నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, లేఔట్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని కూల్చివేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పాశిం సునీల్ కుమార్ (గూడూరు), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట)తో ఆయన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఎమ్మెల్యేలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా రూ. 10 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా గూడూరుకు రూ. 73 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న పనికిరాని డ్రైనేజీలను పూడ్చడానికి రూ. 28 వేల కోట్ల ఖర్చు అవుతుందని మంత్రి వివరించారు. మొదటి విడతగా రూ. 4 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, లేఔట్లు నిర్మిస్తే వాటిని ఉపేక్షించబోమని, కచ్చితంగా కూల్చివేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

