కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు సంపాదించారు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించగానే, అన్నగారి బాటలో నడిచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 1983 నుండి 1999 వరకు ఐదుసార్లు టీడీపీ తరపు నుండి గెలుపొందారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఉన్నత విద్యాశాఖామంత్రిగా పదేళ్లకు పైగా పని చేసారు.
1999 నుండి 2004 వరకు మొట్టమొదటి మహిళా స్పీకర్ గా పని చేసి రికార్డు నెలకొల్పారు. 2004 లో ఎచ్చెర్ల నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండ్రు మురళి చేతిలో అపజయం పాలయ్యారు. అయితే 2009 లో నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా ఉన్న ఎచ్చెర్ల జనరల్ సీటుగా మారింది. కొత్తగా ఏర్పడిన రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ కేటగిరిలో చేరింది.
దీంతో ప్రతిభా భారతి మకాం రాజాం కు మారింది. అయితే ఆమె స్వగ్రామం కావలి కూడా రాజాం నియోజక వర్గంలోని సంతకవిటి మండలంలోనే ఉండడంతో ఇక్కడ కూడా తనకి ఎదురులేదని భావించారు. కానీ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళి చేతిలో, 2014 లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగుల చేతిలో అపజయం పాలయ్యారు. రెండుసార్లు ఓడిన ఆమె ఈసారి ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు. కానీ పార్టీలో సొంత కేడర్ నుండే ఆమెకు వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న క్యాడర్ తో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారని చెబుతున్నారు.
టీడీపీలోని కొందరు నాయకులు ఏకంగా ఆమె నాయకత్వానికి వ్యతిరేకంగా అధిష్టానం ముందు గొంతెత్తడంతో రాజాం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నేతల లెక్కలు నేతలకుంటే కేడర్ లెక్కలు కేడర్ కి ఉంటాయి. ఇవే ఇప్పుడు రాజాం టీడీపీలో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండిపోవలసి వచ్చిందని, ప్రతిభా వ్యవహారశైలితో విసిగిపోతున్నామని రాజాం కేడర్ భావిస్తోందని రాజకీయ వర్గాల్లో వినికిడి. ప్రజల సంగతి తర్వాత ఆఖరికి పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ప్రతిభా తీరు సరిగ్గా లేదని భావిస్తున్నారని తెలుస్తోంది.
ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో అమ్మ ఎక్కడ ఉంటె నేను అక్కడే అనే విధంగా ఆమె వాలిపోతూ ఉంటారని కార్యకర్తలు అంటున్నారు. అయితే ప్రతిభా భారతి వ్యవహారశైలి నచ్చక ఒకవైపు కార్యకర్తలు చెప్పుకోలేక మదనపడిపోతుంటే ఆమె కూతురు గ్రీష్మ వ్యవహారశైలి కూడా ఇబ్బంది పెడుతోందని కొందరు సీనియర్ టీడీపీ లీడర్లు బాహాటంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
రాజాం నియోజక వర్గంలో కేడర్ తనకి వ్యతిరేకంగా మారటానికి కారణం కళా వెంకట్రావు అని ప్రతిభా భారతి భావిస్తున్నారని తెలుస్తోంది. ఓ నెల రోజుల క్రితం జిల్లాలోని ఆర్ అండ్ బీ బంగళాలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇంచార్జి మంత్రి ముందు ఈ గోలంతా వెళ్ళగక్కారట. తానూ పార్టీలో సీనియర్ నేతని అని, తన నియోజకవర్గంలో ఆయన పెత్తనమేమిటంటూ కళా వెంకట్రావుపై ఇంచార్జి మంత్రి పితాని సత్యనారాయణకు ప్రతిభా భారతి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల సమాచారం.
ఈ విషయం తెలిసిన రాజాం తెలుగు తమ్ముళ్లు తెల్లవారేసరికి ఒక మీటింగ్ పెట్టేసుకుని…ప్రతిభా భారతితో మేము విసిగిపోయాం, మాకు ఆమె నాయకత్వం వద్దంటూ మీడియాకి ఎక్కేసారు. అక్కడితో ఆగకుండా విజయనగరం పార్లమెంటు సభ్యులు అశోక్ గజపతిరాజు, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి మంత్రి ఘంటా శ్రీనివాసరావుని కలిసి తమ గోడంతా వెళ్లబోసుకున్నారు. అక్కడ కూడా పంచాయతీ తేలకపోవడంతో ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసారని సమాచారం.
ప్రతిభా భారతి నాయకత్వంలో పని చేయలేమని తేల్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పక్క ప్రతిభా భారతికి వ్యతిరేకత చుట్టుముడుతుంటే మంత్రి కళా అవకాశాన్ని ఉపయోగించుకుంటారని వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొండ్రు మురళిని సైకిలెక్కించేందుకు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారని రాజాంలో టాక్ నడుస్తోంది. పైగా రాజాంలో కొండ్రు మురళికి మంచి పేరుండటం ఇక్కడ పాజిటివ్ గా మారింది. గెలుపు గుర్రాలకే టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వాలని భావించి కొండ్రుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఈ నెల 31 న కొండ్రు టీడీపీ కండువా కప్పుకోడానికి రెడీ అవుతుంటే…ప్రతిభా మాత్రం రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
పార్టీలో ఎన్నో పదవులు చేపట్టి, అన్నగారి సమయం నుండి బాబుగారి హయాం వరకు పార్టీ కోసం పని చేశాను. నన్ను కాదని కొండ్రుకి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని తన అనుచరుల వద్ద ప్రతిభా వాపోతున్నట్టు తెలుస్తోంది. తనని కాదని కొత్తగా పార్టీలోకొచ్చే కొండ్రుకు టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించేందుకు ఆమె సిద్ధం అవుతున్నట్టు రాజాంలో టాక్ వినిపిస్తోంది.
జరుగుతున్న వ్యవహారమంతా తనకి చెక్ పెట్టడానికి కళా వెంకట్రావు వేసిన ప్లాన్ గా భావిస్తున్న ప్రతిభ ఎచ్చెర్ల నియోజక వర్గంలో ఆయనను ఇరుకున పెట్టే పనిలో ఉన్నారట. అందుకోసం ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళకు ఉన్న వ్యతిరేక నాయకులతో ఫోన్ లో మంతనాలు జరిపి బలాన్ని కూడదీసే పనిలో ఉన్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు మంత్రి అచ్చెన్నకు, కళాకు పొసగదని టాక్ ఎలాగో ఉంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అచ్చెన్నతో చేతులు కలిపి రాజాంలో తన బలం తగ్గడానికి కారణమైన నాయకులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆమె రాజకీయ వ్యూహ రచనలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల నుండి తెలుస్తున్న సమాచారం.