Turkey – India: టర్కీకి భారత్ కౌంటర్: ఒప్పందాలు రద్దు, భద్రతా అనుమతుల రీకాల్

పహల్గామ్‌లో ఉగ్రదాడులు, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌కు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీపై దేశం తగినదైన ప్రతిస్పందన చూపిస్తోంది. వ్యాపార సంబంధాల్లోనూ దేశ భద్రతకు ముఖ్యమైన రంగాల్లోనూ టర్కీకి చెందిన సంస్థలపై భారత్ కఠినంగా స్పందించింది. తాజాగా, అదానీ ఎయిర్‌పోర్ట్స్ మరియు పౌర విమానయాన శాఖ రెండు కీలక నిర్ణయాలతో టర్కీకి బిగ్ షాక్ ఇచ్చాయి.

అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ సంస్థ టర్కీకి చెందిన డ్రాగన్‌పాస్ సంస్థతో ఉన్న లాంజ్ సేవల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసింది. ఈ మార్పుతో అదానీ నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్ట్‌లలో డ్రాగన్‌పాస్ వినియోగదారులకు ఇక ప్రవేశం ఉండదు. అయితే, ఇతర ప్రయాణికుల లాంజ్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సంస్థ స్పష్టం చేసింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది.

టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌కు భద్రతా అనుమతులను కేంద్ర పౌర విమానయాన శాఖ రద్దు చేసింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 70% గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఈ సంస్థపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సహాయ మంత్రి మురళీధర్ మొహొల్ వెల్లడించారు.

ఇక టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె, ఆమె భర్తకు ఈ సంస్థలో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. బైరక్టార్ డ్రోన్ల రూపకర్తగా పేరొందిన సెల్కుక్, పాక్‌కు భారత వ్యతిరేకంగా సహాయం చేస్తున్న వ్యవహారం నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ చర్యలు వ్యూహాత్మకంగా సాగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.