టీడీపీ అధికారంలోకి వస్తే, జగన్ ఆర్థిక మూలాల్ని దెబ్బకొడ్తారట.!

NCBN

ఇదేం పంచాయితీ.? వైఎస్ జగన్ ఆర్థిక మూలాల్ని దెబ్బ కొడతానని బహిరంగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పడమేంటి.? పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబుకు ఇదే నేర్పిందా.? అన్న విస్మయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకి వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయమై వైసీపీ గతంలోనే వివరణ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేయడంతో, అందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోమని ముఖ్యమంత్రి చెప్పినట్లు అప్పటి మంత్రి పేర్ని నాని వెల్లడించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి ‘భీమ్లానాయక్’ సినిమాని కదా వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్నది.? పవన్ కళ్యాణ్ పేరుని ‘మహానాడు’లో ప్రస్తావించలేక, చంద్రబాబు.. బాలకృష్ణ సినిమాకి ఆ వ్యవహారాన్ని అంటగట్టారన్నమాట. దానికి కొనసాగింపుగా, ‘మేం అధికారంలోకి వచ్చాక మీ సాక్షి వ్యాపారం జరగనివ్వం.. మీ సిమెంటు వ్యాపారాల్ని అడ్డుకుంటాం..’ అంటూ చంద్రబాబు స్పష్టం చేసేశారు.

నిజమే, వైసీపీ హయాంలో టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. టీడీపీ విషయంలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీల ఆర్థిక మూలాల్నీ దెబ్బకొట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది. ‘భీమ్లానాయక్’ సినిమాని దెబ్బ కొట్టడం వెనుక వైసీపీ ప్రభుత్వ ఉద్దేశ్యం, జనసేన ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడమే.

అలాగని, ప్రతి ప్రభుత్వమూ అదే పని చేసుకుంటూ పోతే.. అర్థమేమన్నా వుంటుందా.?