ఆ చెత్త పలుకులో అడుగడుగునా అవధులు లేని ఆక్రోశం! తాను ద్వేషించే ఇద్దరు నాయకులు అమేయమైన ఆధిక్యతతో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారనే కార్పణ్యం!! పరిపాలన చేతకాక చేతులుముడుచుకుని కూర్చుంటారని, రెండో సారి ప్రజలతో పరాభవించబడతారని ఎన్నెన్నో కలలు కన్నప్పటికీ ఆ ఆశలను అడియాసలు చేస్తూ కేసీఆర్ మరింత పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారన్న ఉక్రోషం!!! అనుభవం లేనివాడని, కేసుల భయంతో పరిపాలన చెయ్యలేక మధ్యలోనే జైలుకు వెళ్తాడని, మళ్ళీ తన యజమాని చంద్రబాబు చేతిలోకి పువ్వుల్లో పెట్టి అధికారాన్ని అప్పగిస్తారని పెట్టుకున్న మనోవాంఛలు దివాస్వప్నాలుగా మిగిలాయన్న పరితాపం…వెరసి కలిపికొట్టరా కావేటిరంగా అన్నట్లు ఒకేసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..తన నిత్యశత్రువు జగన్మోహన్ రెడ్డి మీద పెడబొబ్బలతో విరుచుకునిపడ్డాడు మన బాధాకృష్ణ! “ఇదేం బరితెగింపు” అంటూ తన తెంపరితనాన్ని, ఉడుకుమోతు తనాన్ని నగ్నంగా ప్రదర్శించుకున్నాడు. తన స్వామిభక్తిని చాటుకున్నాడు. పనిలోపనిగా గౌరవ న్యాయమూర్తులను, కోర్టులను కూడా భుజాన వేసుకుని ఈ ఇద్దరు నాయకుల మీద వారికి మరింత ఆగ్రహం పెంచేవిధంగా కొన్ని ప్రయత్నాలను కూడా చేశాడు పాపం!
“రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలతో బుద్ధిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు ఇలా తెగబడితే ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అదే జరిగితే అధికారులు చిక్కుల్లో పడడమే కాకుండా జగన్ రెడ్డి అధికారానికి ముప్పు ఏర్పడుతుంది. అయినా జగన్ అండ్ కో ఇవేమీ పట్టించుకోకుండా న్యాయ వ్యవస్థపై ఎదురుదాడికి దిగుతోంది.”
మనది ఫెడరల్ రాజ్యాంగం. రాజ్యాంగం లోని మూడు ప్రధాన అంగాలు శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ. ఈ మూడు వ్యవ్యస్థలు దేనికి దానికే స్వతంత్రంగా పనిచేస్తాయి. వీటిలో ఎవరూ ఎవరి మీద యజమాని కాదు. ఎవరూ ఎవరికీ సబార్డినేట్స్ కారు. గౌరవ న్యాయస్థానాలు ప్రజాప్రభుత్వ అధినేతలకు యజమానులము అనుకుంటే అది రాజ్యాంగ ధిక్కారమే అవుతుంది. ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాలను గౌరవించడం..వారి హక్కులకు, అధికారాలకు భంగం వాటిల్లకుండా కాపాడటం కూడా న్యాయస్థానాల విధి. గౌరవ ముఖ్యమంత్రులను హెచ్చరించడం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే అధికారులను బెదిరించడం, వాళ్ళను జైళ్లలో పెడతామని హుంకరించడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు.
ఒకరికి ప్రవర్తన, నీతులు బోధించేముందు న్యాయస్థానాలు కూడా వాటిని ఆచరించాలి. న్యాయమూర్తులు ఎవరైనా సరే, ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే రహస్యవిందులకు హాజరు కావడం, అనేక కేసులు, స్టేలు ఉన్న వ్యక్తి తో రాసుకుని పూసుకుని తిరగడం, ఆయనతో కలిసి వేదికలు పంచుకోవడం భారతదేశంలో ఎక్కడైనా కన్నామా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప? ఒక నాయకుడిమీద అభియోగాలు వచ్చినపుడు…అతనిపై విచారణ జరపమని సిబిఐ ని ఆదేశించినపుడు…తమదగ్గర సిబ్బంది లేరని చెప్పగానే ఆ కేసును మూసెయ్యడం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడైనా చూశామా? కొందరు న్యాయమూర్తులు తమ పదవులు ముగిసీ ముగియగానే రాజ్యసభ సభ్యత్వాలు, గవర్నర్ పదవులు, రాజ్యాంగపడవులను మరుక్షణంలో అధిరోహించడం ఏ దుర్లక్షణాలను సూచిస్తున్నాయి? న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరగలేదని భావించి న్యాయం చెయ్యమని ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయిస్తే అది నేరమవుతుందా?
****
“రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఎవడబ్బ సొమ్మని రైతులు ఇచ్చిన భూములను జగన్ రెడ్డి ప్రభుత్వం విక్రయించాలనుకుంటోంది? ఇటువంటి చర్యలను తప్పుబట్టడానికే న్యాయస్థానాలు ఉన్నాయి.”
న్యాయస్థానాలు ఎలాంటి చర్యలను తప్పు పట్టాలో చెప్పడానికి రాధాకృష్ణ ఎవడు? తమ తరపున వకాల్తా పుచ్చుకుని సమర్ధించమని న్యాయస్థానాలు ఇతగాడిని ప్రార్ధించాయా? అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చెయ్యడానికి రైతులు ఎవరు? అమరావతి కేవలం రైతుల రాజధానేనా? మిగిలిన ప్రాంతాల ప్రజల మనోభావాలతో పనిలేదా? అయినా అక్కడ రాజధాని పెట్టమని నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరు? ఎవరిచ్చారు ఆయనకు ఆ అధికారం? ప్రజలే ఇచ్చారంటారా? ఆ ప్రజలే కదా నేడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది? కాదంటానికి రైతులు ఎవరు? రాధాకృష్ణ ఎవరు?
*****
“ఈ సందర్భంగా జస్టిస్ రాకేశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రమోటీ ఐపీఎస్ అధికారుల సంఘం రాష్ట్ర డీజీపీకి శుక్రవారంనాడు వినతిపత్రం ఇచ్చింది.”
న్యాయస్థానం తమ గౌరవాన్ని తాము కాపాడుకుంటూనే ఇతర వ్యవస్థల గౌరవాన్ని కూడా కాపాడాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరూ న్యాయస్థానాల పాలేర్లు కారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రతిఒక్కరికీ ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఒక ఉన్నత ఐపీఎస్ అధికారిని పట్టుకుని “నువ్వు రిక్రూటీవా లేక ప్రమోటీవా అని నలుగురిలో ప్రశ్నించడం అతని ఆత్మగౌరవానికి భంగం కాదా? ఇది అచ్చం భూస్వామి-పాలేరు వ్యవస్థను గుర్తుకు తేవడం లేదా? ఒక గౌరవ న్యాయమూర్తి ఒక జిల్లా పోలీసు అధికారిని అలా ప్రశ్నించడంతో ఔచిత్యం ఉన్నదా?
****
“ఇప్పుడు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యాయస్థానాలలో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్మత్త ప్రేలాపనలను గుర్తుకుతెస్తున్నాయి”.
మనకో సామెత ఉన్నది. “రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు” అని. న్యాయవ్యవస్థ కూడా అంతే. న్యాయమూర్తులు నిష్టాగరిష్టులుగా ఉన్నంతకాలం, కేవలం న్యాయసూత్రాల ప్రకారమే తీర్పులు ఇచ్చినంతకాలం, నిష్పక్షపాతంగా వ్యవహరించినంతకాలం న్యాయస్థానాల పట్ల ప్రజల విశ్వాసం చెక్కు చెదరదు. ఈ దేశంలో ఏ వ్యవస్ధ కూడా తనకు న్యాయం చెయ్యలేదనుకున్నప్పుడు సామాన్యులు చివరికి ఆశ్రయించేది న్యాయస్థానాలనే అన్న విషయం గౌరవ న్యాయస్థానాలు మర్చిపోకూడదు. ఒకేరకమైన కేసుల్లో ఒకరాష్ట్రంలో ఒక తీర్పు, మరొక రాష్ట్రంలో మరొక తీర్పు ఎందుకు వెలువడుతున్నాయి? జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు ఎందుకు కొట్టేస్తున్నాయి? కోర్టు కోర్టుకు తీర్పు తీర్పుకు ఇంత మార్పు ఎందుకు ఉంటున్నది? లోపం ఎక్కడున్నది? “హైకోర్టు సరిగ్గా వ్యవహరించలేదు” అని కొన్ని కేసుల విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు బహిరంగంగా వ్యాఖ్యానించడం మనము చూశాము. న్యాయస్థానాల విశ్వసనీయత దెబ్బతినడానికి, నమ్మకం పోవడానికి కారణం న్యాయస్థానాల తీరే తప్ప జగన్మోహనరెడ్డో, కెసిఆరో, మోడీయో ఎంతమాత్రం కాదు.
****
“ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వ్యాధి బారినపడినవారికి సరైన చికిత్స అందించే పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికీ లేదు. కరోనా బారిన పడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పరిగెత్తారు. వారు హైదరాబాద్‌కు పరిగెత్తుకు వచ్చారంటే అది రాష్ట్రానికి అవమానం కాదా?”
దేశంలో ఎక్కడైనా ప్రజానాయకులు, అధికంగా అభిమానులు, అనుచరులు కలిగిన నాయకులు ఎప్పుడైనా స్వల్ప ఆరోగ్యసమస్యలతో ఆసుపత్రుల్లో చేరినా, వారికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందునా విజయసాయిరెడ్డి, అంజాద్ బాషా లాంటివారికి అనుచరులు చాలా ఎక్కువ. వారు స్థానిక ఆసుపత్రుల్లో చేరితే ఈ కరోనా సమయంలో సందర్శకుల తాకిడి కారణంగా ప్రమాదస్థాయి పెరుగుతుంది. వాటిని నివారించడానికే వీఐపీలు వారికి అందకుండా దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో వేలాదిమంది చికిత్స చేయించుకుని కరోనాను జయించి ఇళ్లకు క్షేమంగా వెళ్లారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన వైద్యం లేదని కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లారంటే హైద్రాబాద్ లో కాటరాక్ట్ సర్జరీలు చేసే ఆసుపత్రులు లేవనా అర్ధం? ఇది ప్రజల మేలుకోరి చెయ్యడమే తప్ప తమ ప్రాంతంలో చికిత్స లేదని కాదు. కేవలం కువిమర్శలు చేసి తన కుసంస్కారాన్ని చాటుకోవడానికే రాధాకృష్ణ ఇంత బరితెగిస్తున్నాడు!
***
“జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. తాను అనుకున్నది జరిగి తీరాలనుకోవడం తప్ప! ‘అలా చేయడం తప్పు. చట్టాన్ని, నిబంధనలను పాటించండి’ అని చెబుతున్నవారిపై దుష్టులుగా ముద్ర వేస్తున్నారు. జగన్ అండ్ కో చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మొదట్లో ప్రజలు నమ్మితే నమ్మవచ్చుగాని కరోనా వైరస్‌ను అరికట్టే విషయంలోనే కాకుండా చికిత్స అందించే విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నారు.”
హహహహ్హహ్హ…. ఇంతకన్నా గొప్ప హాస్యం చిందించడం ఎవరివలనా కాదు. ‘పగవాడిని పంచాంగం అడిగితె మధ్యాహ్నం కల్లా మరణం’ అని చెప్పాడట! అలా ఉంది రాధాకృష్ణ సోది! దేశం మొత్తంలో కరోనా పరీక్షల్లో కానీ, చికిత్సలో కానీ, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. బాధితులను గుర్తించడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, చికిత్స అనంతరం మూడువేలరూపాయల నగదును కూడా ఇచ్చి పంపించడం దేశం మొత్తంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతున్నది. అలాగే ఇప్పటికి దాదాపు పదిహేను లక్షల టెస్టులు దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగాయి అని రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు లాగా పొరుగురాష్ట్రం వెళ్లి దాక్కోకుండా జగన్ ధైర్యంగా ప్రజల్లో తిరుగుతూ, సమీక్షలు నిర్వహిస్తూ వేలాదికోట్ల రూపాయల ఖర్చుకు వెనుకాడకుండా కరోనాతో పోరాడుతున్నాడన్న సత్యం కళ్ళున్న ప్రతిఒక్కరికీ కనిపిస్తుంది..ఒక్క మన ధృతరాష్ట్ర రాధాకృష్ణకు మినహా!!
