మొదటి దశ ఏకగ్రీవాల్లో వైసీపీ సత్తా చాటింది.. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి. అయినాగానీ, వైసీపీలో సంతృప్తి కనిపించడంలేదు. నిజమే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలవంతపు ఏకగ్రీవాల విషయమై సీరియస్ చర్యలు తీసుకుంటామని ప్రకటించి వుండకపోతే, ఇప్పుడు అయిన ఏకగ్రీవాలకు డబుల్ ఏకగ్రీవాలు జరిగి వుండేవన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వైసీపీ వర్గాలు ఇదే విషయాన్ని బలంగా నమ్ముతున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల విషయమై ఎస్ఈసీ అనుమానాలు వ్యక్తం చేయడం, తగిన నివేదికల్ని సంబంధిత అధికారుల నుంచి కోరడం వైసీపీకి ఆగ్రహం తెప్పించింది. ప్రధానంగా మంత్రలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ..
ఈ రోజు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మల్యే రోజా అయితే, ‘నిమ్మగడ్డ చిన్న మెదడు చితికిపోయింది’ అనేశారు. ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు.. కొంత ఇబ్బందికరమే అధికార పార్టీ నేతలకి. నిమ్మగడ్డ మీద సభా హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన వైసీపీ ముఖ్య నేతలు, రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న నిమ్మగడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదన్న కనీస విజ్ఞతను ప్రదర్శించలేకపోవడం శోచనీయమే. అసలు ఎందుకిదంతా జరుగుతోంది.? వైసీపీనే అధికారంలో వుంది. ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాల్లో వైసీపీదే పై చేయి. పోలింగ్ జరిగాక కూడా, మెజార్టీ స్థానాలు వైసీపీ మద్దతుదారులే గెలుచుకుంటారు. అయినా, ఎందుకు వైసీపీ ఇంతలా బెదిరిపోవాలి.? వైసీపీ ముఖ్య నేతల ఉద్దేశాలు ఏవైనా, వారి మాటలు తప్పుడు సంకేతాల్ని పంపుతున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాల్ని పాటిస్తే, అధికారుల్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి అధికారులను హెచ్చరించడాన్ని సభ్య సమాజం హర్షించదు. ఇలాంటి బెదిరింపు వాతావరణంలో అధికారులెలా పనిచేయగలుగుతారు.? అన్న ప్రశ్న సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.