ఆ నలభై ఎనిమిది గంటల తరువాత ఏమి జరగబోతోంది? ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్న విసిరినవారు సామాన్యులు కాదు. మాజీ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇప్పుడు నిఖిల ప్రపంచం చంద్రబాబుగారి గడువు నేటి అర్ధరాత్రితో ముగిసిపోనుండటంతో గజగజ వణికిపోతున్నది.
“ఆ…ఏమవుతుంది? యధావిధిగా తెల్లవారుతుంది. మంగళవారం పోయి బుధవారం వస్తుంది” ఒక సీనియర్ పాత్రికేయుడి చమత్కారం!
“సూర్యచంద్రులు తమతమ గతులు తప్పుతారు. అనగా రేపటినుంచి పగటివేళ చంద్రుడు, రాత్రివేళ సూర్యుడు వస్తారు. భూమ్యాకాశాలు ఏకం అవుతాయి. సప్తసముద్రాలు పొంగిపొర్లుతాయి. చతుర్దశ భువనాలు తల్లక్రిందులు అవుతాయి. గార్దభాలు గాండ్రిస్తాయి. వ్యాఘ్రాలు ఓండ్రపెడతాయి. వరాహాలు పరమాన్నాన్ని భుజిస్తాయి” ఒక రచయిత చతుర్లు!
అమరావతి రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే చంద్రబాబు, ఆయన పార్టీవారు, మరికొందరు చంద్రబాబు భుక్తాన్నశేషాన్ని ఆరగిస్తూ కాలం గడుపుతున్న ప్రజావ్యతిరేకులు గంగవెర్రులెత్తిపోతూ నాలుగురోజులనుంచి నిద్రాహారాలు లేకుండా ఆక్రందనలు చేస్తున్నారు. ఇక కులగజ్జిని నరనరానా నింపుకున్న కొన్ని పచ్ఛాచానెళ్లు రేయింబవళ్లు పచ్చరోగులతో చర్చలు నిర్వహిస్తూ విషప్రవాహాన్ని విరజిమ్ముతున్నాయి.
ఇక నలభైఏళ్ళ రాజకీయ అనుభవం, పదునాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక దిగజారడానికి అధోలోకాలు లేవన్నట్లుగా జగన్ మీద విమర్శల పరంపరను కురిపిస్తున్నారు. దానిలో భాగంగా ” అసెంబ్లీని రద్దు చెయ్యడానికి నలభై ఎనిమిది గంటల గడువు ఇస్తున్నా” అంటూ పొరుగురాష్ట్రంలో కుటుంబంతో సహా దాక్కుని బీరాలు పోతున్నారు. ఎన్నికలు జరిగి పదునాలుగు మాసాలు మాత్రమే అయింది. అరివీరభయంకరమైన మెజారిటీని జగన్ కు కట్టబెట్టి, అమరావతిని సింగపూరుగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబును తరిమికొట్టారు ప్రజలు. ఎక్కడైతే అమరావతి ఉండాలని చంద్రబాబు ఎలుగెత్తి అరుస్తున్నారో, ఆ ప్రాంతంలోనే చంద్రబాబు కొడుకు లోకేష్ ను ఛీ కొట్టి తరిమారు ప్రజలు. ఇంత స్పష్టంగా ప్రజాభిప్రాయం బహిర్గతమై ఏడాదే కదా అయింది!
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తానని చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారా? నాకు గుర్తు లేదు. అప్పట్లో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ఉంటుందని, ఆ తరువాత మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేసీఆర్ భయంతో రాత్రికిరాత్రి హైద్రాబాద్ వదిలి పరారయ్యారు. అమరావతి అన్నారు. దానికి ప్రజల ఆమోద ముద్ర ఉన్నదా? మరి ఆనాడు చంద్రబాబు రాజీనామా చేసి అమరావతి రాజధాని చేస్తామనే వాగ్దానంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారా? ఆనాడు చంద్రబాబు చెయ్యని పనిని ఈనాడు జగన్ ను చెయ్యమని సవాళ్లు విసరడం ఏమిటి?
