2014 నుంచి 2019 మే నెల వరకు సాగిన చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, బంధుప్రీతి వరదలు పారిందని, లక్షల కోట్ల ప్రజాసంపద దోపిడీకి గురైందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసిపి అనేకసార్లు ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు దోపిడీ మీద విచారణ జరిపిస్తామని, అవినీతిపరులనుంచి కాజేసిన ప్రజాధనాన్ని కక్కిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అంతేకాకుండా, ఎవరెవరు ఏఏ శాఖలనుంచి ఎంతెంత మొత్తాన్ని దోచుకున్నారో సవిస్తరంగా ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించి, నాటి హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్, మరియు కొందరు కేంద్రమంత్రులకు అందించింది.
వైసిపి చేసిన ఆరోపణల ప్రకారం సుమారు అయిదు లక్షల కోట్ల రూపాయల సంపదను చంద్రబాబు ప్రభుత్వం దోచేసింది. చంద్రబాబు అవినీతిని ప్రజలు కూడా విశ్వసించారు కాబట్టే అత్యంత కఠినంగా శిక్షించారు. చివరకు ఆయన సొంత కుమారుడిని కూడా ఘోరంగా ఓడించారు. అయితే…ప్రజాకోర్టులో శిక్ష పడినంతమాత్రాన చట్టబద్దమైన కోర్టులో శిక్షను ఉపేక్షించలేము కదా! రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన దోపిడీని నిరూపించి అవినీతిపరులను కారాగారాలకు నెట్టాల్సిన కర్తవ్యమ్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నదనటంలో సందేహం లేదు.
జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత ఎప్పుడెప్పుడు చంద్రబాబు మీద విచారణ జరుగుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే ఎన్నాళ్ళు చూసినా అలాంటిదేమీ జరగలేదు. దాంతో “రాజకీయనాయకులు అందరూ ఒకటే” అనే నిర్వేదానికి లోనయ్యారు. చంద్రబాబును కేంద్రం నుంచి ఎవరో రక్షిస్తున్నారని, అందువల్లనే ఆయన మీద దర్యాప్తుకు వెనుకాడుతున్నారని, పైగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక సందర్భాల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టడం, కొట్టెయ్యడం లాంటి చర్యలతో జగన్ వెనక్కు తగ్గారేమో అన్న అభిప్రాయం కూడా అంకురించింది. దానికితోడు ఎన్నికల్లో ఓడిపోయింది లగాయతు మోడీ భజనలో పీకలదాకా మునిగారు చంద్రబాబు. కేంద్రం కూడా ఏమైనా అభ్యంతరాలు పెడుతుందేమో అని భావిస్తున్నారేమో అన్న సందేహాలు కూడా కలిగాయి.
ఇక చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిమీద విచారణ జరగదు అనే నిర్ణయానికి ప్రజలు దాదాపు వచ్చేసిన తరుణంలో చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డారు జగన్. దాంతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. ముఖ్యంగా తెలుగుదేశంలో బలమైన నాయకుడు, ఐదేళ్లు మంత్రిగా వెలగబెట్టినవాడు, ప్రస్తుతం శాసనసభలో పార్టీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు మీద కొరడా ఝళిపించారు జగన్. అచ్చెన్నాయుడు బీసీ నేత అని కూడా ఏమాత్రం జంకకుండా జగన్ ఉగ్రతాండవం చెయ్యడంతో తెలుగుదేశం పార్టీ మొత్తం గజగజ వణికిపోయింది. పైకి ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడినా, అచ్చెన్న కోసం హైద్రాబాద్ నుంచి చంద్రబాబు గుంటూరుకు పరిగెత్తుకెళ్ళడం, కాగడాల ప్రదర్శన చెయ్యడం, ఆసుపత్రి ముందు ఆందోళనలు చెయ్యడం చూస్తే చంద్రబాబు ఎంతగా భయపడిపోతున్నారో ఊహించడం కష్టం కాదు.
కార్మికులు శ్రమించి కూడబెట్టుకున్న సొమ్మును అచ్చెన్నాయుడు, ఆయన అధికారులు పందికొక్కుల్లా మెయ్యడం ఏమాత్రం సహించరానిది. ఒక్కరోజు క్రితమే సర్జరీ చేయించుకున్నప్పటికీ, ఏమాత్రం జాలి చూపకుండా, శ్రీకాకుళం లోని నిమ్మాడ నుంచి తాడేపల్లికి కారులో ఈడ్చుకొచ్చారంటే అవినీతిపరుల పట్ల జగన్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందో రుచి చూసినట్లయింది. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు పదిమంది అధికారులను అరెస్ట్ చెయ్యగా, పారిపోయిన మరో పదిమంది కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
అచ్చెన్నాయుడు వ్యవహారంతో నరాలు వణుకుతుండగానే ఆ మరునాడే హైద్రాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రిలో బలమైన నాయకుడు జెసి ప్రభాకర రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్లడం, చివరకు జైలులో బంధిచడం మరొక సంచలనం సృష్టించింది. జెసి సోదరుల జోలికి వెళ్ళడానికి గత నలభై ఏళ్లుగా ఏ ఒక్క ప్రభుత్వానికి దమ్ము లేకపోయింది. వారి ఆగడాలను భరించడం, పదవులు ఇచ్చి మచ్చిక చేసుకోవడం తప్ప వారి ఇంటి గుమ్మం తొక్కే సాహసం కూడా ఏ పోలీసు అధికారి, పార్టీ సాహసం చేయలేకపోయాయి. ఒళ్ళు కొవ్వెక్కి రంకెలు వేస్తున్న ఆంబొతుకు ముకుతాడు వేసి మూతికి చిక్కాలు బిగించి ముట్టెపొగరు దించినట్లు ఇద్దరు జెసి సోదరులకు భయంతో నిద్రలేని రాత్రులను సృష్టించడం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అయింది. వాహనాల కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వ్యవహారంలో ప్రభుత్వాన్ని, వ్యాపారులను మోసం చేస్తూ కోట్ల రూపాయలను ఆర్జించిన జెసి సోదరుల దుర్మార్గాలకు ఆ విధంగా కళ్లెం పడింది.
ఇక రాజధాని భూముల వెనుక ఉన్న కుంభకోణాలను, ఇసుకదోపిడీ అక్రమాలను, ఫైబర్ గ్రిడ్ మోసాలను వెలికి తీసి శిక్షించడం జగన్ కు మాత్రమే సాధ్యం అవుతుందని జనానికి ఇప్పుడు నమ్మకం కుదిరింది. చంద్రబాబును, లోకేష్ ను బోనెక్కించే దృశ్యాలను చూడాలని ప్రజలు కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూస్తున్నారు.
అయితే, జగన్ అవినీతిపరుల మీద పోరు ప్రకటించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారు? ఆలోచిస్తే ఈ విషయంలో జగన్ చాలా తెలివిగా పధకం వేశారని భావించవచ్చు. మొదటి ఏడాది మొత్తం నవరత్నాల అమలు ద్వారా దాదాపు అరవై శాతం ప్రజలను సంతృప్తి పరచారు. వివిధ సంక్షేమ పధకాల కింద నలభై వేలకోట్ల రూపాయలను ఖర్చు చేసి మెప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మీద విచారణ మొదలు పెడితే దాన్ని కక్ష సాధింపు చర్య అని రాజకీయ పార్టీలు నానా అల్లరీ చేస్తాయి. ప్రజలు కూడా అలాగే భావించవచ్చు. అలాగే నాలుగేళ్లు గడిచాక అవినీతిపరుల మీద చర్యలు తీసుకుంటే ఎన్నికల ఏడాదిలో మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు అని ప్రజల సానుభూతిని పొందుతారు నిందితులు. రెండు, మూడో ఏడాదిలో అయితే, చంద్రబాబు మీద ఓడిపోయారనే సానుభూతి పూర్తిగా తగ్గడమే కాక, తమకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారన్న అభిమానం జగన్ మీద పెరుగుతుంది. అందువలన జగన్ కు అడ్డు చెప్పరు. జగన్ అనుసరించిన ఈ వ్యూహం ఫలితంగా అచ్చెన్న అరెస్ట్ మీద బీసీ కార్డు ప్రయోగించినప్పటికీ, చంద్రబాబుకు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు పలకలేదు. దానికి తోడు బీసీవారిని అవినీతి బురదలోకి లాగుతున్నారని అసహ్యించుకున్నారు. తన పన్నాగం ఫలించకపోవడంతో చంద్రబాబు నోరు మూతపడింది! రేపెప్పుడైనా చంద్రబాబును అరెస్ట్ చేసినా, ప్రజలు ఎవ్వరూ స్పందించరు.
జగన్ ఆలోచనలు, పన్నాగాలు అర్ధం చేసుకోవడానికి వృద్ధతరానికి అర్ధం కావేమో? ఏమైనప్పటికీ, అవినీతిపరులను, దోపిడీదారులను జగన్ శిక్షించి తీరాలని ఐదుకోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు