‘కుక్క తోక వంకర’ అన్న సామెత పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఎంతసార్లు దెబ్బ తిన్నా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా ఆ దేశం తీరు ఏమాత్రం మారదు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పనిలో పాక్ ఎప్పటికీ మారదు. 2025 ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో విరుచుకుపడి పర్యాటకులపై విచక్షణరహిత కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 26 మంది నిర్భాగ్య పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
భారత వాయుసేన, రాకెట్ దళాలు చేసిన మెరుపు దాడులతో పాక్ ఉగ్రక్యాంపులు నామరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి. ఆ దెబ్బతో పాక్ ఉగ్రవాదానికి పెద్ద దెబ్బే తగిలింది. కానీ ఇప్పుడు పాక్ మరోసారి తన అసలు స్వరూపం బయటపెట్టింది. భారత్ దాడులతో చితికిపోయిన ఉగ్రస్థావరాలను మళ్లీ పునర్నిర్మాణం చేస్తున్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
పాక్ ప్రభుత్వ మద్దతుతో, ఆ దేశ సైన్యం, గూఢచారి విభాగం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ఈ పునర్నిర్మాణానికి పూనుకుందని తెలుస్తోంది. పీవోకేతో పాటు పాక్ సరిహద్దు ప్రాంతాల్లోనే కొత్తగా లాంచ్ ప్యాడ్‌లు, ట్రైనింగ్ క్యాంపులు మళ్లీ వెలిశాయని సమాచారం. భారత్ నిఘా వర్గాలు ఈ పరిణామాలను పరిశీలిస్తోంది. దీంతో పాక్ బుద్ధి ఎప్పటికీ మారదు అన్న భావన కలుగుతోంది. మరోవైపు.. భారత్ ఇప్పటికే ఉగ్రమూలాలను నిర్మూలించేందుకు బలంగా ఉన్నందున, పాక్‌కి ఇంకా కఠిన సమాధానం సిద్ధంగా ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.