చంద్రబాబును చూస్తే జాలి వేస్తుంది !

Chandra Babu Naidu struggling as Opposition leader
Chandra Babu Naidu is struggling as an Opposition leader
 
ఇతరులు చేసే మంచిపనులను తన ఖాతాలో వేసుకుని స్వోత్కర్షలు చేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రికార్డులను బద్దలు కొట్టడం ఈ భూలోకంలో మరెవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు.  వినే వెర్రోళ్ళు ఉంటే ఎన్ని కబుర్లైనా విసుగులేకుండా చెప్పగలరు చంద్రబాబు.  బ్రిటిష్ వారితో యుద్ధం చేశానని చెప్పినా, ఇందిరాగాంధీతో పోరాడానని చెప్పినా,  హైద్రాబాద్ లో మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తానే తెచ్చానని చెప్పినా, ఇక దేశంలోని అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చెప్పినా ఆయన  డంబాలను పదేపదే ప్రచారం చేసి నిజమేమో అని భ్రమింపజేసే కులగజ్జి మీడియా ఆయన చుట్టూ రక్షణకవచంలా నిలబడుతుంది.  కర్ణుడు కవచకుండలాలతో జన్మించినట్లు చంద్రబాబు రాజకీయ తప్పిదాలను కవర్ చెయ్యడానికి ఆయన చుట్టూ పదకొండు పచ్చ ఛానెల్స్ కాపు కాస్తుంటాయి.  అందుకే తనకు కులపిచ్చి లేదని కూడా ఆయన ధైర్యంగా ప్రకటించగలడు.  
 

ఎన్నికల ఓటమితో ఆవిరైపోయిన అమరావతి ఆశలు

 
గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తరువాత అయిదేళ్ల తన పరిపాలనతో తన సామాజికవర్గానికి వేలకోట్ల రూపాయలు దోచిపెట్టడానికి అమరావతి పేరుతో చేసిన కుట్రలు అన్నీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విఫలం కావడంతో అధికారం పోయినదానికన్నా ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి అవుతూ చంద్రబాబు చేస్తున్న దాగుడుమూతల పోరాటాన్ని చూస్తుంటే నవ్వు వస్తుంది ఎవరికైనా.  తాను, తన తాబేదారులు, పచ్చమీడియా యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవారు రాజధాని వికేంద్రీకరణ పేరుతో జగన్ కురిపించిన శస్త్రాస్త్రాలధాటికి  కకావికలై గుండెలు బద్దలై లబోదిబోమని ఏడుస్తూ చివరకు అమరావతిని ఉంచితే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రాధేయపడుతున్నారంటే ఆ అమరావతిని  ఎంతటి చీకటి అవినీతి సామ్రాజ్యంగా చంద్రబాబు మార్చారో నిరక్షరాస్యుడికి  కూడా విశదం అవుతుంది.   రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలపట్ల సమాదరణ చూపించాల్సిన రాజకీయపార్టీ ఒక్క రెండుమూడు గ్రామాల ప్రయోజనాలకోసం ఇంతలా పోరాడుతున్నారంటే అక్కడ దోపిడీ అనేది యథేచ్ఛగా జరిగినదని, ఆ దోపిడీని జగన్ బద్దలు చెయ్యడంతో ఈవిధంగా ఉద్యమం పేరుతో మహిళలను అడ్డం పెట్టుకుని ప్రాయోజిత డ్రామాలను ఆడిస్తున్నారని బొధపడటం లేదూ?  

కరోనా కల్లోలంలో కూడా రాజకీయం

Chandra Babu Naidu is struggling as an Opposition leader

ఇక గత అయిదారు మాసాలుగా కోవిద్ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మహమ్మారి విలయతాండవం చేస్తున్నది.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలమధ్య తిరుగుతూ,  తన పార్టీవారితో కలిసి సహాయకచర్యలను పర్యవేక్షిస్తూ  వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ, అండగా నిలబడాల్సిన తరుణంలో హైద్రాబాద్ లోని తన రెండు వందల కోట్ల రూపాయల రాజభవనంలో కుటుంబంతో కలిసి ఇల్లు కదలకుండా లాప్ టాప్ ను ముందు పెట్టుకుని జూమ్ యాప్ తో రెండు రోజులకొకసారి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబును చూస్తే జాలివేయదా మనిషి పుటక పుట్టినవాడికి?
 
 
పైగా అక్కడ కూర్చుని అమరావతి డెబ్బై శాతం అయిపోందని, పోలవరం అరవై అయిదు శాతం అయిపోయిందని, పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, పరిశ్రమలు తెచ్చామని, విమానాశ్రయాలను అభివృద్ధి చేశామని, పాతికవేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించామని, ఐటి హబ్బులు తెచ్చామని,  ప్రాజెక్టులు కట్టించామని, బెల్‌, సుజ్లాన్‌, బెర్జర్‌ పెయింట్స్‌ కర్మాగారాలు తేవడానికి కృషి చేశామని, . కర్నూలు జిల్లాకు ట్రిపుట్‌ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ పెట్టమని,  ఓర్వకల్లు విమానాశ్రయం తెచ్చామని,  ప్రపంచంలోనే పెద్దదైన మెగా విత్తన పార్క్‌కు రూపకల్పన చేశామని,  కేసీ కెనాల్‌, గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు వేగవంతం చేశామని, కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశామని…ఇలా అంతూపొంతూ లేకుండా పిట్టలదొరలా సొరకాయ కోతలు కోస్తూ ప్రజల్లో అపహాస్యం పాలవుతున్నారు!  ఆయన ఏమి మాట్లాడినా…చివరకు శ్రీకృష్ణదేవరాయలు నా క్లాస్మేట్, ఆముక్తమాల్యద రాయాలని ఆయనకు నేనే సలహా ఇచ్చానని చెప్పినా దాన్ని మరికొంత మసాలా పూసి యధాతధంగా ప్రచురించి ప్రజలను వెర్రివెధవలను చేసే మీడియా ఆయన వెంట ఉండటం ఆయన అదృష్టం కావచ్చు.  

ఆత్మపరిశీలన అవసరం

చంద్రబాబు ఇక్కడ ఆత్మపరిశీలన చేసుకుంటే…ప్రజలను మభ్యపెట్టే తన పాండిత్యం ఈరోజుల్లో చెల్లదని చాల సులభంగా అర్ధం అవుతుంది.  నిజంగా చంద్రబాబు అంత అభివృద్ధిని చేసి ఉన్నట్లయితే…తన పార్టీ అంత ఘోరాతిఘోరంగా ఎందుకు ఓడిపోతుంది?  128 సీట్ల బలం కేవలం 23 కు ఎందుకు దిగజారింది?  అన్నింటికీ శంకుస్థాపనలే తప్ప ఒక్క ప్రారంభోత్సవం జరిగిందా?  వైఎస్ రాజశేఖరరెడ్డి ఏనాడో కొంతభాగాన్ని పూర్తి చేసినప్పటికీ మిగిలిన భాగాన్ని అయిదేళ్లకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు?  విజయవాడలో నాలుగేళ్ల కాలంలో కూడా ఒక చిన్న ఫ్లై ఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు?  తాత్కాలిక భవనాల పేరిట వేలకోట్ల రూపాయలను ఎందుకు తగలేశారు?  అమరావతిలో జరిగిన కుంభకోణాలకు జవాబు ఏది?  చంద్రబాబు దగ్గర పనిచేసిన మంత్రులు ఇవాళ హత్యానేరాల్లో, కుంభకోణాల్లో ఎందుకు నేరస్తులుగా తేలుతున్నారు?  చంద్రబాబు హయాంలో పూర్తి చేసుకున్న ఒక్క నిర్మాణం అయినా ఉన్నదా?  
 
అంతేకాదు….నిజంగా అభివృద్ధి చేసిన పాలకులను ప్రజలు నెత్తిమీద పెట్టుకున్న ఉదంతాలు మనకళ్లముందే సజీవంగా ఉన్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి గెలిచారు.  ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇప్పటికి వరుసగా అయిదుసార్లు ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు?  పశ్చిమ బెంగాల్ కు మమతా బెనర్జీ రెండోసారి ఎలా గెలిచారు?  కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు?   బీహార్ ముఖ్యమంత్రిగా ఇప్పటికి నితీష్ కుమార్ ఐదారుసార్లు ఎలా ఎన్నికయ్యారు?   దేశప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి మరింత ఆధిక్యతతో ఎలా గెలవగలిగారు?    తమకు రవ్వంత ఉపకారం చేసినా అందుకు పదిరెట్లు విశ్వాసం చూపిస్తారు మన ప్రజలు.  అలాంటి స్థితిలో అయిదేళ్ల చంద్రబాబు పాలనకు ప్రజలు మంగళం పాడారంటే అక్కడ జరిగింది అంతా మాయమంత్రాలే అని, అభివృద్ధి శూన్యం అని తేలిపోవడం లేదా?  పైన ప్రస్తావించబడిన నేతలెవ్వరూ చంద్రబాబులా మేము అది చేసాము..ఇది చేశాము అని గప్పాలు కొట్టలేదు.  
 
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది 
ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందని 
 
పెద్దలు బహుశా చంద్రబాబులాంటివారిని చూసే చెప్పి ఉంటారు!
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
 
Chandra Babu Naidu struggling as an Opposition leader. Due to the Covid-19 situation, Chandra Babu is unable to perform his duties as an opposition leader.