అధికారంలోకి వచ్చాక అయిదేళ్లపాటు అమాయక ప్రజలను గ్రాఫిక్స్ మాయాజాలంతో ముంచెత్తి, అబద్ధాలతో విందులు కుడిపించి, మహా దోపిడీకి, తనవారికి కోట్ల రూపాయలు కట్టబెట్టి ఒక కులరాజధానిని నిర్మించి శాశ్వతంగా అధికారాన్ని అనుభవించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్న కలలని ఒకేఒక్క వృకోదర గదాఘాతంతో ముక్కలుముక్కలు చేసి, దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనతో పెనుసంచలనం రేపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన రాజకీయపుటెత్తులతో చిత్తు చిత్తై శ్లేష్మంలో పడిన మక్షికాల్లా, సాలెగూటిలో చిక్కుకునిపోయిన మశకాల్లా, విలవిలలాడుతూ, గిలగిలా కొట్టుకుంటూ గత రెండు రోజులుగా ఎల్లో మీడియా, దాని యజమానులు, చివరకు ఉద్యోగులు కూడా రాజకీయనాయకులకన్నా ఘోరంగా వస్త్రవిసర్జనలకు పాల్పడుతూ, భూ నభోంతరాళాలు పిక్కటిల్లేలా చేస్తున్న ఆర్తనాదాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. జరుగుతున్న పరిణామాలను మాత్రమే వీక్షకులకు అందించి తమ జర్నలిజం బాధ్యతలను నిర్వర్తించవలసిన మీడియా, రాజకీయనాయకుల ప్రతినిధుల్లా, విశ్లేషకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకన్నా పెద్దగొంతుకలతో ఆక్రందించడం విచిత్రంగా లేదూ? వీరికి వ్యక్తిగతంగా ఎంత ఆర్థికనష్టం కలిగిందోనన్న సందేహం పొడసూపదూ? వారం వారం క్రమం తప్పకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసుకునే రక్తపువాంతుల్లో భాగంగా ఈ వారం కక్కిన విసర్జనలను పరిశీలిద్దాం.
“ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి, రైతులను ఒప్పించి మెప్పించి 33 వేల ఎకరాలు సమీకరించడంతో పాటు మొత్తంగా దాదాపు 50 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సిద్ధం చేశారు. “
ఐదుకోట్ల జనాభా, పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి, దాదాపు అరవైవేల కోట్ల రెవిన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని అవసరం ఏమొచ్చిందో చంద్రబాబుకు మాత్రమే తెలియాలి. చంద్రబాబు బలవంతంగా రైతులనుంచి భూములు సేకరిస్తున్నారని, నచ్చినవారికి ఒకరకమైన విధానం, నచ్చనివారికి మరొకరకమైన విధానం అమలుచేసి భూములు సేకరిస్తున్నారని అప్పట్లోనే రైతులు ఆందోళనలు చేశారు. అయితే దురదృష్టవశాత్తు పచ్చ మీడియా మొత్తం చంద్రబాబు గుప్పెట్లో ఉండడంతో వారి ఆవేదన బయటి ప్రపంచానికి తెలియలేదు. నేడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అమరావతి ఉద్యమం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు ఆడుతున్న డ్రామాలను పొద్దస్తమానం చూపిస్తూ అక్కడేదో మహోద్యమం నడుస్తున్నదని ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధాప్రయాసగా మిగిలిపోయాయి.
****
“రాజధాని అంటే ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో పరిమితం కాకూడదని అంటూ, 13 జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మూడు రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నట్టు ప్రకటించారు. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ సంబంధిత బిల్లులకు గవర్నర్‌తో రాజముద్ర వేయించుకున్నారు.”
రాధాకృష్ణగారి ఈ చిన్ని చెత్త పలుకులోనే అమరావతి కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే అన్న రహస్య ఆంతర్యం బయటపడుతోంది. రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులకోసం ప్రభుత్వం ఏమి చెయ్యదలచుకుందో ఇప్పటికింకా స్పష్టం కాలేదు. ప్రభుత్వం ఒక ప్రకటన చేసేంతవరకూ ఆగక తప్పదు. అయ్యవారికోసం అమావాస్య ఆగదు అన్నట్లు రైతుల విషయం సెటిల్ చేసేంతవరకు ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుంటుందా?
***
“ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాలు నిజంగానే అభివృద్ధి చెందుతాయా? లేక రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలోనే ప్రజలు ఉండిపోతారా? అనేది కాలమే నిర్ణయించాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నప్పటికీ మొత్తం ఈ వ్యవహారం ఆంధ్రులు, వారి నాయకుల ఆలోచనా ధోరణులకు అద్దంపడుతోంది. రాజకీయ పార్టీలు తమదైన ఆట ఆడగా.. కుల, మత, ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు తమ మనోవైకల్యాన్ని బయటపెట్టుకున్నారు. “
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు నిజంగా అభివృద్ధి చెందవు అని రాధాకృష్ణ బాండ్ పేపర్ మీద రాసివ్వగలరా? ఆంధ్రాలో కుల, మత, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చే తత్త్వం ఈనాటిదా? ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా “రాయలసీమ రౌడీలు, కడప గూండాయిజం, పులివెందుల పంచాయితీ” లాంటి ఆణిముత్యాలు ఎన్నిసార్లు చంద్రబాబు నోటినుంచి విన్నాము? తమ భవిష్యత్తు ఎవరిచేతిలో భద్రంగా ఉంటుందో ఆంధ్రులు తీర్పు ఇచ్చి ఏడాది మాత్రమే అయింది. అంటే చంద్రబాబును గెలిపిస్తే ఆంధ్రులు అత్యంత గుణసంపన్నులు, విజ్ఞత కలిగినవారు. జగన్ ను గెలిపిస్తే మనోవైకల్యం కలిగినవారు! శెభాష్ రాధాకృష్ణా……నీ కామెడీలు చూస్తుంటే మేటి హాస్యనటులు కూడా నీముందు దిగదుడుపే.
*****
“రైతులు పైసా ఆశించకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పటికీ 33 వేల ఎకరాలను సేకరించడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపించాయి. మూడు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాలు చేపట్టి మిగతా ప్రాంతాన్ని సహజంగా అభివృద్ధి చెందడానికి వదిలేస్తే రైతులు ఇవాళ కన్నీరు కార్చాల్సి వచ్చేది కాదని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు కూడా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది.”
రైతులు పైసా ఆశించకుండా భూములు ఇచ్చారా? హవ్వ…నవ్విపోదురు గాక! భూములు ఇచ్చిన ప్రతివారికి పదేళ్ళపాటు కౌలు, ఐదువందల గజాల నివాసస్థలము, వెయ్యిగజాల వాణిజ్యస్థలం (అంకెలు కచ్చితం కాకపోవచ్చు), ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తేనే రైతులు భూములు ఇచ్చారు. పదేళ్ల తరువాత ఆ వెయ్యి గజాలు కోట్ల విలువ చేస్తుందని చంద్రబాబు రైతులకు ఆశ పెడితే లొంగిపోయి వారు భూములు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఆనాడూ రాజధానికి మూడువేల ఎకరాలు చాలని చెప్పినట్లు గుర్తు. కానీ, చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం విదేశాల్లో నివసిస్తున్న తన సామాజికవర్గం వారి ప్రయోజనాల కోసమే యాభైవేల ఎకరాలను సేకరించారనేది అప్పట్లో ప్రతిరోజూ వినిపించిన మాట.
****
“అయినా భూములిచ్చిన రైతులకు లేని ఇబ్బంది ఈ నాయకులకు ఎందుకో అర్థం కాదు. రైతులిచ్చిన భూములను క్రమంగా అభివృద్ధి చేసి విక్రయించి ఉంటే నిజంగానే అద్భుతమైన రాజధాని నిర్మాణానికి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా నిధులు సమకూరి ఉండేవి. అయినా ఈ అవకాశాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాలదన్నుకోవడానికి కారణం ఏమిటన్నదే ప్రశ్న. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరిట అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అండ్ కో భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని జగన్‌రెడ్డి మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు.”
నిజమేకదా…ప్రభుత్వానికి, పదకొండు జిల్లాల్లో నివసించేవారికి లేని ఇబ్బంది రాధాకృష్ణకు ఎందుకు? ఈయన పేపర్ ను ఆ రెండు జిల్లాలవారు మాత్రమే చదువుతారా? ఈయన ఛానెల్ ను ఆ రెండు జిల్లాలవారు మాత్రమే చూస్తారా? ఆ రెండు జిల్లాలవారికోసం రాధాకృష్ణ ఎందుకు గింజుకుంటున్నాడు? అమరావతిలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపించినపుడు చంద్రబాబు అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రతిపక్షనాయకులకు వివరణలు ఇచ్చారా? ఆరోపణలు చేసింది జగన్ కాబట్టి నిరూపించే బాధ్యత ఆయనదే. “దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించమని” రాధాకృష్ణ జగన్ కు సవాలు విసరాలి.
****
“నిజంగా కుంభకోణం జరిగి ఉంటే ఈ విచారణలో వెల్లడయ్యేది కదా! ఆ విషయం తేలకుండానే అమరావతి ఉసురు తీయడానికి పూనుకున్నారంటే ఇంకేదో నిగూఢ పరమార్థం దాగి ఉండాలి”
రాధాకృష్ణ నైజం ఏమిటో ఈ వాక్యం చెబుతుంది. ఆనాడు నిజంగా జగన్ క్విడ్ ప్రో కో కు పాల్పడితే, లక్షకోట్లు దోచేస్తే విచారణలో బయటపడేది కదా? ఒక్క ఆరోపణ అయినా ఈనాటికి ఋజువైందా? ఒక్క ఆధారమూ లేకుండా ఆనాడు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలూ ప్రతిరోజూ జగన్ మీద బోలెడంత బురదని చిమ్మి రాజకీయంగా జగన్ ఉసురు తియ్యాలని ప్రయత్నించారంటే దానివెనుక దాగున్న నిగూఢ పరమార్ధం ఏమిటో?
*****
“అమరావతినే రాజధానిగా కొనసాగిస్తే, చంద్రబాబుకు స్థాన బలం ఉంటుందని జగన్ అండ్ కో భావించారని చెబుతున్నారు. నిజానికి అందులో కూడా వాస్తవం ఉన్నట్టు కనిపించడం లేదు.”
హద్దీ….ఇప్పుడు రాధాకృష్ణ నిజాన్ని కక్కాడు. పచ్చకామెర్ల రోగికి లోకం మొత్తం పచ్చగానే గోచరించినట్లు…కులపిచ్చి అణువణువునా నింపుకున్న రాధాకృష్ణకు అందరూ అలాగే కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అమరావతి రాజధాని అయితే చంద్రబాబుకు స్థానబలం ఉంటుందని ఒక వాస్తవాన్ని బయటపెట్టాడు. అయితే ఎన్నికల ఫలితాల్లో మాడు పగిలిన తరువాత, సాక్షాత్తూ చంద్రబాబు కుమారుడు కూడా ఘోరంగా రాజధాని ప్రాంతంలో పరాజయం పాలైన తరువాత రాధాకృష్ణకు బుర్ర తిరిగిపోయింది!
****
“కేవలం ప్రభుత్వ కార్యాలయాలను తరలించి పరిపాలనా రాజధాని అని చెప్పుకొన్నంత మాత్రాన విశాఖపట్నం, హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలను నెలకొల్పినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందవు అన్న వాస్తవాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తించలేకపోతున్నారు.”
రాధాకృష్ణ ఒక మహాసత్యాన్ని ప్రవచిస్తున్నారు! కేవలం సచివాలయం ఉన్నంతమాత్రాన విశాఖ, హైకోర్టు ఉన్నంతమాత్రాన కర్నూల్ అభివృద్ధి చెందవు అని ఏడుస్తున్న రాధాకృష్ణ మరి ఆ రెండూ అమరావతిలో లేనంతమాత్రాన వచ్చే నష్టం ఏముంది? ఎందులకీ కన్నీరు? ఇక మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే…అభివృద్ధి అనేది రాధాకృష్ణ గుర్తిస్తేనే అభివృద్ధి…ఆయన వినాశనం అంటే అది వినాశనమే!
****
“అమరావతి రాజధాని అనుకుని విభజన చట్టానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య సంస్థ (ఎయిమ్స్)ను మంగళగిరిలో ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ పరిస్థితి ఏమిటి? ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నిరుపయోగంగా ఉండిపోదా?”
ప్రభుత్వ సంస్థలు రాజధానిలో మాత్రమే ఉండాలని ఎక్కడైనా నిబంధన ఉన్నదా? శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రం రాజధానిలో ఉన్నదా? రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా దేశ రాజధానిలో ఉన్నదా? అఖిలభారత వైద్య సంస్థ రాజధానిలోనే ఉండాలని చట్టంలో ఉన్నదా? అలా అనుకున్నా అమరావతిని శాసనరాజధానిగా ప్రభుత్వం పేర్కొంటున్నది కదా? మరి రాధాకృష్ణ అమంగళ ఆర్తనాదాలు ఏమిటి?
***
“సచివాలయాన్ని తరలిస్తే స్థానికులకు ఉద్యోగాలు లభించవు కదా! అయినా అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతూ ప్రజలను పాలకులు మభ్యపెడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా సమైక్య ఉద్యమం అంటూ అవకాశాలను వదలుకున్నారు. ”విభజన అనివార్యం.. మీకేం కావాలో అడిగి సాధించుకోండి” అని నాబోటి వాళ్లు ఎంతగా చెప్పినా ఆంధ్రా నాయకులు, ప్రజలకు ఎక్కలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా చారిత్రక తప్పిదం జరుగుతున్నది. “
సచివాలయాన్ని తరలిస్తున్నది పాలనాసౌలభ్యం, ప్రాంత అభివృద్ధి కోసమా లేక స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికా? కేబుల్ కార్లు, బులెట్ రైళ్లు, నవనగరాలు, ఆకాశహర్మ్యాలు, సింగపూర్, జపాన్ అంటూ అయిదేళ్లపాటు జనానికి మాయామహాళ్లు, మయసభలు చూపించడం మభ్యపెట్టడమా లేక ఆచరణసాధ్యమైన కార్యాలు చెయ్యడం, వాటిని ప్రజలకు వివరించడం మభ్యపెట్టడమా? తెలంగాణ విడిపోదు…అంటూ అయిదారు నెలలముందు కూడా రాధాకృష్ణ ప్రజలను మోసం చేసాడని నిన్నమొన్ననే నమస్తే తెలంగాణ పత్రిక ఆధారాలతో సహా ప్రచురించింది. అలాంటి రాధాకృష్ణ రాష్ట్రం విడిపోవడం అనివార్యం అని చెప్పాడట? ఎవరి చెవిలో? అంత నమ్మకంగా ఆయన చెప్పినపుడు చంద్రబాబు ఎందుకు ఉపేక్షించారు? కేంద్రం కాలర్ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు కావలసినవి ఎందుకు సాధించలేదు?
****
“అయినా హైకోర్టును అమరావతి నుంచి తరలించడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇందుకు హైకోర్టులో పనిచేస్తున్న మెజారిటీ న్యాయమూర్తులు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు జరిగేది కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.”
అవునవును…కోర్టుల్లో జరిగేవి “జరగవు…నిలబడవు” అని బల్లలు గుద్ది చెప్పేవారే రాజ్యాంగనిపుణులు, న్యాయనిపుణులు….రాధానిని వికేంద్రీకరణ జరగదు అని ఈ న్యాయనిపుణులే నిన్నటిదాకా గంగవెర్రులెత్తిపోయారు! వికేంద్రీకరణకు అడ్డుకోమని పరోక్షంగా హైకోర్టుకు చెబుతున్నట్లున్నారు రాధాకృష్ణ. ఆ తిప్పలేవో జగన్ పడతారులేవయ్యా పెద్దమనిషీ!
****
“అది అమరావతి కాదు భ్రమరావతి అని, కమ్మరావతి అని ప్రచారం చేశారు. దీనితో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మి అమరావతితో మానసికంగా అనుసంధానం కాలేకపోయారు. కొందరి కోసమే అమరావతి అన్న భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది. ఫలితంగా అమరావతిని చంపుకోవడం వల్ల తామెంతగా నష్టపోతామో గుర్తించలేకపోతున్నారు.”
ఇదీ మరి హాస్యాస్పదంగా లేదూ? అయిదేళ్లపాటు చంద్రబాబుతో సహా తెలుగుదేశం అవినీతినేతలు అందరూ, పదకొండు పచ్ఛచానెళ్లు, రెండు జాతిపత్రికలు కట్టగట్టుకుని అమరావతిని, చంద్రబాబు విజన్ ను ఎంతగా స్తోత్రాలతో భజనలు చేశారు! హైదరాబాద్ ను, సైబరాబాద్ ను చంద్రబాబే నిర్మించారని ఎన్నెన్ని కోతలు కోశారు? ఆనాడు జగన్ గొంతు ఒక్క సాక్షిలో తప్ప మరే మీడియాలో అయినా వినిపించిందా? అంతటి ఘనప్రచారాన్ని జనం నమ్మకుండా, అమరావతితో మానసికంగా అనుసంధానం కాలేకపోయారా? హ్హాహ్హా….అంటే చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని జనం మొదటినుంచి నమ్ముతున్నట్లే కదా? లక్షకోట్ల రాజధాని, ప్రపంచస్థాయి రాజధాని అని మొత్తుకుంటున్నప్పటికీ, ముప్ఫయినాలుగు సీట్లు కలిగిన రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లు దక్కాయంటే… దానికి జగన్ బాధ్యుడా? చంద్రబాబు మీద ప్రజలకు విశ్వాసం లేదు అనేది స్పష్టం చేసినట్లు కాదా? ఎందుకీ వక్రభాష్యాలు????
