ఉగ్రవాదం నిర్మూలనపై భారత్ తీసుకున్న తాజా వ్యూహాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో, ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ఇచ్చాం కానీ, అది పూర్తిగా ముగిసినది కాదు” అని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనీ, ఉగ్ర మూలాలను సమూలంగా అరికట్టే వరకు చర్యలు ఆగవని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్ లోపల ఉగ్ర శిబిరాలపై టార్గెట్‌గా దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. మే 10న నిర్వహించిన నూర్ ఖాన్ స్థావరంపై దాడిని రాయబారి గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు.
జేపీ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో మరో కీలక అంశం ఏమిటంటే, 26/11 ముంబై దాడుల్లో కీలకంగా ఉన్న తహవూర్ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించినట్టుగానే, ఇప్పుడు పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, లఖ్వీ వంటి ఉగ్రవాదులను కూడా భారత్‌కు అప్పగించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై భారత్ ఓపికతో కానీ తీవ్రతతో వ్యవహరిస్తోందని గుర్తు చేశారు.
ఇక భారత్ లక్ష్యం కేవలం ఉగ్రశిబిరాలు మాత్రమేనని రాయబారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ అయితే భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. దీని నేపథ్యంలో, పాక్ డీజీఎంఓలు కాల్పుల విరమణపై సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. భారత వైఖరి వల్లే వారి మానసిక స్థితిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదం పుట్టుకనే లేకుండా చేయాలన్నదే భారత్ దృష్టి అని జేపీ సింగ్ పేర్కొన్నారు. మోసపూరిత సంభాషణలు కాదు, సహజమైన చట్టపరమైన చర్యలే ఉండాలన్నదే న్యూఢిల్లీలోని అధికారిక అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.