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు ఆ పన్నెండు ఏళ్లలో కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు రాజీనామాలు చేశారు తప్ప అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజీనామా చెయ్యమని కోరలేదు. రెండుసార్లు కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసారు. మంత్రిపదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టినపుడు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేశారు తప్ప చంద్రబాబును రాజీనామా చెయ్యమని డిమాండ్ చెయ్యలేదు. కాంగ్రెస్ పార్టీనుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినపుడు ఆయన రాజీనామా చేశారు తప్ప సోనియాగాంధీని రాజీనామా చెయ్యమని కోరారా? ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు మన కళ్ళముందు కదలాడుతున్నాయి.
చంద్రబాబు చెబుతున్నట్లు అమరావతిని మార్చకూడదని ఆంధ్రుల అభీష్టమే అయితే చంద్రబాబు, ఆయన పార్టీనుంచి గెలిచిన ఇరవైరెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ప్రజాభీష్టం ఇదే అని చాటాలి. అంతే తప్ప జగన్ ను రాజీనామా చేయమనడం ఏమిటి? అసెంబ్లీ రద్దు చెయ్యమని సవాల్ చెయ్యడం ఏమిటి? ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఐదేళ్లు సమయం ఇస్తారు. ఆ ఐదేళ్లలో వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని పాలిస్తారు తప్ప ప్రతి నిర్ణయానికి ప్రజలను అభిప్రాయం కోరరు. “రాజీనామా చెయ్యడం చిటికెలో పని” అని చిటికెలపందిళ్లు వేస్తున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడైనా పదవులకు రాజీనామా చేశారా? ఎన్టీఆర్ కు ప్రజలు అఖండమైన మెజారిటీ కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేస్తే..ఆయన్ను వెన్నుపోటు పొడిచి కూలదోసిన తరువాత చంద్రబాబు మళ్ళీ ప్రజాతీర్పు కోరుతూ ఎన్నికలకు వెళ్ళారా? మిగిలిన కాలాన్ని దర్జాగా అనుభవించలేదా?
ఏమైనా చంద్రాబు ముఖకవళికలను చూస్తుంటే…ఆయన, ఆయన సామాజికవర్గం వారు వేలకోట్ల రూపాయలను వ్యక్తిగతంగా నష్టపోయిన దీనావస్థ అతి స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టిన భూవ్యాపారుల కంఠాలకు ఉరితాళ్లు బిగిసినట్లుగా వారి నాలుకలు గొంతులోకి జారిపోతూ మరో నిముషంలో ప్రాణం పోతున్నంత బాధ గోచరిస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు పోరాడుతున్నది రైతులకోసం కాదు…రాష్ట్రం కోసం కాదు..కేవలం తన సామాజికవర్గం వారి ఆర్ధిక ప్రయోజనాల కోసమే అని నిరక్షరకుక్షికి కూడా అర్ధం అయ్యేట్లు చంద్రబాబు రోదిస్తున్నారు! ఎంతటి దుర్గతి పట్టింది!! హతవిధీ!!!
“చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్” అని జగన్ మోహన్ రెడ్డి ఏనాడో చెప్పారు.
“చంద్రబాబు ది డర్టీఎస్ట్ పొలిటీషియన్ అఫ్ ఇండియా” అని కేసీఆర్ మీడియా సాక్షిగా ప్రకటించారు.
“చంద్రబాబు విశ్వాసఘాతకుడు” అని మొన్ననే ఒమర్ అబ్దుల్లా ఆక్రోశించారు.
“చంద్రబాబు చెప్పిన మాటలు మాదేశంలో చెబితే పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు” అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్విట్జార్లాండో లేదా మారిషసో మంత్రి ఒకాయన ఇరవైఏళ్లక్రితమే సెలవిచ్చారు!
నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో ఇన్ని సర్టిఫికెట్లు తెచ్చుకున్న చంద్రబాబును గూర్చి చర్చించుకోవడం సమయం వృధాకదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు