Pakistan: పాక్‌కు వత్తాసు.. ఆ రెండు దేశాలకు భారీ షాక్!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు పెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు బాసటగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు భారతీయ పర్యాటకుల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. వేసవి సెలవుల సీజన్‌ కావడంతో విదేశీ పర్యటనలకు సిద్ధమైన వేలాది మంది భారతీయులు ఇప్పుడు తమ ప్రయాణ గమ్యస్థానాలను మారుస్తున్నారు. దీంతో టర్కీ, అజర్‌బైజాన్‌ల పర్యాటక ఆదాయంపై బొమ్మకూలే పరిస్థితి ఏర్పడింది.

ప్రముఖ ట్రావెల్ సంస్థలు మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్క వారం వ్యవధిలోనే టర్కీకి బుకింగ్‌లు 60 శాతం తగ్గాయి. అజర్‌బైజాన్ పర్యటనల క్యాన్సిలేషన్లు 30 శాతానికి పైగా పెరిగాయి. దేశానికి సంఘీభావంగా ఈ దేశాలకు సంబంధించిన అన్ని ప్రమోషనల్ ఆఫర్లను నిలిపివేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. “భారత భద్రత, సైనికుల త్యాగాన్ని గౌరవించడం మన బాధ్యత” అని ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ అన్నారు.

2024లో టర్కీ, అజర్‌బైజాన్‌లను కలిపి 6 లక్షల మంది భారతీయులు సందర్శించారు. దాదాపు రూ. 3,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదాయం ఈ దేశాలకు లభించింది. ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చుకోవడం ఆ దేశాలకు సవాలుగా మారనుంది. పాక్‌కు మద్దతిచ్చే దేశాలకు భారతీయుల ఈ బహిష్కరణ చర్య కీలక సందేశంగా మారింది. ఇది దేశ భద్రతపై ఎలాంటి రాజీ లేదని, పౌరుల స్థాయిలోే గట్టి స్పష్టత ఉందని చాటిచెప్పే పరిణామంగా నిలిచింది.