పాక్ లో ఇండియన్: పబ్జీ కాదు – ఎఫ్.బి.కాదు… ట్విస్ట్ ఇదే!

పబ్ జీ ప్రేమలో పడి పాకిస్థాన్ కు చెందిన ఒక వివాహిత మహిళ… తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. పబ్ జీ లో పరిచయమైన ఒక యువకుడితో పేమలో పడి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో పాక్ లోని తన భర్తతో విడాకులు తీసుకుని, తన వాటాగా వచ్చిన ఇల్లు అమ్ముకుని వచ్చిన డబ్బులు తీసుకుని బయలుదేరింది.

ఈ నేపథ్యంలో తన నలుగురి పిల్లలను తీసుకుని పాక్ నుంచి దుబాయ్ వెళ్లి, అక్కడ నుంచి నేపాల్ వచ్చి ప్రియుడిని కలుసుకుని, ఇద్దరూ కలిసి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. ఇది నిజంగా ప్రేమతో కూడిన వ్యామోహమేనా.. లేక, ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగమా అనే దిశగా ఆమెను విచారిస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా రెండు అంజు అనే మహిళ… పాక్ యువకుడిని ఫేస్ బుక్ లో ప్రేమించింది. అందులో భాగంగా రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిపోయింది. ఆమెకు అప్పటికే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా వాళ్ల ఫ్యామిలీలో అత్యధికులు బి.ఎస్.ఎఫ్. లో పనిచేస్తున్నారు. ఈమె మాత్రం పెళ్లైనతర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. పాకిస్థాన్ లోని ఫేస్ బుక్ ఫ్రెండ్ తో పరారై పోయింది.

అధికారికంగా పాకిస్థాన్ కు చేరుకుని, అక్కడ మతం మార్చుకుని, ఫాతిమాగా పేరుమార్చుకుని… ఆ యువకుడిని పెళ్లిచేసుకుంది. ఇలా గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఇండియా మధ్య ప్రేమ పక్షులు తిరుగుతున్నాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి తాజాగా ఇండియా నుంచి పాక్ కి తన ప్రమేయం లేకుండానే వెళ్లిపోయాడు. కారణం… ప్రేమ కాదు.. మరొకటీ కాదు.. వరదలు!

అవును… పంజాబ్ లో భారీ వరదల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇందులో భాగంగా… భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవేశించే సట్లెజ్ నది వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ సమయంలో పంజాబ్ లోని కసూర్ జిల్లాకు చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

అయితే అతడు ఏకంగా దేశ సరిహద్దులు దాటేశాడు. అలా కొట్టుకుపోయి చివరకు పాకిస్తాన్ లో తేలాడు. భారత పౌరుడు పాకిస్తాన్ లో కనపడటం అక్రమవలస కిందే లెక్క. కారణం వరదైనా.. బురదైనా! దీంతో పాక్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణ చేపట్టి, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తేల్చి తిరిగి భారత అధికారులకు అప్పగించింది. దీంతో… వరదలో భారత్ నుంచి పాక్ కి వెళ్లిన ప్రయాణం అలా సుఖాంతం అయ్యింది.