చంపేస్తామంటూ రాజకీయాలా.? వైసీపీని పాతరేస్తున్న సొంత పార్టీ నేతలు.!

ఓ వైపు అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లలోనూ గెలవాలంటూ అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీ హయాంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి గడప గడపకూ వెళ్ళి ప్రజలకు చెప్పాలనీ, ప్రజల మన్ననలు పొందాలనీ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంకో వైపు, వైసీపీ నేతలు మాత్రం చంపేస్తామంటూ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారు. బూతులతో చెలరేగిపోతున్నారు. ‘ఇలాంటివాళ్ళా రాజకీయాలకు కావాల్సింది.?’ అని అధినేత వైఎస్ జగన్ బహిరంగ సభల ద్వారా ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తున్నా, ‘అబ్బే, అవి విపక్షాల మీద విమర్శలే..’ అని లైట్ తీసుకుంటున్నారు వైసీపీ నేతలు.

తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హత్యా రాజకీయాలు మళ్ళీ మొదలైతే తొలి టార్గెట్ నారా లోకేష్..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చంద్రబాబుపై బూతులు, పరిటాల రవిని వైఎస్ ఆదేశాలతో మొద్దు శీను చంపాడని చెప్పడం, వైఎస్ ఆదేశించి వుంటే చంద్రబాబూ అంతమైపోయి వుండేవారని నడం.. ఇవన్నీ దేనికి సంకేతాలు.?

ఇలాంటి విపరీత వ్యాఖ్యలతో అనూహ్యంగా టీడీపీకి మైలేజ్ పెరుగుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ నేతలు చాలామంది ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని.. చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రజా ప్రతినిథులదీ ఇదే తీరు. అధినేతకు తమ పార్టీ నేతలపై అదుపు లేదా.? లేదంటే, అధినేత వీరిని ప్రోత్సహిస్తున్నారా.?