Nara Bhuvaneshwari : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా నారా భువనేశ్వరి పేరు తెలుగునాట రాజకీయాల్లో మార్మోగిపోతోంది. దానిక్కారణం, వైసీపీ నేతలు కొందరు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే.
‘మేం ఆ వ్యాఖ్యలు చేయలేదు..’ అని వైసీపీకి చెందిన కొందరు నేతలు ఖండిస్తున్నా, ‘ఆ వ్యాఖ్యలు బాధాకరం..’ అంటూ పలువురు వైసీపీ నేతలు, జరిగిన పొరపాటుపై వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన వల్లభనేని వంశీ, తాను భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొంటూ, భువనేశ్వరికి క్షమాపణ కూడా చెప్పారు.
కాగా, ఈ వ్యవహారంపై గతంలోనే బహిరంగ లేఖ విడుదల చేసిన భువనేశ్వరి, తాజాగా మీడియా ముందుకొచ్చి.. తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ చేశారు ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారు..’ అని చెబుతూ. ఎన్నో ఏళ్ళుగా చంద్రబాబు రాజకీయాల్లో వున్నా, ఏనాడూ భువనేశ్వరి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడామె మీడియా ముందుకు రావడం, రాజకీయాలపై మాట్లాడటంతో.. ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రాబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది.
చంద్రబాబు కుటుంబం నుంచి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోనే వున్నారు. అదే ఇంటి నుంచి మూడో వ్యక్తి, ఎన్నికల బరిలోకి దిగడం సాధ్యమేనా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ప్రచారంలో మాత్రం ఈసారి భువనేశ్వరి కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారమైతే గట్టగా జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.
మరి, ఈ ప్రచారంపై భువనేశ్వరి ఎలా స్పందిస్తారో ఏమో.!