రాధాకృష్ణ బాధ పగవాడికి కూడా వద్దు! 

YS Jagan and ABN Radha Krishna
విక్రమార్కుడైనా ఎపుడైనా పట్టు వదులుతాడేమో కానీ, మన విక్రమార్కుడు రాధాకృష్ణ మాత్రం తన పట్టు వదలకుండా ప్రతివారమూ  “వాడుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయిన విటుడిని వారకాంత శపించినట్లు”  జగన్ కు,  అప్పుడప్పుడూ కేసీఆర్ కు శాపనార్ధాలు పెడుతూ తన పచ్చదురదను తీర్చుకుంటూ తన యజమానిని సంతృప్తి పరచడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు!  ఆ కోవలో “ఇద్దరూ ఇద్దరే”  అంటూ  ఈ వారం  వదిలిన విరిగిన పాలకోవా ముక్కలను పరిశీలిద్దాం.  
 
*** 
” ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరితో పాటు తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. జస్టిస్‌ మహేశ్వరికి న్యాయశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంది. తీర్పులు ఇచ్చే సమయంలో తన పరిధులను అతిక్రమించరు. అమలులో ఉన్న చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఆయన తీర్పులు ఉంటాయి.”
 
 
హమ్మయ్యా….సుప్రీంకోర్టు కొలీజియం మిక్కిలి సంతోషించాలి.  ఎందుకంటే..వారు నియమించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరికి న్యాయశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉన్నది అని ఒక పత్రికాయాజమాని సర్టిఫికెట్ ఇచ్చేశాడు.  అలాగే ఆయన ఇచ్చే తీర్పులు కూడా చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని మరో పరమసత్యాన్ని కూడా వెలికి తీసి తరించాడు.  దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి?  ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే న్యాయశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉన్నది.  ఆయన ఒక్కడి తీర్పులు మాత్రమే చట్టానికి, నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.  ఇక ఆ “క్రియాశీలకం” అనే పదానికి భాష్యం కూడా రాధాకృష్ణ మాత్రమే మనకు బోధించాలి. 
 
****
“హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను నియమించవలసి ఉంటుంది. అయితే గవర్నర్‌ ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంది కనుక గవర్నర్‌ సానుకూలంగా వ్యవహరించవచ్చు. అది జరగని పక్షంలో హైకోర్టు జోక్యం చేసుకుని రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించవచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.”
 
 
ఓహో..హో…న్యాయశాస్త్రం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన గౌరవ హైకోర్టు వారికీ రాధాకృష్ణ దిశానిర్దేశం చేస్తున్నాడు… న్యాయస్థానం ఆదేశాలను గవర్నర్ పాటించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించాలట.  గవర్నర్ ఆ పని చెయ్యకపోతే హైకోర్టు స్వయంగా రమేష్ కుమార్ ను ఎన్నికల కమీషనర్ కుర్చీలో బలవంతంగా అయినా కుదెయ్యచ్చునట!   ఇలాంటి లాజిక్ ఇంతవరకూ దేశంలోని ఏ న్యాయనిపుణుడికి కూడా తెలిసి ఉండదేమో?  ఎన్నికల కమీషనర్ ను హైకోర్టులే నియమించెట్లయితే ఇక వాళ్ళే ముఖ్యమంత్రులను, ప్రధానకార్యదర్శులను, డీజీపీలను నియమిస్తే ఇక ఎన్నికల జాతర నుంచి దేశానికి విముక్తి లభిస్తుంది! 
 
****
“ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచాల్సిన ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ వైఖరి కారణంగా నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. దీనితో ఉపశమనం కోసం ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు సైతం రెండు రాష్ట్రాల్లోనూ హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఈ కారణంగా ఉభయ రాష్ట్రాలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై భారంతోపాటు బాధ్యతా పెరుగుతోంది.”
 
 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్ కు ఉద్యమాలు, ఆందోళనల గూర్చి చెప్పడం అంటే “తాతకు దగ్గులు నేర్పడం లాంటిది”.  ఉద్యమం తోనే ఒక రాష్ట్రాన్ని సాధించిన ఏకైక మొనగాడు ఈ దేశంలో ఇంతవరకు కేసీఆర్ ఒక్కరే.  ఇక రాష్ట్రం మొత్తాన్ని పాదయాత్రతో కలయదిరిగి నాలుగు కోట్లమంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అఖండమైన మెజార్టీతో విజయాన్ని సాధించిన ప్రజాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.   ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణాలో కానీ, ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలు, ఆందోళనలు ఏమిటి?  ప్రాజెక్టులు కడుతున్నా, కొత్త భవనాలు కడతామన్నా, ఆసుపత్రులు నిర్మిస్తామన్నా, కోర్టుకు వెళ్లడం, అడ్డుకోవడానికి ప్రయత్నించడం…ఇవేగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు!   నిజానికి అయిదేళ్ళక్రితమే ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి పునర్నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే దాన్ని అడ్డుకున్నది ప్రతిపక్షాలే కదా!  ఇవాళ ఆసుపత్రి లోపలికి నీళ్లు వస్తున్నాయని   గగ్గోలు పెడుతున్నారు.  అలాగే నూట పాతిక ఏళ్లనాటి శిధిలం కాబోతున్న భవనాలను కూలగొట్టి ప్రతిష్టాత్మకంగా కేవలం నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చుతో సరికొత్త భవనాన్ని నిర్మిస్తామంటే కోర్టు ద్వారా అడ్డుకున్నది ప్రతిపక్షాలే కదా!  ఇపుడు హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి ప్రతిపక్షాల దవడలు వాయగొట్టింది!  ఇలాంటి ప్రతిపక్షాల ఆందోళనలకు, ఉద్యమాలకు విలువ ఎక్కడుంటుంది?  
 
****
“తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ విషయానికొస్తే ఆయన విద్యాభాస్యం అంతా విదేశాల్లోనే జరిగింది. దీనితో మానవ హక్కులు, మానవత్వం వంటి విషయాలతోపాటు ప్రజాస్వామిక సూత్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పరిధి దాటినట్టు అనిపించినా తుది తీర్పు వచ్చేసరికి చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా జస్టిస్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. తమ పరిధిలో లేని అంశమైనప్పటికీ కార్మికులకు న్యాయం జరిపించడానికి ఆయన పరితపించారు”.
 
 
హరేరేరే….ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తికి కితాబిచ్చి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తికి హారతి ఇవ్వకపోతే ఆయనకు కోపం వస్తుందని భయపడ్డాడేమో…మన బాధాకృష్ణ “తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి విద్యాభ్యాసం అంతా విదేశాల్లో జరిగింది కాబట్టి ఆయన ప్రజాస్వామిక సూత్రాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు”  అని ధ్రువపత్రాన్ని జారీ చేసేసాడు. అంతే మిగిలిన ప్రధాన న్యాయమూర్తుల్లో అలాంటి లక్షణం లేదని కుండబద్దలు కొట్టి చెప్పాడు.  అంతే కాదు…అప్పుడప్పుడు ఆయన తన పరిధిని దాటుతాడు అని కూడా నింద వేశాడు.  అంతటితో ఊరుకున్నాడా?  ఆబ్బె..అలా అయితే అతను రాధాకృష్ణ ఎందుకవుతాడు?  ఆర్టీసీ సమ్మె విషయం తన పరిధిలో లేని విషయం అని తేల్చేశాడు.  అనగా ఆయన తన పరిధిని అతిక్రమించి న్యాయసూత్రాలకు విరుద్ధంగా పనిచేశారని మనం గ్రహించాలి.  అందుకేనేమో ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టును కేసీఆర్ అసలు లెక్క చెయ్యలేదు!  ఆర్టీసీ సమ్మె విచారణలో తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నదని అప్పట్లో హైకోర్టు మీద వ్యాఖ్యలు, వార్తలు రాశాడా మన రాధాకృష్ణ?  
 
**
“సచివాలయ భవనాల కూల్చివేత విషయం కూడా తమ పరిధిలోనిది కాకపోయినా కోవిడ్‌ విస్తరిస్తున్న తరుణంలో కూల్చివేతలు అవసరమా అని ఆలోచించి అడ్డుకోవడానికి ప్రయత్నించారని న్యాయవాదులు విశ్వసిస్తున్నారు.”
 
 
భలే నవ్వొస్తుంది కదూ రాధాకృష్ణ అయోమయాన్ని, తాగుబోతు మాటలను చూస్తుంటే!  నాలుకకు నరం లేదని పెద్దలు అంటారు కానీ, అసలు రాధాకృష్ణ నోట్లో ఉన్నది నాలుకా లేక తాటిపట్టా అనే సందేహం రాకమానదు.  సచివాలయ భవనాల కూల్చివేత విషయం తమ పరిధిలోనిది కాదని విదేశాల్లో చదువుకున్న ప్రధాన న్యాయమూర్తికి తెలియని రహస్యం  మనదేశంలో చెట్టుకింది పాఠశాలలో చదువుకున్న రాధాకృష్ణకు ఎలా తెలిసిందబ్బా?  మరి కోవిద్ ఇప్పుడు లేదా?  సుప్రీమ్ కోర్ట్ తన తీర్పులో ఏమని చెప్పింది?  “కూల్చివేత అనేది ప్రభుత్వ  విధాన నిర్ణయం కాబట్టి మేము జోక్యం చేసుకోము”  అని చెప్పింది తప్ప కోవిద్ ను కారణంగా చూపించలేదే!  మరి కోవిద్ కారణంగా అని విశ్వసిస్తున్న సదరు “న్యాయవాదులు”  ఎవరై ఉంటారు???
 
****
“గతంలో ఇటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రులు ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రతిపక్షాలతో మాట కలిపేవారు. ఇప్పుడు తెలుగునాట అటువంటి వాతావరణం లేదు. ప్రతిపక్షాల ముఖం చూడటానికి కూడా ముఖ్యమంత్రులైన కేసీఆర్‌, జగన్‌రెడ్డి ఇష్టపడటం లేదు. విజ్ఞాపనపత్రాలు ఇద్దామనుకున్నా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు.”
 
ఇప్పుడు తెలుగునాట అలాంటి వాతావరణం లేదంటే…ఎప్పుడు?  తన యజమాని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిరోజూ ప్రతిపక్షాలతో చాటింగ్ చేస్తూండేవారా?  ప్రతిపక్షాలు ఎలా చెబితే అలా వినేవారా?  అప్పట్లో శ్రీమాన్ చంద్రబాబు గారు అనుదినము ఉదయమో సాయంత్రమో  నదీగర్భంలో నిర్మించిన తన అక్రమకట్టడం ముందు గూటిపడవలో కూర్చుని ప్రతిపక్షాలు ఇచ్చే వినతిపత్రాలను చిద్విలాసంగా స్వీకరించేవారా?  కొంచెం  క్లారిటీ ఇస్తే బాగుంటుంది రాధాకృష్ణా! 
 
****
“ఉభయ రాష్ట్రాలలో కూడా ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు ముఖ్యమంత్రులకు నమ్మినబంట్లుగా మారిపోయారు. విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించాలి.. వ్యవహరించవచ్చు అనే విషయం మర్చిపోయారు. ముఖ్యమంత్రుల మనసెరిగి మెలగడానికే వారు ఇష్టపడుతున్నారు.”
 
అవును కదా!  అప్పట్లో ఎబి వెంకటేశ్వర్ రావు, ఆర్పీ ఠాకూర్ లాంటి ఉన్నతాధికారులు ఎంత స్వతంత్రంగా వ్యవహరించారో కదా!  కాస్తో కూస్తో స్వతంత్రంగా వ్యవహరించిన అనూరాధ, పూనమ్ మాలకొండయ్య, ఐవైఆర్ కృష్ణారావు లాంటివారికి ఎంతటి ఘనసన్మానాలూ జరిగాయో కళ్లారా వీక్షించాము కదా!   
 
****
“ఈ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ రెడ్డి తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇరువురూ ప్రజలను కూడా కలుసుకోరు. ప్రతిపక్షాల వాసనే పడదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రగతి భవన్‌లో, ఎప్పుడు ఫామ్‌హౌస్‌లో ఉంటారో తెలియని పరిస్థితి! ఉభయ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న ఆలోచన ఇరువురు ముఖ్యమంత్రులకూ రాలేదు”.
 
ముఖ్యమంత్రులు ఎక్కడుంటే రాధాకృష్ణకు కలిగే నొప్పి ఏమిటో ఆయనకే తెలియాలి.  వారు ఎక్కడున్నా ప్రభుత్వ రధం ఆగిందా, సంక్షేమ పధకాలు ఆగాయా?  చంద్రబాబు తన కాలంలో ప్రతిపక్షాలను రాసుకుని పూసుకుని తిరిగినట్లు మహా నీతులు చెబుతున్నారు రాధాకృష్ణ.  చంద్రబాబు ఏనాడైనా అఖిలపక్షాన్ని నిర్వహించిన పాపాన పోయారా?  ఆనాడు ఈ నీతులు ఏమయ్యాయి?  
 
***
“కడుపులో మంట కానరాని మంట” అని పెద్దలు ఊరికే అన్నారా?  మళ్ళీ పదేళ్లవరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు…చూస్తుంటే కేసీఆర్, జగన్ జనం గుండెల్లో పాతుకుని పోతున్నారు….లోకేష్ నాయుడుని చూద్దామా…ఇప్పటికే పరమశుంఠగా అపఖ్యాతి పాలయ్యాడు.  ఇక ఈ మనోవేదననుంచి రాధాకృష్ణను రక్షించే దివ్యశక్తే లేదా?????
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు