హన్నన్నా….రామ్మాధవ దేవా…హేమంఠివి హేమంఠివి…ఆంధ్రదేశమునందు ప్రతిపక్షమే లేదందువా? పైగా ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉన్నదంటివా? ఏమా సాహసము! ఆపత్సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజధానిలో దాగుండి, ప్రతిరోజూ జూమ్ లో తన వాగ్ధాటితో అశేషాంధ్రులను గడగడలాడిస్తూ, పసిపిల్లలను సైతం నిద్రపోవాలంటే భయపెడుతూ, జూమ్ యాప్ ను కనిపెట్టినవాడిని కసకసా కత్తితో పొడిచి… వాడి కండలు ఖండఖండాలుగా నరికి ముక్కలు చేసి కాకులకు గద్దలకు వెయ్యాలన్నంత కసి రేకేత్తిస్తున్న మా మాజీ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తారన్న బెరుకు కూడా లోపించినదే తమకు! ఇస్సీ…ఎంత అవమానభారము!
అది సరే….ఆంధ్రదేశమునందు ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశమునకు ఉన్న బలమెంత? తమ పార్టీకి ఉన్న బలమెంత? మండల శాతం ఓటింగు, శాసనసభలో ఇరువదిమూడు సీటింగు బలం కలిగిన తెలుగుదేశం ఖాళీగా ఉన్నది అనెదవా! ఓహో! ఇపుడు మాకు బోధపడినదిలే..నీ ఆంతర్యము! నింగిలోని చంద్రుని రాహువు మ్రింగినటుల అమరావతి నందు గల మా “చంద్రుని” భారతీయ జనతా రాహువు మ్రింగబోతున్నదని సంకేతములు ఇచ్చుచుండిరా? భళిభళిరా బాహుబలి!
అది అటుల నుండనీ…సాక్షాత్తూ చంద్రబాబు కులసామ్రాజ్యము అమరావతిలో అంత తెగువతో తమరు ప్రకటించినప్పటికీ, మాకు అత్యంతఆశ్చర్యము కలిగించిన విషయం ఏమిటనగా… మొన్నటి ఎన్నికలముందు వరకు బీజేపీ మీద, ప్రత్యేకించి నరేంద్ర మోడీ మీద చండ్రనిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు కానీ, ఆయన ముఠానాయకులు, కార్యకర్తలు ఒక్కరు కూడా తమరి ప్రకటనను ఖండించకపోవడం! అధికారపార్టీ కన్నా కేవలం పదిశాతం మాత్రమే తక్కువ ఓటింగ్ కలిగిన తమరిని అంత మాట అన్నప్పుడు చంద్రబాబు ఆగ్రహోదగ్రులై చండ్రనిప్పులు కురిపించాలి కదా! కానీ, ఆయన నాలుక గొంతులోకి జారిపోయెనేమిటి చెప్మా! తమంతటివారే కాదు…చివరకు ఒక సందుగొందు స్థాయి బీజేపీ నాయకులు, దూరదర్శినులలో తమ పార్టీ ప్రతినిధులు చంద్రబాబును ఎంత నీచముగా విమర్శించినప్పటికీ …. చీటికీ మాటికీ జగన్ మీద బండబూతులతో నోళ్లు పారేసుకుని, తర్జని చూపుతూ హెచ్చరికలు చేసే కొందరు అమరావతి బోండాలు, ఉమామహేశ్వరులు, రాజేంద్రులు మొదలు నాయకులు చచ్చుపీనుగుల్లా…తొండము తెగిన ఏనుగుల్లా తమతమ ముఖద్వారములకు చెవులు లేని బీగములు బిగించుకుంటిరి దేనికి? అంతియే గాక…సాక్షాత్తూ ప్రధానసచివులు సైతమూ పోలవరంను చంద్రబాబు ఏటీఎం లా వాడుకున్నారు అని ఆరోపణలు చేసియుంటిరి. పైగా రాష్ట్రమునందు సిబిఐ వేగుల ప్రవేశమునకు ప్రస్తుత ముఖ్యసచివుడు అనుమతించి యుంటిరి…. అహో… అర్థమైనది… అర్థమైనది…. తమరు అమరావతిలో జరిగిన అవినీతి గూర్చి ప్రస్తావించియుంటిరి! అసలే దినములు బాగాలేక ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు శ్రీకృష్ణజన్మస్థానమున లోహపు కడ్డీలు లెక్కించుచుండిరి………..బహుశహా…ఆ భీతము భూతమువలె వారిని వెన్నాడుచుండె కాబోలు! హతవిధీ….
తెలుగు దేశాన్ని వీలనం చేసుకొనే ప్రయత్నమా?
అది సరేనయ్యా….ఇంతకూ చంద్రబాబు మీద ఉన్న అవినీతి ఆరోపణలను ఆలంబనగా చేసికొని, అంతటి నలుబదిరెండు వత్సరముల అనుభవజ్ఞుడి మెడలు వంచి, ఆయన పార్టీని కబళిద్దామని ఏమైనా పధకములు వేసియుంటిరా? అసలే ఇరవదిమూడులో ముచ్చటగా ముగ్గురు జగను కౌగిట జారిపోయియుంటిరి. మరొక జనసైనికుడు తనను గెలిపించిన పార్టీని “గాలికి పుట్టిన పార్టీ…అది ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే” యని ఈసడించి తనను తానూ జగను పార్టీ శాస నసభ్యుడినే యని స్వచ్ఛంద ప్రకటన చేసియుంటిరి. అనగా చంద్రబాబు నోరు మెదపలేని పరిస్థితి కల్పించి, కేసుల బూచితో మేను వణికించి, నందమూరి తారకరాముడు స్థాపించిన పార్టీని తమలో విలీనము చేసుకునే ప్రణాళికలు ఏమైనా రచించితిరా? ప్రజలు ఛీత్కరించి చెత్తబుట్టలో విసిరేసిన ఒక గాలి పార్టీతో నెయ్యమొందిన మీరు కతిపయ దినములలో దానిని కూడా స్వాహా చేసే ఆలోచనలో ఉన్నారా? మీ వాగ్దారలను పరిశీలించిన పిదప ఇక రాబోయే రోజులలో తెలుగుదేశం లేశం కూడా మిగలకుండా అగస్త్యమహాముని అసురుడైన వాతాపిని జీర్ణం చేసుకున్నట్లు చేసుకుంటారేమో అని సందేహములు కలుగుచున్నవి! జగనుకు 151 స్థానములు లభించబట్టి బతికిపోయాడు కానీ, ఏ తొంభయ్యో, తొంభయి ఒకటో వచ్చియున్న యెడల ఈ పాటికే ఆ ప్రభుత్వాన్ని మింగివేసియుండెడివారు! కాదంటారా?
మరియొక మాట! రాజధాని విషయంలో కేంద్రం కలుగజేసుకోదని ఒకవంక చెబుతూనే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినటుల యూపీకి లేని మూడు రాజధానులు ఏపీకి దేనికియని ఒక కుంటిప్రశ్న వేసితిరి! తమ పార్టీ ఏలుబడిలో యున్న ఏపీలో సగం కూడా లేని ఉత్తరాఖండములో ఎన్ని రాజధానులు యున్నవో తమకు తెలియనిదా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రత్యక్షంగా దొరికినా, పోలవరంను చంద్రబాబు ఏటీఎం లా వాడుకున్నారని ప్రధానమంత్రి ఆరోపించినా చంద్రబాబు గడ్డములోని రోమమును కూడా పెకలించలేని తమబోటి అసమర్ధులు చంద్రబాబు పార్టీని విలీనం చేసుకుని జాతికి ఎలాంటి సందేశము ఇవ్వదలచుకున్నారు? చంద్రబాబు తమకు ఇంకా రహస్య మిత్రుడుగానే ఉన్నాడని మీ ప్రకటనను బట్టి యావత్ ఆంధ్రప్రజలకు అర్ధమవుతున్నది.
2024 నాటికి అధికారం దక్కించుకోవాలనే మీ పగటికలలు మిక్కిలి మక్కువగానే యున్నవి. ఆలూ లేదు..చూలూ లేదు..కొడుకు పేరు “సోము” లింగం అనే సామెత ఒకటున్నది. తమరికి తెలుసు కదా! తెలుగుదేశమునకున్న నలభై…జనసేనకున్న ఏడు, తమరికున్న ఒక్క శాతం ఓట్లతో రాబోయే ఎన్నికలలో అధికారం దక్కించుకోవాలనే తమ పధకం అయ్యుంటుంది. ఆ రెండు పార్టీలకు ఇంకా ఆనాటి శక్తి ఉన్నదని తమకు నమ్మకమా?
జలపాతం ఎంత ఎత్తున ఉంటే ఏమి ప్రయోజనం? అది దూకేది ధరణి మీదకే. అలాగే తప్పుదారిన నడిచే ఎంత ఉన్నతుడైనా అతను పతనం కాక తప్పదు అంటుంది శాస్త్రం. అది మీకు సరిగ్గా వర్తిస్తుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు