HomeTR ExclusiveIlapavuluri Murali Mohan Raoజగన్ ప్రభుత్వాన్ని కూలద్రోసే మహా కుట్ర 

జగన్ ప్రభుత్వాన్ని కూలద్రోసే మహా కుట్ర 

ఏడాదిన్నర క్రితం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అత్యంత ఘోరమైన పరాభవం ఎదురైంది.  అయిదేళ్ల పదవీకాలంలో ఒక్క నిర్మాణం కూడా చెయ్యకుండా, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, తన సామాజికవర్గం వారికి వేలకోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చడమే కాక, పొరుగురాష్ట్రంలో దొంగపని చేయబోయి అక్కడి అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడి, ఆంధ్రుల పరువు తీసిన చంద్రబాబును ఎలాగైనా ఇంటికి పంపించాలని ఆనాడే ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు.  అయితే పచ్చ పత్రికల గజ్జి రాతలకు ఒళ్ళు మరచిపోయి, ప్రజలు తనకు బ్రహ్మరధం పడుతున్నారని, అంతర్జాతీయంగా తన పేరు ప్రతిష్టలు వెలిగిపోతున్నాయనే భ్రమల్లో మునిగి తేలి, అహంకారంతో ప్రతిపక్షనేత మీద హత్యాప్రయత్నం జరిగినా కూడా దాన్ని కోడికత్తి అని అవహేళన చేసి ప్రజల దృష్టిలో ఛీత్కరించబడ్డాడు చంద్రబాబు.  అంతేకాదు, చంద్రబాబు చేసిన దుర్మార్గాలకు అమాయకచక్రవర్తి అయిన ఆయన కొడుకును కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశారు ఓటర్లు.

రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవస్థల్ని వాడుకుంటున్నారా ?

జగన్‌ను ఆపే దమ్ము టీడీపీకి ఉందా..లేదా ?

రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేమని నలభైఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబుకు అర్ధం అయింది.  జగన్ తండ్రి రాజశేఖరరెడ్డిని, అంతకుముందే మహామహులైన కేంద్ర నాయకులను సైతం ఆటాడించిన చంద్రబాబు, నలభైలలో ఉన్న జగన్ ముందు చిత్తుచిత్తైపోతున్నారు.   అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టి, కోర్టుల చుట్టూ తిప్పినా కూడా అణుమాత్రం చలించక, కేవలం ప్రజలను నమ్ముకుని వీరాభిమన్యుడిలా మహాకుట్రల పద్మవ్యూహంలోకి చొచ్చుకునివెళ్ళి విజయార్జునిడిలా, సంగరంగవిహారుడై విజేతగా బయటకొచ్చిన జగన్ అవక్రపరాక్రమం ముందు అగ్నిలో పడి భస్మమైపోయిన  శలభంలా మిగిలిపోయిన చంద్రబాబు, జగన్ ను ఏ విధంగా అయినా నిలువరించాలనే కుటిల కుత్సిత తంత్రాలలో భాగంగా తన కొమ్ముకాసే కులగజ్జి పత్రికలను అడ్డంపెట్టుకుని జగన్ మీద పదిరోజులకో కట్టుకథలను అల్లుతూ, జగన్ ను ఎలాగైనా అధికారంలోనుంచి తప్పించాలనే తాపత్రయంతో రగిలిపోతున్నారు.  ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో తాను, తనవాళ్లు నిర్మించుకున్న అక్రమకోటలను జగన్ తుత్తునియలు చెయ్యడంతో మతిచలించి మాట్లాడుతూ జగన్ ను అప్రతిష్టపాలు చెయ్యడానికి సర్వశక్తులు ఒడ్డుతూ ఏడుపదుల వయసులో తన పైశాచికత్వాన్ని నగ్నంగా ప్రదర్శిస్తున్నారు.  ప్రజలు కాండ్రించి ముఖాన ఉమ్మేసి తరిమేసినా,  తమ దుష్టబుద్ధిని సవరించుకోలేకపోతున్నారు.  
 
 
జగన్ మీద కుట్రలకు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే పథకరచన జరుగుతుంది.  దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు ఇస్తారు.  దాన్ని వాళ్ళు మరింతగా పకడ్బందీగా కట్టుకథ అల్లేసి, చదివినవారు ఇది నిజమేమో అని భ్రమించేట్లుగా ప్రచారంలోకి తెస్తారు.  ఆ తరువాత తాము ప్రచురించిన విషకథనాల మీద తెలుగుదేశం ప్రతినిధులను, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు భక్తులను కూర్చోబెట్టి చర్చలమీద చర్చలు జరుపుతారు.  అవే కథనాల ఆధారంగా మరికొందరు చంద్రబాబు బంట్లు కోర్టుల్లో పిల్స్ దాఖలు చేస్తారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తున్న ఫోన్ టాపింగ్ కూహకం ఈ కోవలోనిదే అని చెప్పుకోవచ్చు.  

ఫోన్ ట్యాపింగ్ గురుంచి జడ్జిలు పత్రికలకు చెప్పారా?

Judges | Telugu Rajyam

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ సంభాషణలను రహస్యంగా టాపింగ్ చేయించడం జరుగుతుంది.  చట్టప్రకారం అది కూడా తీవ్రమైన నేరమే.  ఎవరి మీద నిఘా పెట్టాలనేది చట్టాల్లో స్పష్టంగా పేర్కొనబడింది.  అయితే రాజకీయనాయకులు, అధికారులు, సాధారణ పౌరులు ఆ జాబితాలోకి రారు.  అందువల్లనే వారి ఫోన్ల మీద నిఘా పెట్టడం చట్టవ్యతిరేకం, శిక్షార్హం.  అయితే రాజకీయ నాయకుల ఫోన్స్ మీద నిఘా అంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండదని భావించారేమో, ఏకంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోని గౌరవ న్యాయమూర్తుల ఫోన్లే టాపింగ్ కు గురి అవుతున్నాయని ఒక సంచలన కుట్రకు తెరలేపారు ఆంధ్రజ్యోతి వారు.  అయితే రెండువారాల క్రితం మాజీ జడ్జ్ ఈశ్వరయ్య, మరొక జడ్జ్ రామకృష్ణ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ప్రచురించినట్లు హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలను ప్రచురించలేదు ఆంధ్రజ్యోతి.  ఒకవేళ నిజంగా న్యాయమూర్తుల ఫోన్ల టాపింగ్ జరిగితే కచ్చితంగా అందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే.  అందులో సందేహమే లేదు.  మరి ఈశ్వరయ్య విషయంలో చేసినట్లు ఆ వార్తను ఆధారసహితంగా ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రచురించలేదో తెలియదు.  అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతి వారు ప్రచురించిన కథనాన్ని నిశితంగా పరిశీలిస్తే హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా తమ ఫోన్ సంభాషణలు టాపింగ్ కు గురి అవుతున్నట్లు రాధాకృష్ణకు చెప్పరేమో అన్న నమ్మకం కలిగేట్లు ఆ కథనం ఉన్నది.  నిజానికి హైకోర్టు న్యాయమూర్తుల స్థాయివారు మీడియాతో అలా తమ ఆవేదనను పంచుకోవడం జరగదు.  వారు కావాలనుకుంటే రాష్ట్ర డీజీపీని, చీఫ్ సెక్రెటరీని తమ ముందుకు పిలిపించుకుని విచారణ చెయ్యమని ఆదేశించగలరు.  లేకపోతె తమంతట తామే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించగలరు.  
 
 
ఆంధ్రజ్యోతి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచురించిన ఆ కథనం ఆధారంగా ఒక న్యాయవాది హైకోర్టులో పిల్ వెయ్యడం విచిత్రం అనుకుంటే, ఆ కేసులో ఆంధ్రజ్యోతిని కూడా ప్రతివాదిగా చేర్చమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరికను ధర్మాసనం తిరస్కరించడం మరీ విచిత్రం.  ఆ కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతివారే స్వచ్ఛందంగా ఇంప్లీడ్ చేసుకుని కోర్టుకు ఆధారాలు సమర్పించి నిందితులను శిక్షించాలని కోరడం ఔచిత్యంగా ఉంటుంది.  ఆ అవకాశాన్ని వారు ఎందుకు వదులుకోవాలి?  

లేఖ ఎవరికి రాయాలి చంద్ర బాబు ?

Gowtham Sawang And Chandra Babu Naidu

ఇక ఆంధ్రజ్యోతిలో వేసిన కట్టుకథను ఆధారం చేసుకుని మాజీముఖమంత్రి చంద్రబాబు నేరుగా ప్రధానికి లేఖ రాయడం మరీ విడ్డూరం.  ఆయన రాష్ట్రముఖ్యమంత్రికి, డీజీపీకి లేఖలు రాయాలి.  అంతేతప్ప మోడీ ఏమి చెయ్యగలరు?  ఎవరో అనామకుడు చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని రాష్ట్రప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించే అధికారం ఉన్నదా అని నా సందేహం.  ఇక మోడీకి రాసిన లేఖలో అసలు విషయం కన్నా, మోడీ భజనే ఎక్కువగా కనిపిస్తున్నది.  “బీజేపీని సమర్ధించేవారు దేశద్రోహులు, మోడీ అంతు తేలుస్తా” అని మోడీమీద నానదుర్భాషలు ఆడిన చంద్రబాబు ఇవాళ మోడీయే దేశానికి శరణం అంటూ బీజేపీ వారికన్నా ఎక్కువగా మోడీకి స్తోత్రాలు చేస్తున్నారు.  ఎపుడెపుడు మోడీ పాదధూళిని స్వీకరించే మహద్భాగ్యం కలుగుతుందా అని చకోరపక్షిలా ఎదురుచూస్తుంటే బీజేపీ వారు కూడా తెగ నవ్వుకుంటున్నారు.  
 
ఈ కేసు విచారణ రేపు మళ్ళీ జరగబోతుంది.  ఏమైనప్పటికీ, జగన్ ను పదవినుంచి దించడానికి, జగన్ ను అప్రతిష్టపాలు చెయ్యడానికి చంద్రబాబు, ఆయన ముఠా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారనేది తిరుగులేని సత్యం.  అయితే, ప్రజాభిమానమే జగన్మోహన్ రెడ్డికి శ్రీరామరక్ష.  
 
మనసులో ఎంతటి భవ్యహర్మ్యాన్ని నిర్మించుకున్నా, నిజజీవితంలో అది వాస్తవం అవుతుందా?  జగన్ ను ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచెయ్యాలని కుట్రలు పన్నినా వాస్తవజీవితంలో అవి ఫలించవని చంద్రబాబు, ఆయన తాబేదార్లు తెలుసుకుంటే మంచిది.
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News