‘ఇండియా కూటమి’ పేరు పెట్టుకుని, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఇదో పెను సంచలనమంటోంది కాంగ్రెస్ పార్టీ. అంత సీన్ లేదని ‘ఇండియా కూటమి’పై విమర్శలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.!
కాంగ్రెస్ పార్టీ అసలు పేరు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. ఐఎన్‌సి.! భారతీయ జనతా పార్టీని బీజేపీ.. అని పిలుస్తారని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు కదా.! బీజేపీలో ‘భారత్’ వుందిగానీ, కాంగ్రెస్ పార్టీలో ‘ఇండియా’ అన్న ప్రస్తావన పెద్దగా వుండదు. అలాంటిది, ‘ఇండియా కూటమి’ అని ఎలా పేరు పెట్టారబ్బా.?
ఏమోగానీ, భారతదేశం పేరుని, ఇండియాగా కాకుండా, కేవలం ‘భారత్’గా మాత్రమే మార్చేందుకు కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నిస్తోందట. ఈ విషయమై సోషల్ మీడియాలో నానా యాగీ జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం రచ్చ రచ్చ చేస్తోంది.
పేరైతేనేం.. మనం భారతీయులం.. మనం ఇండియన్స్.! ఇందులో ఎలాంటి మార్పూ లేదు. సింధు నాగరికత.. ఈ క్రమంలో సిందియా అనే ప్రస్తావన, చివరికి అది బ్రిటిషర్ల పుణ్యమా అని ఇండియాగా మారిందనేది ఓ వాదన. కాదు కాదు, హిందీ.. ఇందీ.. ఇండియా అయ్యిందన్నది ఇంకొందరి ఉవాచ.
ఎవరి గోల వారిది.! వియ్ ఆర్ ఇండియన్స్.! మనం భారతీయులం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రెండు పేర్లూ మనవే.. మన దేశానివే. ఇండియా జెండా ఎగరాలి.. భరత జాతి ఆత్మగౌరవం జాతీయ జెండా రూపంలో రెపరెపలాడాలి.!
కానీ, రాజకీయం ఊరకే వుండదు కదా.! పేర్ల ముసుగులో సరికొత్త.. అత్యంత నీఛ.. రాజకీయానికి తెరలేపింది. ఈ రాజకీయం ఎక్కడిదాకా వెళుతుందో ఏమో.!