****
“ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అని పలవరించిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ను కట్టడి చేయగలిగిన బీజేపీ పెద్దలకు రాజధాని తరలింపును అడ్డుకోవడం కష్టం కాదు కదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.”
ప్రజల జ్ఞాపకశక్తి మీద రాధాకృష్ణకు ఎంతటి అపనమ్మకమో కదా! “కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయి ఉన్నట్లయితే ప్రత్యేకహోదా ను డిమాండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమీ చేయలేము” అని ఏనాడో జగన్ ప్రకటించిన సంగతి రాధాకృష్ణ కావాలని విస్మరించినా, జనానికి బాగానే గుర్తుంది. ఇక ప్రత్యేకహోదాను పదేళ్లు, పదిహేనేళ్ళు తెస్తామని తిరుపతి సభలో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడు. ప్రగల్భాలు పలికిన విషయం రాధాకృష్ణ మర్చిపోతే ఎలా? అరవైఐదు వేలకోట్ల రూపాయల పాకేజీకి ఆశపడి ప్రత్యేకహోదా వాంఛను గోతిలో పాతిపెట్టింది రాధాకృష్ణ యజమాని చంద్రబాబే కదా???
****
“అమరావతిని చంపడం వల్ల 13 జిల్లాలు అభివృద్ధి చెందితే జగన్ అండ్ కోను అభినందించాల్సిందే! అలా జరగకుండా అమరావతితోపాటు మిగతా ప్రాంతాలు కూడా ఉసూరుమని ఉండిపోతే అందుకు జగన్మోహన్‌రెడ్డి మాత్రమే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.”
మరి తొందరేముంది? అన్నప్రాశన రోజే ఆవకాయ రుచి చూడాలంటె ఎలా? రాధాకృష్ణ ఆశపడుతున్నట్లు ఒక్క అమరావతినే అభివృద్ధి చేసి మిగిలిన పదకొండు జిల్లాలను చంపాలంటే ఎలా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావద్దా? ఐదేళ్లు అధికారంలో ఉండీ, ఒక్క శాశ్వత కట్టడాన్ని కూడా నిర్మించలేని చంద్రబాబు ప్రజలకు సంజాయిషీ ఇచ్చాడా? క్షమాపణలు చెప్పాడా? మిగిలిన ప్రాంతాలు కూడా ఉసూరుమంటాయో, ఉత్సాహంతో ఉరకలు వేస్తాయో కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది కదా?
***
ఒక్కటిమాత్రం నిజం…రాధాకృష్ణ కన్న కలలన్నీ పగటికలలుగా మిగిలిపోయాయి. కులరాజధాని ఏర్పడితే ఇష్టం వచ్చినట్లు దోచుకోవచ్చని కొందరు చేసిన కుట్రలు, కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి పథకంతో తుత్తునియలు అయ్యాయి….ఇక తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకం కాబోతున్నది. తెలుగుదేశాన్ని చంపెయ్యడమే బీజేపీ లక్ష్యమని నిన్ననే రాధాకృష్ణ భోరున ఏడ్చాడు. విశాఖలో నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నదృష్ట్యా విశాఖ రాజధానిని వారు బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక కర్నూల్ లో న్యాయరాజధాని రాబోతున్న కారణంగా రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. రాబోయే నాలుగేళ్లలో తెలుగుదేశంలో ఇద్దరుముగ్గురు మినహా ఎవరూ మిగిలే అవకాశం లేదు. అందుకే రాధాకృష్ణ తన ఆక్రోశాన్ని ఈ విధంగా ప్రదర్శించుకుంటున్నారు!
కానివ్వండి…చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పారు కదా ఆర్యులు! ..
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు