టాప్ 5 లో భారత్… 2014 నుండి ఆర్థికంగా అధిగమించిన దేశాలివే!

దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా మణిపూర్ ఘటన ఒకపక్క మెదడును తొలిచేస్తున్నా.. మరోపక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేశారు ప్రధాని మోడి. అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక విషయాలు వెల్లడించారు.

అవును… 2014లో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ప్రధాని వెల్లడించారు. ఈ క్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రకటించారు.

ఈ క్రమంలో భారతదేశం ఎన్ని దేశాలను అధిగమించిందో చూపించే వీడియోను ప్రభుత్వం పంచుకుంది. భారతదేశం.. రష్యా, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకేలను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వీడియోలో వివరించారు. అంతేకాకుండా.. వచ్చే ఐదేళ్లలో భారతదేశం మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోడీ అన్నారు.

2014లో అమెరికా 17,629 బిలియన్ డాలర్లతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అగ్రస్థానంలో ఉండగా… 10,595 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మిగిలిన స్థానాల్లో వరుసగా… జపాన్ (4,843).. జర్మనీ (3,872).. యూకే (3,062).. ఫ్రాన్స్ (2,842).. బ్రెజిల్ (2,434).. ఇటలీ (2,151).. రష్యా (2,025).. భారత్ (1,560) బిలియన్ డాలర్లతో ఉంది.

అయితే 2023కి వచ్చేసరికి… రష్యా, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకేలను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ (3,894 బిలియన్ డాలర్స్) నిలిచింది. ప్రస్తుతం అమెరికా (26,695).. చైనా 21,865).. జపాన్ (5,291).. జర్మనీ (4,565)లు మొదటి నాలుగు స్థానాల్లోనూ కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో భారత్ 2014 లో 1,560 బిలియన్ డాలర్లతో ఉండగా… 2015లో 2,180.. 2016లో 2,597.. 2017లో 2,684.. 2018లో 2,751.. 2019లో 2,791.. 2020లో 2,803.. 2021లో 3,168.. 2022లో 3,469.. 2023 లో ప్రస్తుతం 3,894 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని ఐదో ఆర్థిక వ్యవస్థగా ఉంది.

ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా మారనుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా… 2024కి 4,298… 2025కి 4,625… 2024కి 4,966 బిలియన్ డాలర్లతో జర్ననీని కిందకు నెట్టి నాలుగోస్థానానికి వెళ్తుందని చెప్పుకొచ్చారు. అనంతరం 2028 నాటికి 5,575 బిలియన్ డాలర్లతో జపాన్ ని సైతం కిందకు నెట్టి… ప్రపంచంలోని టాప్ 3 వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు.