2019 సంవత్సరం నవ్యంధ్ర చరిత్రలో మే నెల చివరివారం ఒక మహోజ్వల ఘట్టానికి పునాదివేసింది. అయిదేళ్లపాటు సాగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనకు చరమగీతం పాడి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొట్టారు. మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ ఎల్లో మీడియా, కొందరు అమ్ముడుపోయిన కుహనా సెఫాలజిస్టులు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టి వైసిపికి కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆంధ్రులు. చరితలో తొలిసారిగా యాభై శాతం ఓటింగ్ తో, 175 స్థానాలకు గాను 151 అసెంబ్లీ సీట్లు, 25 లోక్ సభ సీట్లకు గాను 22 సీట్లు గెలిపించి ప్రత్యర్థులను దిగ్భ్రాంతిలో ముంచెత్తారు.
ఇక “ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను ముఖ్యమంత్రిని కానివ్వను” అంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోరపరాజయం చెందడం, ఆయన సోదరుడు పోటీ చేసిన లోక్ సభ స్థానంలో ఓడిపోవడం జనసేన పార్టీని, జనసైనికులను నిరుత్తరులను గావించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు కనీసం ధరావతులు కూడా దక్కకపోవడం పెద్ద విశేషం. జాతీయస్థాయిలో రెండోసారి విజయదుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీకి నోటా “కన్నా” తక్కువ ఓట్లు రావడం పార్టీని సున్నా చేసి పరువు పోగొట్టింది.
ఇక మే నెల ముప్ఫయి వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడం, ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో ఉండడటంతో తాను హామీ ఇచ్చిన నవరత్న పధకాలను శరవేగంగా అమలు చెయ్యడం ప్రారంభించారు జగన్. వాటిలో చెప్పుకోదగిన గొప్ప సంపద, సంస్కరణ ఏమిటంటే గ్రామ సచివాలయ వ్యవస్థను సమూలంగా సంస్కరించడం, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం. ఈ విధానం ద్వారా సుమారు నాలుగు లక్షలమంది చదువుకున్న నిరుద్యోగులకు శాశ్వత ఉపాధి దొరకడమే కాక ప్రజాసేవలు మెరుగయ్యాయి. ప్రభుత్వ పధకాలను ఇంటింటికీ అందించడంలో ఈ వాలంటీర్ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచింది.
ఇక రైతుబంధు పధకం, పింఛన్ పెంపుదల, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వడం, ఆటో, టాక్సీలు నడుపుకుని జీవించేవారికి పదివేలు రొక్కం ఇవ్వడం, దర్జీపనివారు, అర్చకులు, పాస్టర్లు, ముల్లాలు ఇలా ఒకటేమిటి…జగన్ అమలు చేసిన పథకాల్లో లబ్ది పొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి లేదు. ఇక విద్యాసంస్కరణల్లో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పేద కుటుంబాలవారికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పధకం కింద సుమారు రెండువేల రకాల వ్యాధులను చేర్చడం.
అలాగే నలభై మూడువేల బెల్ట్ షాపులను తొలగించడం, మద్యం దుకాణాలను తగ్గించడం, మద్యనిషేధం వైపుగా అడుగులు వేస్తుండటం……ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్ అని గురజాడ అన్నట్లు ఏ విధమైన ప్రచారార్భాటం లేకుండా, విమర్శలను పట్టించుకోకుండా జగన్ తన పని తాను చేసుకునిపోవడం చూస్తుంటే జగన్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డికి కొడుకా, తాతా అని ఆశ్చర్యం కలుగుతుంది. వైఎస్ కూడా “ఇచ్చిన వాగ్దానాలు అన్నీ అమలు చేసాము. ఇంకా ఏమి చెయ్యాలో చెప్పండి” అని తెలుగుదేశం పార్టీవారికి అసెంబ్లీలో సవాలు విసిరేవారు! ఇప్పుడు జగన్ వైఖరి కూడా అదేవిధంగా కనిపిస్తున్నది.
ఇటీవల విశాఖలో జరిగిన దురదృష్టకర సంఘటనపై జగన్ అత్యంతవేగంగా స్పందించారు. నభూతో నభవిష్యతి అన్నట్లు మృతుల కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్ మీదున్నవారికి లక్ష రూపాయలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి వినడం.
అయితే కేవలం మెరుపులే కాదు. తొలి ఏడాదిలో కొన్ని మరకలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి జగన్ ప్రభుత్వానికి అనేకమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. జగన్ ప్రభుత్వం జారీ చేసిన అరవైనాలుగు జీవోలను హైకోర్టు కొట్టేసిందంటే అది చాలా తీవ్రమైన విషయంగా చెప్పుకోవాలి. కోర్టులు మాకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాయి…చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పుకోవడం ఆత్మవంచన మాత్రమే అవుతుంది. ఒకటి రెండు కొట్టేస్తే అది వేరు. కానీ, 64 జీవోలను కొట్టేయడం అంటే ఒక ప్రజాప్రభుత్వానికి అత్యంత అవమానకరమైన విషయంగా భావించాలి.
ఎంత బలం ఉన్నప్పటికీ, రాజధాని తరలింపు, హైకోర్టు తరలింపు, ఆంగ్లమీడియం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి జెండా రంగులు వెయ్యడం లాంటి అంశాలు జగన్ కు పెద్ద దెబ్బగా చెప్పుకోక తప్పదు. లోపం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? నియమించుకున్న, నమ్మిన న్యాయసలహాదారుల్లో ఉన్నదా లేక అధికారుల్లో ఉన్నదా లేక కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే లాయర్లలో ఉన్నదా అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు ఉంటె దిద్దుకోవాలి.
ఇలాగే మరికొంతకాలం ప్రభుత్వ నిర్ణయాలను కోర్ట్ తప్పు పడుతుంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. మొన్న డాక్టర్ సుధాకర్ విషయంలో “ప్రభుత్వాన్ని మేము నమ్మం” అని హైకోర్టు చేసిన వ్యాఖ్య అత్యంత తీవ్రమైనది. హైకోర్టు కూడా ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని, దానిపై విమర్శలు చెయ్యడం, పోరాటాలు చెయ్యడం నిష్ప్రయోజనమని ప్రభుత్వం, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు గుర్తించాలి. వాటిని హైకోర్టు సీరియస్ గా తీసుకుని కళ్లెర్రజేస్తే వేలాదిమంది మీద కేసులు పెట్టక తప్పని పరిస్థితి నెలకొంటుంది. కనుక కోర్టులను విమర్శించడంలో కొంచెం సంయమనం పాటించాలి.
అసెంబ్లీలో నూటికి నూరు శాతం బలం ఉన్నప్పటికీ, ఒక న్యాయమూర్తి ఒక వ్యతిరేక తీర్పు ఇస్తే ఆ ప్రభుత్వం కూలిపోతుందని గత దశాబ్దిలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. ఎన్నికల్లో చంద్రప్రచండంగా గెలిచినప్పటికీ, న్యాయమూర్తి దోషిగా నిర్ధారించడంతో అత్యంత శక్తివంతురాలు, ప్రధానులని సైతం ఎదిరించిన జయలలిత పదవి పోగొట్టుకుని చెరసాల పాలైందన్న సంగతి విస్మరించరాదు. మనదేశంలో న్యాయవ్యవస్థ చాలా బలమైనది అన్న సూక్ష్మం గ్రహించాలి. లోపం సలహాదారుల్లో, లాయర్లలో ఉంటే తక్షణం వారిని సాగనంపడానికి వెనుకాడరాదు. అలాగే కేంద్రస్థాయిలో బలమైన లాబీయింగ్ వ్యవస్థను నిర్మించుకోవాలి. ఢిల్లీ పర్యటనలు చేస్తూ మంత్రులను కలుస్తూ మనకు అనుకూలంగా మార్చుకోవాలి. నిజానికి ఎంపీలు ఇలాంటి కార్యాలు నిర్వహించాలి. కానీ, వైసిపి ఎంపీలు ఒకరిద్దరు మినహా ఎవరూ అందుకు సమర్థులుగా నాకు కనిపించడం లేదు. ఎంపీలతో తరుచుగా సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చెయ్యడం కూడా పార్టీ, ప్రభుత్వ అధినేతగా జగన్ బాధ్యత.
మరో నాలుగు రోజుల్లో తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వారి సహచరులకు నా శుభాకాంక్షలు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు