కరోనా పై యుద్ధం – జగన్ ప్రతిష్ట మసకబారుస్తున్నారా ?

YS Jagan
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడం మనచేతుల్లో లేని విషయం.  అయినప్పటికీ, బాధితులను శక్తిమేరకు ఆదుకోవడం, వైద్యసదుపాయాలు అందించడం మనం ఎన్నుకున్న ప్రభుత్వాల కనీస కర్తవ్యమ్.   ప్రజారోగ్యం పట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంతటి శ్రద్ధ కనపరిచారో మళ్ళీ అంతకన్నా రెట్టింపు శ్రద్ధను, ఆపేక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనబరుస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటున్నారు.  
 
ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పధకంలో దాదాపు 2200  రకాల వ్యాధులను చేర్చింది జగన్ ప్రభుత్వం.  మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…ఈరోజుల్లో ఒక స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్తే కన్సల్టేషన్ ఫీజ్ గా అయిదు నుంచి ఆరువందల రూపాయలను సమర్పించుకోవాల్సి వస్తున్నది.  అలాంటి వాతావరణంలో వెయ్యి రూపాయలు ఖర్చు మించిన వ్యాధిని ఆరోగ్యశ్రీ పధకం కింద చేర్చిన జగన్ ను ఎలా ప్రశంసించాలో అర్ధం కావడం లేదు.  
 
 
ఇక కరోనా విషయంలో కూడా మొదట్లో కొంత తడబడినప్పటికీ, రెండు వారాల వ్యవధిలోనే అతివేగంగా స్పందించింది జగన్ ప్రభుత్వం.  ఎవరైనా ఫిర్యాదు ఇవ్వగానే వెంటనే ఆంబులెన్సు వెళ్లడం, బాధితుడిని ఆసుపత్రిలో చేర్చినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నది ప్రభుత్వం.  రాష్ట్రం మొత్తం సుమారు ఎనభై లాబ్స్ ను ఏర్పాటు చేసింది.  ఇక టెస్టులు ఇప్పటివరకు పన్నెండు లక్షలు దాటి దేశంలోనే రికార్డ్ సృష్టించింది.  ఆసుపత్రిలో చేరిన బాధితులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం రోజుకు అయిదు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  మొన్న ఒక పచ్చ ఛానెల్ బాధితులకు అందిస్తున్న ఆహరం, సౌకర్యాలను సుమారు అరగంట సేపు ప్రసారం చేస్తే చూసి షాక్ కు గురయ్యాను.  ఇవాళ ప్రయివేట్ ఆసుపత్రులలో కరోనా బాధితులకు రోజుకు లక్ష రూపాయల వరకు బిల్ వేసి దోచుకుంటున్న తీరు చూస్తుంటే…బాధితులనుంచి నయాపైసా వసూలు చెయ్యకుండా వారి జీవితాలను ప్రభుత్వం కాపాడుతున్న తీరు వర్ణించగలమా?  
 
ఇక మరొక చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే..కరోనా సమస్యతో దేశం మొత్తం ఆర్ధికంగా కుంగిపోయి ఉద్యోగులకు జీతాలలో కూడా కోతలు విధిస్తున్న దుర్భర స్థితిలో ఆసుపత్రుల సిబ్బందికి ఏకంగా ఎనిమిదివేల రూపాయలు జీతాన్ని పెంచడం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమయింది.  అంతేకాకుండా ఇలాంటి క్లిష్టపరిస్థితిలో, రాష్ట్రానికి ఆదాయం కరువైన సమయంలో రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1088  అంబులెన్సులను కొనుగోలు చేసి ప్రతి మండలంలో రోగులకు అందుబాటులో ఉంచడం మరొకరికి సాధ్యమేనా?  వీటి నిర్వహణకోసం వేలాదిమంది సిబ్బందిని పాతికవేల రూపాయల జీతాలతో నియమించడం నభూతో నభవిష్యతి.  
 
 
జగన్ తీసుకున్న కొన్ని చర్యలను గమనిస్తే ఈయన చేతిలో ఏమైనా మంత్రదండం ఉన్నదా అని విభ్రమం కలుగుతుంది.  కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరి కోలుకుని డిశ్చార్జ్ అయ్యే సమయంలో వారికి మూడువేల రూపాయల కాష్ చేతిలో పెడుతున్నారు.  దురదృష్టం కొద్దీ రోగి మరణిస్తే, అతని అంత్యక్రియలకు గాను పదిహేను వేలరూపాయల సాయాన్ని కూడా అందిస్తున్నది ప్రభుత్వం!  మరొక విచిత్రం ఏమిటంటే…ప్రయివేట్ ఆసుపత్రుల జోలికి వెళ్ళడానికి సాధారణంగా ఏ ప్రభుత్వమూ సాహసించదు.  కానీ, జగన్  మాత్రం కరోనా రోగులను ఆసుపత్రులలో చేర్చుకోకపోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.  రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో అయినా కరోనా రోగి చేరితే అతనికి పూర్తి ఉచితంగా వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం గొప్ప సాహసం.  
 
అయితే ఇంత చేస్తున్నా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది.  అందుకు కారణం టెస్టులు అధికంగా చేయడమే అని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.  రోజూ ముప్ఫయి వేలమందికి టెస్టులు చేస్తుంటే సగటున పదిహేను వందల కేసులు నమోదవుతున్నాయి.   ఇది కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే.  అలాగే మరణాలు ఇప్పటివరకు నాలుగువందల పాతిక ఉన్నాయి.  అనేక పెద్ద రాష్ట్రాలతో పోల్చినపుడు ఇది చాలా స్వల్పం అని చెప్పాలి.   అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు…ఏ  రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగినా, అందుకు కేవలం ప్రభుత్వాలను నిందిస్తే ప్రయోజనం ఉండదు.  ప్రజలు కూడా నిబంధనలను పాటిస్తూ సహకరిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.    
 
 
కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎంతగొప్పగా పోరాడుతున్నా తగిన ప్రచారం దక్కడం లేదు.  ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, వాటికి బాకాలు ఊదే పత్రికలు, ఛానెల్స్ కేవలం ఒకటిరెండు నెగటివ్ కోణాలనే పదేపదే ఎత్తి చూపిస్తూ దుష్ప్రచారం చెయ్యడంలో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.  ఇదే చంద్రబాబు ఈ సమయంలో అధికారంలో ఉన్నట్లయితే ఎంత జోరుగా స్వోత్కర్ష చేసుకునేవారో, మీడియా ఆయన్ని అపర దేవవైద్యుడిగా ఆకాశానికి ఎత్తేదో మనం ఊహించుకోవచ్చు.  పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఒక ఇటుక వెయ్యగానే ప్రాజెక్ట్ పూర్తై నీరు వరదలా పారి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసినట్లు ఎన్నెన్ని బిల్డప్పులు ఇచ్చారో మనం మర్చిపోగలమా?  మరి ఏమాత్రం అనుభవం లేని జగన్ ఇంత చురుకుగా వ్యవహరిస్తూ దాదాపు యుద్ధం చేస్తున్నా, క్షుద్ర మీడియా మాత్రం ఆయన్ను అసమర్ధుడుగా చిత్రించడానికి నానా తంటాలు పడుతుండటం దౌర్భాగ్యం కాక మరేమిటి?  ప్రభుత్వం కూడా తగినవిధంగా ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతున్నదనే దురభిప్రాయమే కలుగుతున్నది!   
 
ఎంతటి మండే సూర్యుడైనా,  మేఘాలు అడ్డుగా వస్తే ఆయన ప్రతాపం ఏమిటో లోకానికి తెలియదు కదా!  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు