పాపం! రాష్ట్రం మీద మన రాధాకృష్ణకు ఎంత అభిమానమో! ఎంత దారుణమైన ప్రేమో! అయిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం సింగపూర్, జపాన్, లండన్, రష్యా, అమెరికా కాబోతున్నదని భోరుభోరుమంటూ చంద్రబాబుకు కైవారాలు చేసిన రాధాకృష్ణకు ఒక్క ఏడాదిలోపలే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం కాబోతున్నదని, ప్రళయం వచ్చి ఎపి మొత్తం మునిగిపోతున్నదని ఎక్కడాలేని పరితాపం విరజిమ్ముతున్నది. తన యజమాని చంద్రబాబు పాతికేళ్ళపాటు, ఆ తరువాత యువనాయకుడు, ఉత్తరకుమారుడు లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి అయి ముప్ఫయి ఏళ్ళు పరిపాలిస్తాడని, ఆ తరువాత నారా దేవాన్ష్ నాయుడు ముఖ్యమంత్రిగా యాభై ఏళ్ళు పాలిస్తాడని, ఒక శాతవాహన సామ్రాజ్యంలా, ఒక మౌర్యవంశంలా నారా వంశం ఆంధ్రపరగణాను శతాబ్దాల తరబడి ఏలుతారని కన్న కలలన్నీ పీడకలలల్లా అయిదేళ్లలోగానే అంతం అవుతాయని ఏమాత్రం ఊహించని ఆయనకు …దేశంలోనే మూడో ఉత్తమ ముఖ్యమంత్రిగా జాతీయస్థాయిలో కీర్తించబడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలన ఒక దుస్వప్నంలా, జగన్మోహన్రెడ్డి సింహస్వప్నంలా వణికించడంలో ఆశ్చర్యం ఏముంది? “సింహం కలలోకి వస్తేనే ఏనుగు గుండె ఆగి మరణిస్తుందన్నట్లు” రాధాకృష్ణకు జగన్మోహన్ రెడ్డి అనునిత్యం కలలోకి వచ్చి భయపెడుతుంటే కంటిమీద కునుకు రాక వారానికోమారు అవాకులు చవాకులు పేలడం ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈ వారం “రాష్ట్రమేగతి బాగుపడునోయ్” అంటూ సన్నాసి రాగంలో విషాదకీర్తనను వినిపించడానికి ప్రయత్నించాడు! కర్ణపేయాలుగా ఉన్న ఆ కీర్తనలో కొన్ని చరణాలను వినోదంగా తిలకిద్దాం.
***
“ప్రజల అమాయకత్వాన్ని, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు ముక్కలాటకు జగన్ రెడ్డి తెరతీశారు. దీనితో ఒక్క రాజధానికి కూడా దిక్కులేని రాష్ట్రం మూడు ముక్కలాటలో మునిగిపోయింది. ప్రజలు కూడా ఇందుకు అనుగుణంగా విడిపోయారు. వినేవాళ్లుంటే పంది కూడా పురాణం చెబుతుందన్నట్టుగా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా మిడిమిడి జ్ఞానంతో కొందరు ప్రకటనలు చేస్తున్నారు.”
“అరెరెరె….ఒకప్పుడు చంద్రబాబు అభివృద్ధి పేరిట అన్ని పరిశ్రమలను హైద్రాబాద్ లోనే ఏర్పాటు చెయ్యడానికి కృషి చేసి రాయలసీమను, కోస్తాంధ్రను, ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సినిమారంగం, ఫిలిం సిటీ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, ఐటి సంస్థలు అన్నింటికీ హైద్రాబాద్ ను కేంద్రబిందువుగా చేసి రాష్ట్రం నలుమూలలనుంచి ఉద్యోగాలకోసం హైద్రాబాద్ ను ఆశ్రయించక తప్పని పరిస్థితి కల్పించారు. ఫలితంగా హైద్రాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందగా మిగిలిన రెండు ప్రాంతాలు పట్టించుకునే దిక్కులేక కునారిల్లిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనీసం వెయ్యిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ లేక ఉపాధి కోసం సీమాంధ్రులు వలసకూలీల్లా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తున్నది. ఐటి రంగాన్ని విశాఖకు, సినిమారంగాన్ని రాయలసీమకు మళ్లించినట్లయితే సీమాంధ్ర ఈనాడు పాడిఆవులా విలసిల్లేది. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా, ఉత్తరాంధ్రను, కోస్తాంధ్రను, రాయలసీమను సమానంగా వృద్ధి చెయ్యడానికి జగన్ పధకాలు వేస్తుంటే సంతోషించాల్సింది విడనాడి కేవలం అమరావతిలో తమ సామాజికవర్గం వారు కొనుగోలు చేసిన ఆస్తుల విలువలు తరిగిపోయాయనే దుగ్ధ మినహా రాధాకృష్ణకు మరో పట్టింపే లేదు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్ మీద రాధాకృష్ణకు అంత ప్రేమ కారిపోతుంటే, తన ఆంధ్రజ్యోతి పత్రికను, ఛానెల్ ను తక్షణమే అమరావతికి మార్చాలి.
****
“జగన్ రెడ్డిని గతంలో తీవ్రంగా విమర్శించిన వారు ఇప్పుడు మంత్రులుగా వెలుగొందుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతం, అమోఘం అని చిడతలు కొడుతున్నారు. నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఎజెండా ప్రకారం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదు.”
హయ్యయ్యో….ఏ రాజకీయపార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదన్న తెలివిడి ఇప్పుడెందుకు కలిగిందో? రాబోయే పదేళ్లు కూడా తెలుగుదేశమే అధికారంలో ఉంటుందని గత ఎన్నికలముందు బల్లగుద్ది చెప్పిన జోస్యాలు అన్నీ ఎందుకు విఫలం అయ్యాయి? 2020 వరకు మాదే అధికారం అని పాతికేళ్ళక్రితం చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్న రోజుల్లో చంద్రబాబుకు ఈ సూక్తి ఎందుకు వల్లించలేదు? నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అమరావతి ఒక్కటే వృద్ధి కావడం, తమ సామాజికవర్గం వాళ్ళు ఆర్ధికంగా ఎదగడం, మిగిలిన పదకొండు జిల్లాల ప్రజలు తమ పొట్టకూటికోసం అమరావతి మీద ఆధారపడుతూ బానిసల్లా బతకడం కాబోలు!
****
” కరోనా బాధితులను పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సచివాలయం నిర్మించబోతున్నామంటూ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నంలో ప్రభువులు బిజీగా ఉన్నారు.”
హాహాహా…ఇక్కడే రాధాకృష్ణ భలే చిలిపి కామెంట్స్ చేస్తూ దొరికిపోతాడు! కోవిద్ 19 చికిత్స కోసం ప్రయివేట్ ఆసుపత్రులను అనుమతించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు భీష్మించారు. బాధితులను గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించి అత్యుత్తమ చికిత్స అందించారు. ఆ దెబ్బతో కార్పొరేట్ ఆసుపత్రులు మూతపడ్డాయి. దోపిడీకి అవకాశం లేక విలవిలలాడాయి. ఆ సమయంలో కరోనా బాధితులకు ప్రయివేట్ వైద్యం చేయించుకునే అవకాశం ఇవ్వాలని గొంతులు చించుకున్నారు ఒకప్పుడు ఇలాంటి క్షుద్ర మేధావులు! కేంద్రం కూడా అనుమతించడంతో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా కరోనాకు చికిత్స చేసే అవకాశం దక్కింది. ప్రజల దీనావస్థను చూసి ఉదారంగా వ్యవహరించాల్సిన కార్పొరేట్ ఆసుపత్రులు దుర్మార్గమైన దోపిడీకి తెరలేపాయి. రోజుకు లక్ష రూపాయల చొప్పున బిల్లులు వేసి వ్యాధిగ్రస్తుల రక్తమాంసాలను జుర్రుకున్నాయి. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం రెండు కార్పొరేట్ ఆసుపత్రుల మీద వేటు వేసింది. ఇక తెలంగాణ సచివాలయ నిర్మాణం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా కాక, ఆంధ్రా సంస్కృతీ, ద్రావిడ సంస్కృతీ, ఒరియా సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మిస్తారా? అమరావతి అనే పేరు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిదా లేక తెలంగాణ సంస్కృతిదా?
****
“ఇక బీజేపీ, జనసేన పార్టీ కూటమి తమదైన ఆటను మొదలెట్టింది. రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రానికి ఏ పాత్రా ఉండదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో బీజేపీపై ఆశలు పెట్టుకున్నవారు నీరుగారిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్‌పై అమరావతి రైతులకు ఇప్పటివరకూ కొద్దోగొప్పో నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆయన బీజేపీతో జతకట్టి స్వరాన్ని సవరించుకున్నారు.”
రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రం పాత్ర ఉండదని కేంద్ర ప్రతినిధులు జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, మురళీధర్ రావు ఏనాటినుంచో ప్రకటిస్తున్నారు. అందులో తాజాగా ప్రకటించేదేమిటి? బీజేపీ ముసుగు వేసుకున్న కొందరు తెలుగుదేశం కోవర్టులు మాత్రమే “అమరావతి అంగుళం కూడా కదలదు” అంటూ ప్రజలను భ్రమల్లో ఉంచారు. బీజేపీ పై ఆశలు ఎలా పెట్టుకున్నారు? అమరావతి గూర్చి మోడీ, అమిత్ షా ఎన్నడైనా అసలు స్పందించారా? అమరావతి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకున్నారా? ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ కి వీడియో సాక్ష్యంతో పెట్టుబడి ఉమ్మడి రాజధానిని వదులుకుని రాత్రికిరాత్రి కేసీఆర్ మీద భయంతో చంద్రబాబు అమరావతికి పారిపోయినపుడు మోడీకి చెప్పి పారిపోయారా? మరి ఇప్పుడు బీజేపీ మీద ఆశలు పెట్టుకోవడం ఏమిటి? బహుశా చంద్రబాబుకు బంటులా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు! ఇక పవన్ అనేవాడు చంద్రబాబుతో కలిసి ఉంటె మంచివాడు…బీజేపీతో కలిస్తే దుర్మార్గుడు మన రాధాకృష్ణ దృష్టిలో! అయినప్పటికీ, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి, కేవలం పదహారు లక్షల ఓట్లు తెచ్చుకుని ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపించలేకపోయిన పవన్ కళ్యాణ్ ఏమి చెయ్యగలడు!
****
“బీజేపీ పెద్దలు చెబితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగానీ కాదనలేని పరిస్థితి. అయినా బీజేపీ నాయకులు ఆ దిశగా చొరవతీసుకోక పోగా, తమదైన శైలిలో రాజకీయ క్రీడకు తెరలేపారు. అధికార పార్టీని చెప్పుచేతల్లో ఉంచుకుంటూనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతారో తెలియదుగానీ ప్రస్తుతానికి బీజేపీని కూడా విలన్‌గా అమరావతి అనుకూలురు చూస్తున్నారు”
అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, రాధాకృష్ణకు వికేంద్రీకరణ ఇష్టం లేకపోతె అందుకు కేంద్రం తలఊపాలి. తమ సామాజికవర్గం వారు కొనుగోలు చేసిన వేలకోట్ల రూపాయల ఆస్తులను రక్షించుకోవాలంటే బీజేపీ వారి అభిమతాలకు బసవన్నలా తలాడించాలి. లేకపోతె బీజేపీ కూడా విలన్ అవుతుంది అమరావతి అనుకూలుర దృష్టిలో! ఎవరా అమరావతి అనుకూలురు? రైతుల వేషాల్లోని ఆ మూడు గ్రామాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు!! ఆ పిడికెడు మంది కోసం మిగిలిన పన్నెండు జిల్లాలవారిని బీజేపీ దూరం చేసుకుంటుందా? పైగా బీజేపీ చెబితే జగన్ గానీ, చంద్రబాబు కానీ కాదనలేని పరిస్థితిట!
అసలు జగన్ కు బీజేపీ ఎందుకు చెప్పాలి? జగన్ ఏమైనా రాష్ట్రంలో బీజేపీ రాజప్రతినిధా? ఆయన యాభై శాతం ఓటింగ్ తో ప్రజలతో ఎన్నిక కాబడినవాడు. అంటే జగన్ మీద కేసులు విచారణలో ఉన్నాయి కాబట్టి కేంద్రం చెబితే జగన్ వింటాడని రాధాకృష్ణ భ్రమ కాబోలు! కేసులను ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎదుర్కొన్నాడు! పదహారు నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించినా భయపడలేదు. అలాంటి జగన్ మోడీ చెబితే వింటాడని ఎలా కలలు కంటున్నాడు? మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రం ఇష్టం అని కేంద్రం చెప్పింది కదా! ఇక చంద్రబాబు నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా! ఎందుకు హైద్రాబాద్ లో దాక్కొని ప్రజలను రెచ్చగొడుతున్నారు?
***
“జస్టిస్ మహేశ్వరి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించడాన్ని తప్పుబడుతూ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. తన రాజకీయ ప్రయోజనాలకోసం దళితులు, బీసీలను ఉపయోగించుకోవడం ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్య. “
క్రియాశీలకంగా వ్యవహరించడం అంటే ఏమిటి? ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే గత ప్రధాన న్యాయమూర్తులు మృతకళేబరాల్లా నిర్జీవంగా వ్యవహరించారని అర్థమా? గత న్యాయమూర్తులను అవమానించడం కాదా ఈ ప్రేలాపనలు? న్యాయమూర్తులైనా, మరొకరైనా చట్టం, న్యాయం, రాజ్యాంగం ప్రకారం వ్యహరించాలి తప్ప సొంత క్రియతో, వ్యక్తిగత విచక్షణతో వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా? ఇక దళితులు, బీసీలను రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఒక పిచ్చి కూత కూస్తున్నాడు రాధాకృష్ణ. దళితులు, బీసీలు నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. దళితులను, బీసీలను ఎవరు రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటున్నారో నాటి మోత్కుపల్లి నరసింహులు నుంచి నిన్నటి ఓడిపోయిన రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య వరకు బాగా తెలుసు! ఎదుటివాడిపై చూపుడువేలు గురిపెడితే, మూడువేళ్ళు మనవైపే తిరిగి ఉంటాయని రాధాకృష్ణకు తెలియదేమో?
****
“ఈ సంభాషణ మొత్తం వెల్లడయిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి. “
హరేహరే…అసలా సంభాషణ వారి ప్రయివేట్ సంభాషణ. వ్యక్తిగత సంభాషణల్లో సవాలక్ష మాట్లాడుకుంటారు. దాన్ని రాధాకృష్ణ ఎలా రికార్డ్ చేయిస్తాడు? ఎలా బహిర్గతపరుస్తాడు? జస్టిస్ ఈశ్వరయ్య గనుక రాధాకృష్ణ మీద కేసు పెడితే రాధాకృష్ణ జైలుకు వెళ్తాడు. తెలుగుదేశం పార్టీని స్థాపించి మొదటి ప్రయత్నంలోనే అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్ గూర్చి “వాడు..వీడు” అంటూ రాధాకృష్ణ, చంద్రబాబు దుర్భాషలు ఆడిన టేపులు బయటపడినపుడు చంద్రబాబు రాజీనామా చేశారా? ఇక ఓటుకు నోటు వీడియోలో చంద్రబాబు స్వరం వినిపించినపుడు..ఆ స్వరం చంద్రబాబుదే అని ధృవీకరించబడినపుడు చంద్రబాబు రాజీనామా చేశారా? దాన్నిబట్టి ఓటుకునోటు మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లే అని స్పష్టం అయింది కదా??
****
“రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినాక అవినీతి కేసులలో చిక్కుకుంటారు. జగన్ రెడ్డి వ్యవహారం ఇందుకు భిన్నమైనది. ఏ ప్రభుత్వ పదవిలో లేకుండానే ఆయన అవినీతి కేసులలో జైలుకు కూడా వెళ్లివచ్చారు. కేసుల విచారణను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేసులుగానీ, వాటిని విచారించే న్యాయస్థానాలుగానీ తనను ఏమీ చేయలేవన్న ధీమా జగన్‌లో ఏర్పడి ఉండవచ్చు. అందుకే ఆయన న్యాయ వ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేయడానికి తెగించారని న్యాయ నిపుణులు చెబుతున్నారు”
ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేస్తే నిజం అని జనం నమ్ముతారనే గోబెల్స్ సిద్దాంతం మీద చంద్రబాబుకు, రాధాకృష్ణకు, రామోజీరావుకు, పచ్చ మీడియాకు చచ్చేంత విశ్వాసం. అందుకే ఏదొక ప్రస్తావనను తెచ్చయినా జగన్ జైలుకు వెళ్ళొచ్చాడు అంటూ ఒక బురద బిందువును చల్లుతారు! జగన్ అవినీతి కేసులలో జైలుకు వెళ్ళివచ్చారని క్షుద్ర ఎల్లో మీడియా ప్రతిరోజూ ప్రచారం చేస్తుంది. కానీ, జగన్ కేవలం రిమాండ్ ఖైదీగా నిర్బంధించబడ్డారు తప్ప ఆరోపణలు రుజువై కాదు అని లోకమంతా తెలుసు. జగన్ మీద పెట్టినవన్నీ అక్రమకేసులు అని జనం నమ్మారు కాబట్టే ఆయనకు దివ్యమైన మెజారిటీ కట్టబెట్టి, నిప్పు అని పచ్చమీడియా కీర్తించే చంద్రబాబును తరిమికొట్టారు అన్న సత్యం కూడా అందరికి తెలుసు. జగన్ దురదృష్టం ఏమిటంటే, వైసిపి నాయకులు ఎవ్వరూ ఈ పాయింట్ మీద రాధాకృష్ణ మీద దండెత్తరు! రాధాకృష్ణ తప్పుడు ప్రచారాలను ఖండించరు! అదే ఎవరైనా వైసిపి నాయకులు చంద్రబాబు మీద గోరంత విమర్శ చేస్తే తెలుగుదేశం అధికారప్రతినిధులు విరుచుకుని పడతారు. అది చంద్రబాబు అదృష్టం!
****
“రాజకీయ ప్రత్యర్థులపై దాడికి కూడా ఇదేవిధంగా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను జగన్ గతంలో ప్రయోగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గంపై దుష్ప్రచారం చేయడానికి పలువురిని వాడుకున్నారు”
రాజకీయ ప్రత్యర్థులపై దాడికి ఎవరినెలా ఉపయోగించుకోవాలో పాఠాలు చెప్పే యూనివర్సిటీకి చంద్రబాబు వైస్ ఛాన్సలర్ అని ఎన్నోసార్లు రుజువైంది. ఎదుటిపార్టీలోని ఏ కులం వారిని తిట్టడానికి తన పార్టీలోని ఆ కులస్తులను ఉసిగొల్పడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జనం అమాయకులు అని రాధాకృష్ణ వెఱ్ఱినమ్మకం మరి!
****
“అయితే, ఇందులో ఎవరి పాత్ర ఏమిటన్నది తేలాలంటే హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలి. న్యాయమూర్తులను లొంగదీసుకోవాలనుకున్న వారు శిక్షింపబడాలి. లేనిపక్షంలో నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయమూర్తులు భయపడే పరిస్థితి వస్తుంది. మిగతా వ్యవస్థలలో మాదిరిగానే న్యాయవ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. అలా అని న్యాయమూర్తులను బజారుకీడ్చే కార్యక్రమాలను అనుమతించకూడదు.”
అబ్బబ్బబ్బా…ఏమి నీతులు! ఏమి రీతులు! సిబిఐ విచారణ కావాలట! సిబిఐ మీద అంత నమ్మకమా? మరి చంద్రబాబు కాలంలో సిబిఐ ని నిషేధించినపుడు తన నీచపత్రికలో దాన్ని ఖండించాడా రాధాకృష్ణ? సిబిఐ మీద ఎక్కడలేని ఆరోపణలు చేస్తూ వ్యాసాలను ఎలా ప్రచురించాడు? ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో సిబిఐ మీద ఎక్కడలేని విశ్వాసం ప్రబలింది! నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే జగన్ ప్రభుత్వానికి డెబ్బై సార్లు కోర్టులు ఎందుకు ఎదురుదెబ్బలు తగులుతాయి? న్యాయమూర్తులకు ఏనాడైనా చంద్రబాబులా జగన్ కూడా పున్నమిఘాట్ విందులు ఇచ్చాడా? వారితో అర్ధరాత్రి రహస్య సమావేశాలు నిర్వహించాడా? అంటే ఆనాడు అలాంటి నికృష్టపు చేష్టలతో న్యాయమూర్తులను చంద్రబాబు ఆకట్టుకున్నాడని పరోక్షంగా చెప్పదలచుకున్నాడా రాధాకృష్ణ? తీర్పులు ఇవ్వడానికి తాము భయపడుతున్నామని న్యాయమూర్తులు ఎవరైనా రాధాకృష్ణతో మొరపెట్టుకున్నారా? న్యాయమూర్తులు భయపడుతున్నారని ప్రచారం చెయ్యడం అంటే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకాన్ని పోగొట్టే దుష్ట ప్రయత్నం కాదా? సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసినవారిని సైతం న్యాయస్థానం కేసులు పెట్టి విచారిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో న్యాయస్థానం పరువును బజారుకు ఈడ్చుతున్నది రాధాకృష్ణ కాదా?
***
ఇక మనం ఈ వ్యాసాన్ని భర్తృహరి సుభాషితంతోనే ముగిద్దాం
తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు
స్వస్తిహి!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు