వైఎస్‌ జగన్‌.. ఈ పరీక్షలో గెలుస్తారా.? ఓడతారా.?

Implications for Jagan from the Courts.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అతి ముఖ్యమైన పరీక్ష రాయబోతున్నారు. ఓ వైపు క్రిస్‌మస్‌.. ఇంకో వైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం.. వెరసి.. డిసెంబర్‌ 25 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ప్రత్యేకమైనది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికీ అంతకన్నా ప్రత్యేకమైన పర్వదినం ఇది. నిజానికి, ఇది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అసలు సిసలు పరీక్షా సమయం. ఎందుకంటే, రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాల్ని లబ్దిదారులకు అందజేయబోతున్నారు. కరోనా వైరస్‌, భూ వివాదాలు ఈ క్రమంలో న్యాయస్థానాల నుంచి ఎదురైన చిక్కులు.. వెరసి, 2020 మార్చిలో ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు కాస్తా, డిసెంబర్‌ 25వ తేదీకి వాయిదా పడ్డాయి.

Implications for Jagan from the Courts.
Implications for Jagan from the Courts.

ఈ రోజు కూడా ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. అయితే, ఈసారి ప్రభుత్వానికి న్యాయస్థానం నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. అయితే, ఇది అసలు సిసలు పరీక్ష.. అని ఎందుకు అనాల్సి వస్తోందన్నదే ఇక్కడ కీలకమైన అంశం. టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించే ప్రక్రియ కూడా జరగబోతోంది. అవి ఇచ్చేస్తే సరిపోదు.. మౌళిక సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవి లేనప్పుడు టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వడంలో అర్థమే లేదు. ఇక, ఇళ్ళ పట్టాల విషయానికొస్తే.. కొన్ని చోట్ల అత్యద్భుతమైన లే అవుట్లను ఏర్పాటు చేశారు. అవి చూడ్డానికి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలా కనిపిస్తున్నాయి. పట్టణ పేదలకు ఒక సెంటు, గ్రామీణ పేదలకు సెంటున్నర భూమి.. ఇస్తున్న విషయం విదితమే. అయితే, అది ఓ కుటుంబం నివసించడానికి సరిపోతుందా.? లేదా.? అన్న వాదన కూడా వుంది.

భూములు ఇచ్చేసి ఊరుకోవడంలేదు.. వాటిల్లో ఇళ్ళను కూడా నిర్మించి ఇస్తామంటోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. నిజంగానే, ఇది అత్యద్భుతమైన సంక్షేమ పథకంగా చెప్పుకోవచ్చు. కానీ, ఆ భూములు ఎక్కడున్నాయి.? కొన్నేమో కొండ వాలులో వున్నాయనే విమర్శలున్నాయి.. కొన్ని ముంపు ప్రాంతాల్లో వున్నాయనే విమర్శలున్నాయి.. కొన్ని భూముల విషయంలో ‘స్మశానాల్లోనే’ అన్న ఆరోపణలున్నాయి. మరి, ఆ ఆరోపణల్లో నిజమెంత.? విమర్శల్లో వాస్తవమెంత.? అన్నది లబ్దిదారులకు ఆయా భూములు ఇచ్చాక ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ళ పట్టాల పంపిణీ వ్యవహారం పూర్తయితే.. డిస్టింక్షన్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాస్‌ అయినట్లే. ఇది రాజకీయంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అత్యంత విలువైన విజయం అవుతుంది.