****
“గ్రామాల్లో దళితుల పెత్తనాన్ని సహించలేని శక్తులు ఇప్పుడు ప్రభుత్వ అండతో దళితులపై దాడులు చేస్తున్నాయి. తమ సిఫారసులతో నియమితులైన పోలీసుల ద్వారా దళిత యువకుడికి శిరోముండనం చేయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఏకంగా ఓ దళిత యువకుడిని కొట్టించి చంపారు.”
అహో…దళితుల మీద దౌర్జన్యాలను గూర్చి మన రాధాకృష్ణే చెప్పాలి! అసలు మన రాష్ట్రంలో దళితుల మీద దౌర్జన్యాలు మొదలయింది ఎవరి సువర్ణ పరిపాలనలోనో రాధాకృష్ణ చెప్పగలరా? కారంచేడు, చుండూరు సంఘటనల్లో దళితులను ఊచకోత కోసింది ఎవరి పరిపాలనలోనో రాధాకృష్ణకు గుర్తుందా? ఎస్సీలు, ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని కూసింది ఎవరు? “మీ తోకలు కోస్తా” అని నాయి బ్రాహ్మణ సోదరులను నలుగురిలో దూషించింది ఎవరు? దళితులైన మోత్కుపల్లి నరసింహులు, వర్ల రామయ్యలతో ఏళ్ల తరబడి గాడిదచాకిరీ చేయించుకుని వారిని నట్టేట ముంచింది ఎవరు? ప్రజల జ్ఞాపకశక్తి మీద రాధాకృష్ణకు ఎంత అపనమ్మకమో మరి!
****
“నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద శిక్ష అనుభవించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.”
ఊగి ఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుందన్నట్లు జగన్ మీద ఎంత ఆడిపోసుకున్నా ఆ ఆక్రోశం వెనుక ఉన్న అసలు విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే తన సామాజికవర్గ అధికారిని మళ్ళీ అందలం ఎక్కించలేదని… ఎక్కించడంలో జాప్యం జరుగుతున్నదని….అంతేకాదా రాధా? ప్రధానకార్యదర్శి కోర్టు వెయ్యబోయే శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు రాధమ్మ….ప్రధాన కార్యదర్శికి కోర్ట్ శిక్ష విధిస్తుందని రాధమ్మకు ఎవరు చెప్పారు? ఏ న్యాయమూర్తి నుంచైనా సమాచారం అందిందా? లేక ముందుగానే తీర్పు ఇస్తున్నాడా రాధా?
****
“ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు ప్రవహిస్తేగానీ ప్రభుత్వం మేల్కొనలేదు. అదేమంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే ఉస్మానియాకు నూతన భవనాలు నిర్మించలేకపోయామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, సచివాలయం భవనాల కూల్చివేతలను విరమించుకోలేదే! “
రాధాకృష్ణకు మతిమరుపు వచ్చిఉంటే ఉండొచ్చు కానీ, అయిదేళ్ళక్రితమే కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూసి మేలుకున్నారు. 2015 లోనే ఉస్మానియాను కూలగొట్టి కొత్త భవనాలను నిర్మిద్దామని ప్రతిపాదిస్తే అప్పుడు ప్రతిపక్షాలన్నీ మన్నూమిన్నూ ఏకం చేసి అడ్డుకున్న సంగతి ప్రజలు మరిచిపోయారని రాధమ్మ అభిప్రాయం కాబోలు! ఇక సచివాలయం భవనాల కూల్చివేతను కూడా ప్రతిపక్షాలు అడ్డుకుంటే నిరవధికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తరువాత మాత్రమే తిరిగి కూల్చివేత పనులు మొదలయ్యాయి. రెండు రోజులు కూల్చివేత పనులు జరిగాక మళ్ళీ ప్రతిపక్షాలు సుప్రీమ్ కోర్టుకు వెళ్లాయి. దాంతో మళ్ళీ పనులు ఆగిపోయాయి. అక్కడినుంచి కూడా అనుమతులు లభించాకే తిరిగి కూల్చివేత పనులు మొదలయ్యాయి.
****
“కేసీఆర్ ప్రకటించినవన్నీ ఆచరణకు నోచుకుని ఉంటే హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టవర్లే కనిపించేవి. పాతబస్తీ ఇస్తాంబుల్ అయ్యుండేది. కరీంనగర్ లండన్‌ను తలపించేది. స్వరాష్ట్రంలో ఆరేళ్లు గడిచినా ప్రభుత్వాసుపత్రులలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు.”
ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని పధకాలను ప్రకటిస్తారు. కలలు కంటారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి అంతకన్నా ముఖ్యమైనవి అనుకున్నప్పుడు వాటిని తలకెత్తుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేసింది ఏమిటి? నవ నగరాలు అన్నారు. సింగపూర్, జపాన్, టోక్యో, రష్యా, అమెరికా, లండన్…మొదలైన దేశాలు వెళ్ళినప్పుడు అమరావతిని ఆ దేశంలా మార్చేస్తానని కోతలు కోశారు….బులెట్ రైళ్లు అన్నారు…లూప్ లైన్ రైళ్లు అన్నారు…. ఇక డిజైన్లు అంటూ వందలాది గ్రాఫిక్స్ ను చూపించి ప్రజలను భ్రమల్లో ముంచారు. చివరకు సినిమా సెట్టింగులు వేసుకునే దర్శకులను పిలిచి డిజైన్లను తయారు చేసే బాధ్యతను వారికి అప్పగించారు….ఏదీ? ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన ఒక్క పూరిగుడిసెను నిర్మించారా? మరి చంద్రబాబును ఈ విధంగా రాధాకృష్ణ అడిగిన దాఖలా ఉన్నదా? పైగా చంద్రబాబుకు అనుక్షణం డప్పుకొడుతూ వందలకోట్ల రూపాయల ప్రజాధాన్ని దోచుకున్నాడు… ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం పేరుతో ఏడువందల కోట్ల రూపాయల ధనాన్ని కొట్టేసిన రాధాకృష్ణ నీతులు చెప్పడమా? నవ్విపోదురుగాక!
***
“గత ఎన్నికల్లో కేసీఆర్‌కు కావాల్సినంత మెజారిటీని ప్రజలు సమకూర్చినప్పటికీ కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుని ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలకుండా చేశారు. ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేయడానికి జగన్ రెడ్డి నడుంబిగించారు. ఇలాంటి అనైతిక విషయాల్లో మాత్రం ఒకరికొకరు ఆదర్శంగా నిలుస్తున్నారు.”
ఓహోహో…చెప్పేవి శ్రీరంగనీతులు…దూరేవి దొమ్మరి గుడిసెలు అంటే ఇదే..ఇదే….2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కావలసినంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు. అయినప్పటికీ అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందని పెద్దలు చెప్పినట్లు…ప్రతిపక్ష వైసిపి నుంచి ఇరవైరెండు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేసిన విషయం రాధాకృష్ణ మెదడు లేని కేబేజి లాంటి తలకాయ పొరల్లోనుంచి జారిపోయిందా? జగన్ కు ప్రతిపక్షహోదా లేకుండా చెయ్యాలని, వారికి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కకుండా చెయ్యాలని తన యజమాని చంద్రబాబు చేసిన ప్రజాస్వామ్య ఖూనీని రాధమ్మ విస్మరించిన జనం మరచిపోతారా? చంద్రబాబు పాటించిన ఆ నీతిని నేడు కేసీఆర్, జగన్ పాటిస్తే తప్పేమిటి? ఆనాడు చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి నైతికను పాటిస్తే ఈనాడు కేసీఆర్ ను, జగన్ ను మాబోటివాళ్ళు తప్పు పట్టేవాళ్ళం. కానీ, ఆనాడు చంద్రబాబును సమర్ధించిన రాధాకృష్ణ లాంటి క్షుద్ర పాత్రికేయులు ఇవాళ కేసీఆర్ ను, జగన్ ను ఎలా తప్పు పడతారు? అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు అంతటి నీచానికి జగన్ దిగజారలేదు. ఆనాడు చంద్రబాబు చేసిన కుత్సితం ఈనాడు జగన్ పాటిస్తే…తెలుగుదేశం క్షణంలో ఖాళీ అయిపోతుంది.
***
ఏమైనప్పటికీ, ఎదుటి మనిషికీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఆచార్య ఆత్రేయ యాభై ఏళ్ళక్రితమే చెప్పినట్లు…రాధాకృష్ణ చెప్పే నీతులు వింటుంటే తాను తెడ్డు నాకి కోడలికి అలా చెయ్యొద్దని చెప్పిన అత్త జ్ఞాపకం వస్తున్నది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు