కరోనాని అరికట్టే భాద్యత ఎవరిది?

Covid-19, YS Jagan and KCR
 ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న కోవిద్ మహమ్మారి తన విశ్వరూపాన్ని భీకరంగా ప్రదర్శిస్తున్నది.  భారతదేశంలోకి కొద్దిగా ఆలస్యంగా ప్రవేశించిన ఈ వైరస్ మొదట్లో లాక్ డౌన్ సమయంలో పెద్దగా పురి విప్పకపోయినప్పటికీ, లాక్ డౌన్ సడలింపు తరువాత జాడలు విప్పి నాట్యం చేస్తున్నది. ఇప్పటివరకు సుమారు పన్నెండు లక్షలమంది వైరస్ సోకి ఆసుపత్రుల పాలయ్యారు. పాతికవేలమందికి పైగా కరోనా కరాళ జ్వాలలకు  ఆహుతి అయ్యారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదట్లో పెద్దగా ప్రభావం లేదని భావించినప్పటికీ, ఆంధ్రా తెలంగాణల్లో కూడా బాధితుల సంఖ్య యాభైవేలను దాటి గుండె గుభేల్ మనిపిస్తున్నది. అయితే మరణాల రేటు మాత్రం కొంచెం తక్కువగానే ఉండటం కొంత ఊరట కలిగించే అంశం.  
 
 
నిన్న ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎనిమిది వేలకు పైగా నమోదు అయ్యాయి. నిజంగా ఇది అత్యంత భయానకమైన పరిణామంగా చెప్పుకోవాలి. మరణాలు కూడా అరవై సంఖ్యను దాటింది.  ప్రభుత్వం ఎన్ని ఆరోగ్యవసతులు కల్పిస్తున్నప్పటికీ, ఎంత భరోసా ఇస్తున్నప్పటికీ, ప్రజల అజాగ్రత్త కానివ్వండి, లేదా వైరస్ విజృంభణ కానివ్వండి…పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.  అరవై రోజుల లాక్ డౌన్ లో రాష్ట్రాల ఆర్ధిక స్థితి బాగా దిగజారిపోవడంతో వ్యాపారాలకు అనుమతులు ఇవ్వక తప్పలేదు. రెక్కాడితే గాని డొక్కాడని వారికి అంత తొందరగా ఈ వైరస్ సోకుతున్నట్లు కనిపించడం లేదు. ఎక్కువగా మధ్యతరగతి వర్గాలవారికి ఉన్నత తరగతి వర్గాల వారికి వైరస్ సోకుతున్నది.  మొన్నమొన్నటివరకు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఈ వైరస్ తొందరగా సోకుతుందని ప్రచారం జరిగింది కానీ, అది వాస్తవం అనిపించడంలేదు. వయోభేదం లేకుండా అనేకమంది పాజిటివ్ కేసులుగా తేలుతున్నారు.  
 
ఇక ఎంతో సురక్షిత జాగ్రత్తలు పాటిస్తారు అని మనం భ్రమించే రాజకీయనాయకులు, సినిమా నటీనటులు, క్రికెటర్లు,  వ్యాపారవేత్తలు సైతం కరోనా ధాటికి  తట్టుకోలేక ఆసుపత్రులలో చేరుతున్నారు.  అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యారాయ్, సుమలత, వంటి టాప్ సెలెబ్రిటీలు సైతం కరోనాకు గురిఅయ్యారు.  కొందరు సెలెబ్రిటీలు మరణించారు. అలాగే కొందరు రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా దెబ్బకు బలైపోయారు. తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, మరికొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుడు  వీ హనుమంతరావు కూడా పాజిటివ్ గా తేలి చికిత్స పొంది కరోనాను జయించిన అదృష్టవంతులుగా బయటపడ్డారు. 
 
 
ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా కరోనాకు గురి అయ్యారు.  వీరిద్దరూ చికిత్స తీసుకుంటున్నారు.  ఇక జడ్జీలు, అధికారులు, పోలీసులు, ఉద్యోగులు కూడా వైరస్ సోకి ఆఫీసులు, న్యాయస్థానాలనే మూసెయ్యాల్సిన పరిస్థితిని చూస్తున్నాము. విషాదకరం ఏమిటంటే…మొదట్లో వంద, రెండు వందల కేసులు ఉన్నప్పుడు ప్రాణభయంతో వణికి ఇంట్లోనే కూర్చున్న ప్రజలు లాక్ డౌన్ సడలించిన తరువాత లక్షల్లో బాధితులు లెక్కతేలుతున్నా నిర్లక్ష్యంగా రోడ్లమీద తిరుగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కులు ధరించకుండా తాము ప్రమాదంలోకి వెళ్లడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. 
 
ప్రభుత్వాలు కూడా ప్రజలను పట్టించుకోవడం మానేశాయి.  స్వీయరక్షణ చర్యలు మిన్నగా మరొక గత్యంతరం లేదని, కరొనతో సహజీవనం చెయ్యక తప్పదని, ప్రతి ఒక్కరికీ ఏదొక నాటికి కరోనా సోకుతుందని హెచ్చరిస్తున్నారు.  మొదట్లో ఎవరికైనా కరోనా వచ్చిందంటే క్షణాల్లో అంబులెన్సులు, వైద్యులు, పోలీసులు వచ్చేవారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లేవారు. కానీ, బాధితులసంఖ్య అంతకంతకూ కొండలా పెరుగుతుండటంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ పాటించమని మాత్రమే చెబుతున్నారు. మరీ అత్యవసరం అయితేనే ఆసుపత్రులకు ఫోన్ చెయ్యమని సలహా ఇస్తున్నారు ప్రభుత్వం వారు. ప్రయివేట్ ఆసుపతుల్లో చేరితే లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ దోచుకుంటున్నారు.
 
 
ఇక ఈ మహమ్మారిని అరికట్టే వాక్సిన్ మీద అనేక రకాలైన వార్తలు, పుకార్లు షికారు చేస్తున్నాయి.   మరో రెండు మూడు మాసాల్లో వాక్సిన్ రాబోతుందని కొందరు, ఇంకా ప్రయోగదశలోనే ఉన్నదని,  వాక్సిన్ రావడానికి మరో ఏడాది సమయమైనా పెట్టొచ్చని మరికొందరు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారు.  ఏదేమైనప్పటికీ, వాక్సిన్ రావడానికి కచ్చితంగా ఏడాదికాలం పడుతుందనే మెజారిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.   ఈ ఏడాది చివరికి తాము తయారు చేసే వాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నదని పుణెకు చెందిన ఒక ప్రముఖ వాక్సిన్ సంస్థ అధినేత ఆదార్ పూనావాలా ప్రకటించారు. దీని ఖరీదు సుమారు వెయ్యి రూపాయలు ఉంటుందని, అయితే దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులకు ఉచితంగా అందిస్తుందని ఒక చల్లని వార్త చెప్పారు ఆయన.  
 
ఒకటి మాత్రం నిజం. కోవిద్ భూతానికి కోటీశ్వరులు, నిరుపేదలు అన్న భేదం లేదు. అందగాళ్ళు, అనాకారులు అన్న తేడా లేదు.  కోవిద్ అనేది దయాదాక్షిణ్యాలు లేని మృత్యుదేవత లాంటిది. కరోనా రాబోయే రెండు మాసాల్లో మరింతగా విస్తరిస్తుందని, ఇప్పటికే సామూహిక వ్యాప్తి ఆరంభమైంది, కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందని కేంద్రస్థాయి ఆరోగ్య శాఖ  అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ నుంచి వైరస్ ప్రభావం క్షీణించే అవకాశం ఉంటుందని సెలవిస్తున్నారు కానీ, అది ఎలాగో మాత్రం చెప్పడం లేదు.  ఎవరినో నిందించే బదులు ప్రజలే స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలి. యువకులకు, మధ్యవయస్కులకు మాత్రమే వైరస్ వస్తుందని అపోహలు వద్దు. అనేకమంది  ఎనభై తొంభై ఏళ్ళవయసు ఉన్నవారు కూడా నిక్షేపంగా ఉన్నారు . నలభై ఏళ్ళవయసు లోపలివారు వైరస్ సోకి వారిలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కనుక అనవసరంగా ఎవ్వరూ బయటకు వెళ్లొద్దు. పేస్ మాస్కులు విధిగా ధరించండి. మార్కెట్లకు వెళ్లి గుంపులో జొరబడద్దు.  దేవాలయాలకు వెళ్ళవద్దు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లొద్దు. వారిని మీ ఇళ్లకు పిలవద్దు.  ఎవరింట్లో వారు క్షేమంగా ఉండండి.  ఈ మహమ్మారి మరణం తరువాత మళ్ళీ పాతవైభవాలను చూద్దాము.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు