వినాశకాలం దాపురించి విషపురాతలు!

August 16 ABN Radha Krishna Kotha Paluku
 
 
జంధ్యాల సినిమాల్లో జోకుల్లాగా, ప్రతివారం తన ఆర్తనాదాలతో పాఠకులను పగలబడి నవ్వించే క్షుద్రజ్యోతి రాధాకృష్ణ యధాప్రకారంగా ఈ వారం కూడా తన ప్రయత్నాల్లో పూర్తిగా సక్సెస్ అయ్యారు అనడంలో సందేహం లేదు.  ఆయన ఎత్తుకున్న సబ్జెక్ట్ వైద్యరంగానిదైనా, విద్యారంగనిదైనా, పారిశ్రామికరంగానిదైనా “ప్రతి సెలయేటి గమ్యం సాగరసంగమం” అన్నట్లు చివరకు తన కులంవారికోసం, తన యజమాని దోపిడీసామ్రాజ్యం అమరావతి జారిపోతున్నదన్న రోదనవైపుకే దారితీస్తుంది!  అలాగే ఈ వారం కూడా తనదైన “టాకార” ప్రాసలతో జగన్ మీద బురద చల్లడానికి తన శక్తియుక్తులన్నీ ధారపోసి, వినాశకాలం దాపురించిన రాధాకృష్ణ తన విపరీతబుద్ధులతో  గొంతు చించుకున్న విధంబెట్టిదనగా……
 
****August 16 ABN Radha Krishna Kotha Paluku
 
”హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలు మాకు లేవు. ఆ నగరాల్లో ఉన్నట్టుగా వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మాకు లేవు” ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తంచేసిన ఆవేదన ఇది! ముఖ్యమంత్రి ఆవేదనలో నిజం ఉంది. అందుకేగా, అమరావతిని అభివృద్ధి చేసుకుంటే ఈలోటు కొంతైనా తీరుతుందని పలువురు చెబుతున్నారు!”
 
హైద్రాబాద్, చెన్నై, బెంగళూర్ మహానగరాలు నాలుగేళ్లలోనో, అయిదేళ్లలోనో అభివృద్ధి చెందినవి కావు.  హైద్రాబాద్ కు నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉన్నది.  అలాగే స్వతంత్రం వచ్చాక, 1956 లో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కాలక్రమంలో హైద్రాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుంది తప్ప చంద్రబాబు ప్రదర్శించిన గ్రాఫిక్స్ మాయాజాల అమరావతిలా కాదు.   మహానగరాల్లోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం అయిపోతే, రాష్ట్రం నలుమూలలా నివసించే ప్రజలు పొట్టకూటికోసం అక్కడికి చేరుతారు.  అంటే ఒకటో రెండో మహానగరాలను వృద్ధి చేసి రాజకీయనాయకులు అందరూ అక్కడే వేలకోట్ల రూపాయలు పోగుచేసుకుని, మిగిలిన ప్రాంతాలవారిని బానిసలుగా తీర్చిదిద్దే దుర్మార్గం భవిష్యత్తులో జరగకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైసిపి ప్రభుత్వం చెబుతున్నది.  ఒక్క అమరావతినే అభివృద్ధి చెయ్యాలని రాధాకృష్ణకు ఎందుకు ఆశ?  ఎందుకంటే, తన సామాజికవర్గం వారు ఒక్కరే వృద్ధి చెందాలి.  చంద్రబాబు పాలనలో తాము పోగేసిన వేలకోట్ల రూపాయల ఆస్తులు కరిగిపోతున్నదన్న క్షోభ కాదా ఇది? 
 
 
****
 
“మహా నగరాన్ని నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ కాలదన్నుతున్నది జగన్‌ రెడ్డి కాదా? మూడు రాజధానులు అనే దిక్కుమాలిన ప్రతిపాదనను తెర మీదకు తెచ్చి ”మా రాజధాని ఇది” అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చెప్పుకోలేని దుస్థితి తెచ్చింది ఎవరు? అమరావతిని కొనసాగించి ఉంటే హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ అక్కడికి కూడా తరలివచ్చేవి కదా!”
 
మహానగరాన్ని ఎవరో  ఒకరు నిర్మించడానికి ఇది రాచరికం కాదు…చంద్రబాబైనా, జగనైనా రాజవంశీకులు కారు…వారి తరువాత వారి కొడుకులు, కూతుళ్లు రాజ్యాలు ఏలరు.  ఎవరికి అధికారం ఇచ్చినా అది కేవలం అరవై మాసాలు మాత్రమే.  ఆ కాలాన్ని మాటలాగారడీతో వృధా చేసుకుని ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటి?  మూడు రాజధానులు అనేది దిక్కుమాలిన ప్రతిపాదన రాధాకృష్ణకు, చంద్రబాబుకు కావచ్చు.  ఎందుకంటే వారు దోచుకున్న వేలకోట్ల రూపాయల ఆస్తులకు దిక్కు లేకుండా పోతున్నది.  రాధాకృష్ణ చెప్పిన మాటలను విశాఖ, కర్నూల్ వారిని చెప్పమనండి చూద్దాం.   దేవతావస్త్రం వంటి లేని మాయనగరాన్ని నిర్మించడం కోసం లక్షలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసేకన్నా, ఇప్పటికే ఉన్న మూడు నగరాలను మహానగరాలుగా అభివృద్ధి చేస్తే తప్పేమిటట?  
 
****
Ramesh hospital owners are absconding
“స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు కొవిడ్‌ బాధితులు మరణించారు. ఆ హోటల్‌ను రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లో కూడా పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు హోటళ్లను లీజుకు తీసుకొని కరోనా బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నాయి. స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనది. అయితే, ఈ దుర్ఘటనను ప్రమాదంగా చూడకుండా ఒక సామాజిక వర్గంపై కక్ష సాధించడానికి ప్రభుత్వం వాడుకోవడం వైద్య రంగానికి చెందిన వారితో పాటు వైద్యులనూ దిగ్భ్రాంతికి  గురిచేస్తోంది.”
 
అయ్యయ్యో పాపం!  ఎంత అమాయక చక్రవర్తియో రాధాకృష్ణ!  స్వర్ణ ప్యాలస్ లో జరిగిన అగ్నిప్రమాదం కేవలం దురదృష్టకరమైనది.  విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం మాత్రం పరమ దుర్మార్గమైనది!  ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి పదకొండు మంది మృత్యువుతో పోరాడుతున్న రోగులు మరణిస్తే అది రాధాకృష్ణకు చాలా చిన్న విషయం.  ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగి పదకొండు మంది మరణిస్తే మాత్రం అది ప్రభుత్వ వైఫల్యం.. కంపెనీ యజమానుల నిర్లక్ష్యం…వారివలన విశాఖ నగరానికే పెనుప్రమాదం!!  ఇక విశాఖ రాజధానిగా పనికిరాదు!  ….ఆ కంపెనీ యజమానులు, అధికారులను అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి!  వారేవా రాధాకృష్ణ తీర్పు మజ్జారే!   
 
****
“తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతులు కూడా ఎక్కువే. అయినా ఇవేవీ పట్టని ప్రభుత్వ పెద్దలు రమేశ్‌ ఆస్పత్రిని మూయించే బృహత్తర పనిలో ఉన్నారు. ఆస్పత్రి యజమాని రమేశ్‌బాబును అరెస్టు చేయడం కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం జరిగితే డాక్టర్‌ రమేశ్‌ను అరెస్ట్‌ చేయాలనుకోవడం ఏమిటో తెలియదు. విజయవాడలో ఉన్న ఆస్పత్రులలోకెల్లా రమేశ్‌ ఆస్పత్రి పెద్దది. అలాంటి ఆస్పత్రిపై కుల ద్వేషంతో వ్యవహరించడం విజ్ఞత ఉన్న పాలకులు చేయవలసిన పనేనా?”
 
లీజుకు తీసుకున్న హోటల్లో అగ్నిప్రమాదం జరిగితే డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేయాలనుకోవడం ఏమిటో రాధాకృష్ణకు తెలియడం లేదట!  హ్హాహ్హా….ఒక దొంగల నాయకుడు ఉంటాడు…ఫలానా చోట దొంగతనం చేసి రమ్మని తన ముఠాలో ఒకడిని పంపిస్తాడు.  అక్కడ వాడు పోలీసులకు పట్టుబడతాడు.  అక్కడ వాడొక్కడినే అరెస్ట్ చేస్తారా లేక దొంగలముఠా నాయకుడిని కూడా అరెస్ట్ చేస్తారా?  ఈ లాజిక్ రాధాకృష్ణకు తెలియదా?  విజయవాడలో ఉన్న ఆసుపత్రులు అన్నిటిలో పెద్దదైనంత మాత్రాన ఆ ఆసుపత్రి యజమానిని అరెస్ట్ చేయకూడదా?  ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారంటే అందుకు బాధ్యులు ఎవరు?  కోవిద్ వైరస్ లేదని తెలిసినా పాతికమంది రోగులను చేర్చుకుని రోజుకు లక్షల రూపాయల్లో ఫీజులు గుంజుతున్న దుర్మార్గుల మీద కేసులు పెడితే దాన్ని కులం కోణంలో చూడటం ఏమిటి?  నేరానికి కులం, మతం ఉంటాయా?  ఫలానా కులం వాడు నేరం చేసినా అరెస్ట్ చేయకూడదనే చట్టాలు ఏమైనా ఉన్నాయా?   రాధాకృష్ణ కులంవాళ్ళు కాబట్టి ఆ ఆసుపత్రి యజమానిని అరెస్ట్ చేస్తే అది అవిజ్ఞత!   మరి అంత పెద్ద డాక్టరూ తన ఆసుపత్రిలో ప్రమాదం జరిగి పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఆసుపత్రికి వెళ్లి బతికి బయటపడ్డ రోగులను మరొక ఆసుపత్రికి తరలించడం, మరణించినవారికి నష్టపరిహారం ప్రకటించడం లాంటి మానవతా చర్యలు తీసుకోకుండా, జేబుదొంగలా ఎందుకు పారిపోయాడు?  ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్లు, అధికారులు డాక్టర్ రమేష్ లా పారిపోయారా?  ప్రమాదం జరిగినపుడు పిరికిపందలా పారిపోవడం నేరం అని రాధాకృష్ణ ఒక్క వాక్యం కూడా రాయడేమి?  ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టాలని?  
 
****
“డాక్టర్‌ రమేశ్‌ బాబును అరెస్టు చేయడం ఆయనకు అత్యంత ప్రాధాన్యమైంది. తెలంగాణ అధికారులు హైకోర్టులో వాదించిన దానికి భిన్నంగా అక్కడి అధికారులు కూడా ప్రభుత్వ పెద్దలకు వంత పాడుతున్నారు. ఇలా అయితే మూడు రాజధానులు కాదు గదా, 30 రాజధానులు ప్రకటించినా ఆ రాష్ట్రంలో పనిచేయడానికి వైద్యులు ఇష్టపడతారా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా కుల ద్వేషంతో రగిలిపోవడం వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతారు. వైద్యులను కూడా కులం కోణంతో చూడడం రోత పుట్టిస్తోంది.”
 
ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలకు కాక రాధాకృష్ణకు, రామోజీరావుకు, పచ్చకామెర్ల చానెళ్లకు వంత పాడుతారా?  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ చార్జీలు, బస్సు చార్జీలు, ఏడాదికి రెండుసార్లు పెంచుతూ తనదైన సంస్కరణలతో ప్రజల నడ్డి విరగ్గొట్టి వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో నాటి అధికారులు చంద్రబాబు మనసెరిగి ప్రజలకు ఉచితాలు అలవాటు చెయ్యకూడదని వంత పాడారు.  ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తరువాత కరెంట్ ఉచితంగా ఇవ్వాలి, బియ్యం రూపాయికి ఇవ్వాలి, ఫీజ్ రీయింబర్సుమెంట్ ఇవ్వాలి అంటూ బోలెడన్ని ఉచితాలు ఇవ్వాలనగానే, ఆయన మనసెరిగి అలా ఉచితాలు ఇవ్వడం సాధ్యమే అంటూ వంత పాడారు.  ఇక వైద్యులను కూడా కులం కోణంలో అంటూ శ్రీరంగనీతులు చెబుతున్న రాధాకృష్ణ…ఎల్జీ పాలిమర్స్ లో విజయసాయిరెడ్డి బంధువులు డైరెక్టర్లుగా ఉన్నారనేగదా వారందరిని అరెస్ట్ చెయ్యాలని, కంపెనీని మూసెయ్యాలని గావుకేకలు పెట్టాడు?  అదే ఆ కంపెనీ వారు తన సామాజికవర్గం వారే అయితే రాధాకృష్ణ ఆ వార్తను అసలు తన పేపర్లో వేసేవాడా?  ఛానెల్లో చూపించేవాడా?  రమేష్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ఏ రెడ్ల ఆసుపత్రిలోనే జరిగిఉంటే ఇప్పుడు రాధాకృష్ణ కలం ఎంత తీవ్రంగా  నిప్పులు కక్కేది?  వైద్యులను సైతం కులం కోణంలో చూస్తున్న నికృష్టులు ఎవరు?  అంత అజ్ఞానంలో ప్రజలు లేరులే!  
 
****  
 
High Court of Andhra Pradesh
 
“ఆ సందర్భంగా జగన్‌ రెడ్డి వ్యవహారధోరణి సదరు న్యాయమూర్తులను కంగు తినిపించింది. ”నేను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను. మీరు మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటారు.   మీకంటే నేనే గొప్ప!” అన్నట్టుగా జగన్‌ రెడ్డి మాటలు ఉన్నాయట!”
 
రాధాకృష్ణ స్వైరకల్పనలు ఎంత అధమస్థాయిలో ఉన్నాయో, మానసికంగా రాధాకృష్ణ ఎంత దిగజారిపోయాడో..పై వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.  జగనేమైనా లోకేష్ నాయుడులా పరమశుంఠా, నిరక్షరకుక్షి కాదే!   ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయమూర్తులతో జగన్ అలా మాట్లాడుతారంటే రాధాకృష్ణ ఇంట్లో పాచిపనిచేసే వారు సైతం విశ్వసిస్తారా?  పెళ్లికాని కుర్రాళ్ళు రాత్రివేళ పడుకుని సినిమా హీరోయిన్లను తలచుకుంటూ ఎలా ఊహల్లో తేలిపోతారో రాధాకృష్ణ కూడా క్షణం క్షణం జగన్ అనే సింహం కలలోకొస్తుందేమో అని భయపడుతూ ఇలాంటి పీడకలలు కంటున్నట్లున్నాడు!  జగన్ అలా అన్నారని ఏ న్యాయమూర్తి రాధాకృష్ణతో చెప్పారో రాధాకృష్ణ చెప్పగలరా?  ఇలాంటి పిచ్చి కబుర్లు చెబితే నమ్మడానికి జనం ఏమైనా రాధాకృష్ణ, లోకేష్ నాయుడుల్లా వెర్రివాళ్ళు కారని రాధాకృష్ణకు ఎపుడు తెలుస్తుంది?  
 
***
“అధికార వైసీపీతో పెట్టుకున్న రహస్య ఒప్పందాన్ని తెగదెంపులు చేసుకోకుండా అదెలా సాధ్యమో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి దాదాపు ఆరు శాతం ఓట్లు సాధించిన జనసేనాని పవన్‌ తోడుగా ఉంటే అధికారంలోకి రావొచ్చునని బీజేపీ నాయకులు ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, అంచనాలెప్పుడూ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న మూడు రాజధానుల వివాదంతో పాటు ఇతరత్రా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో అడుగులు వేయకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీనే ప్రధానంగా విమర్శించడం వల్ల ఎవరైనా అధికారంలోకి వస్తారా”
 
అద్గదీ వరస!   ఎన్ని ఏడుపులు ఏడ్చినా మళ్ళీ చివరకు బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో కలవాలి అనే అంశంతోనే ముగుస్తుంది!  చంద్రబాబుకు తోకలా ఉండి, చంద్రబాబు నేరాలను రక్షిస్తూ, చంద్రబాబు దయతో రెండుమూడు సీట్లు గెల్చుకోవాలి…రాధాకృష్ణ ఉయ్యాల ఊగి ఊగి  చివరకు అక్కడికే చేరుతుంది.  చంద్రబాబు తన అవినీతిని కాపాడుకోవడానికి దేశంలో ఉన్న అన్ని పార్టీలను కౌగలించుకోవచ్చు.  చివరకు తన బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీని కూడా వాటేసుకోవచ్చు.  కానీ, బీజేపీ మాత్రం ఒక్క చంద్రబాబుతోనే కలవాలి!  జనసేనతో కలవకూడదు.  వైసీపీతో జత కట్టకూడదు…. వాళ్ళు సొంతంగా ఎదగకూడదు.  వారి నిర్ణయాలు వారు తీసుకోకూడదు!  రాధాకృష్ణ సలహా తీసుకుని చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మసలుకోవాలి!  
 
****
“అవినీతి కేసుల నుంచి విముక్తి పొందడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూనే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా జగన్‌ రెడ్డి రూపొందించుకున్నారు. కేసుల నుంచి బయటపడే విషయంలో సహాయ పడతారన్న నమ్మకంతో గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీతో ఆయన సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు.”
 
సొబగు సొబగు….ఒక వంక న్యాయస్థానం పట్ల అఖండగౌరవం చాటుకుంటూ, న్యాయవ్యవస్థకు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదని ఏడుస్తూ, న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడుతున్నట్లు నటిస్తూ…మరొకవంక న్యాయస్థానాల పట్ల తన అసలు నైజం ఏమిటో బయటపెట్టుకుంటున్నాడు రాధాకృష్ణ.  బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉంటే అవినీతి కేసులనుంచి విముక్తి లభిస్తుందా?  అలాంటపుడు ఇక కేసులు ఎందుకు?  న్యాయస్థానాలు ఎందుకు?  ఏళ్లతరబడి కోర్టుల్లో వాదప్రతివాదాలు దేనికి?  బహుశా మరొక గంటలో జైలుకు వెళ్లాల్సిన సుజనాచౌదరి, రమేష్ లు ఇద్దరు బీజేపీ కౌగిట్లో ఒదిగిపోయి కేసులనుంచి బయటపడ్డ దృష్టాంతం రాధాకృష్ణ చూపించదలచుకున్నాడేమో?  మరి చంద్రబాబు మొన్నటిదాకా బీజేపీతో అంటకాగింది కేసులనుంచి రక్షించుకోవడానికేనా?  బీజేపీతో కలిసుంటే కేసులనుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ, జగన్ ఆ పనిచెయ్యడం లేదంటే జగన్ తన మీద కేసులగూర్చి భయపడటంలేదనే కదా అర్ధం!  న్యాయస్థానాల్లోనే తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడనే కదా భావం?  న్యాయస్థానాల పట్ల నిజమైన గౌరవం చూపిస్తున్నది జగనా లేక రాధాకృష్ణా?   అలాంటప్పుడు ఆయన్ను అభినందించాలి కదా!   ఇక అదానితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే ఆయన కేసులనుంచి బయట పడేస్తాడా?  రాష్ట్రానికి ఏమి సంబంధం ఉన్నదని నిర్మలా సీతారామన్ ను, సురేష్ ప్రభును నాడు చంద్రబాబు రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించారు?  అవినీతికేసులనుంచి రక్షిస్తారనేనా?  మొత్తానికి చంద్రబాబు లోగుట్టును భలేగా విప్పారు రాధాకృష్ణ!!
 
****
“అయితే, అదానీ చెప్పినంత మాత్రాన జగన్‌ను కేసుల నుంచి బీజేపీ పెద్దలు విముక్తం చేస్తారని చెప్పలేం. అయినా అంబానీ, అదానీ సహకారంతో కేసుల నుంచి బయటపడాలని జగన్‌ అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించని పక్షంలో మళ్లీ జైలుకు వెళ్లడానికి కూడా జగన్‌ రెడ్డి ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించుకున్నారని చెబుతున్నారు. అవినీతి కేసులలో తనకు శిక్షపడి జైలుకు వెళ్లవలసి వస్తే ముఖ్యమంత్రిగా తన స్థానంలో తన భార్య భారతిని నియమించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.”
 
ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని రహస్యాలు అన్నీ రాధాకృష్ణకు తెలుస్తాయి.  జగన్ జైలుకు వెళ్తాడని, భారతి ముఖ్యమంత్రి అవుతుందని రాధాకృష్ణకు సమాచారం ఇచ్చింది ఎవరో బయటపడితే రాధాకృష్ణలాంటి ధైర్యశాలి అయిన జర్నలిస్టుకు సముచితంగా ఉంటుంది.  ఆఫీసులో కూర్చుని పగటికలలు కంటున్న రాధాకృష్ణను చూస్తుంటే “పగటికలలు కంటున్న మామయ్యా…గాలిమేడలెన్నో నువ్వు కట్టావయ్యా”  అనే పాతసినిమా పాట ఒకటి గుర్తుకొస్తుంది.  
 
***
“అయితే, వైసీపీని విలీనం చేసే ప్రతిపాదనను జగన్‌ రెడ్డి ఇదివరకే నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతికూల పరిణామాలకు సైతం సిద్ధపడాలని జగన్‌ రెడ్డి ఇదివరకే తన సన్నిహితులకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీ అనుసరించబోయే వ్యూహాన్ని బట్టి జగన్‌ రెడ్డి పూర్తికాలం కొనసాగుతారా? లేక భార్య భారతి ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారా? అన్నది తెలుస్తుంది. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్ముతున్న జగన్‌ రెడ్డి భవిష్యత్తు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉంది!”
 
ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికిపోగానే చంద్రబాబు నాయుడు గజగజవణికిపోయి రాత్రికిరాత్రే హైద్రాబాద్ నుంచి  అమరావతికి పారిపోయాడు.  ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది ఘరానాపెద్దమనుషులు పోలీస్ కేసులు పెట్టగానే ఇళ్లనుంచి పరారయ్యారు…ఇక తనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, కాబోయే ముఖ్యమంత్రిని నేనే అని సొరకాయకోతలు కోసిన పవన్ కళ్యాణ్ బుద్ధిగా బీజేపీ పాదాలముందు వాలిపోయారు.  కానీ, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా, పదహారు నెలలు జైల్లో బంధించినా, ఎన్ని పచ్ఛాచానెళ్లు, పత్రికలు  శవాలను భక్షించే  రాకాసుల్లా పీక్కుతిన్నా, పర్వతంలా ఏమాత్రం చలించక,  న్యాయస్థానాల్లో వీరుడిలా పోరాడుతూ, మరోవంక ఆంధ్రరాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుని అఖండమైన మెజారిటీతో చంద్రబాబు దుష్టపాలనను తరిమేసి, ఏడాదిలోనే దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మొదటి ఐదుగురిలో స్థానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడతారా?   జగన్ తరువాత భారతి ముఖ్యమంత్రి అవుతుందో లేదో తెలియదు కానీ, రాధాకృష్ణ కలలు కంటున్న లోకేష్ నాయుడు మాత్రం వెయ్యి జన్మలు ఎత్తినా కనీసం ఎమ్మెల్యే కాలేడు!   రాధాకృష్ణ రాసిపెట్టుకోవచ్చు!  
 
 
***
 
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌.
తల తోక యనక యుండును. 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ.
 
అని శతకకారుడు ఏనాడో చెప్పాడు కదా!
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు