుంది.
అయితే అన్ని భాగాలు ఒకేలా ఆరోగ్యకరమా అంటే కాదనే వైద్యులు చెబుతున్నారు. చికెన్ బ్రెస్ట్‌లో కేలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వారికి ఇది మంచి ఎంపిక. మరోవైపు లెగ్ పీస్ రుచి ఎక్కువగా ఉన్నా, ఇందులో కొవ్వు మరియు సోడియం మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి రుచికే ప్రాధాన్యం ఇస్తే లెగ్ పీస్, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తే బ్రెస్ట్ పీస్ అన్నది నిపుణుల సూచన.
అయితే ఇక్కడే ఒక కీలక హెచ్చరిక ఉంది. చికెన్ ఎంత మంచి ఆహారమైనా, కేవలం దానిపైనే ఆధారపడితే కొన్ని పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది. చికెన్ బ్రెస్ట్‌లో కొవ్వు చాలా తక్కువగా ఉండటంతో, శరీరానికి అవసరమైన ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అందవు. అలాగే ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు చికెన్ ద్వారా మాత్రమే లభించవు. అందుకే చికెన్‌తో పాటు ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి మంచి కొవ్వులు, ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలని బర్గెస్ సూచిస్తున్నారు.
ప్రోటీన్ అంటే చికెన్ ఒక్కటే కాదు అంటున్నారు నిపుణులు. వారంలో కొన్ని రోజులు సాల్మన్ వంటి చేపలు, గుడ్లు, పెరుగు వంటి జంతు వనరులు, అలాగే టోఫు, పప్పుధాన్యాలు, గింజల వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని కూడా ఆహారంలో చేర్చుకుంటేనే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సమతుల్యంగా అందుతాయి. అంటే చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ అది ఒంటరిగా కాదు.. సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే.
