పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు. దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్ళు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మండలి రహిత రాష్ట్రాల్లో చేరబోతున్నది.
శాసనమండలి అవసరం ఉన్నదా లేదా అనే చర్చ నాయకుల అవసరాలను బట్టి జరుగుతున్నది. ఒకప్పుడు మండలి అవసరం లేదని తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేడు మండలిని రద్దు చెయ్యరాదని పట్టుబడుతున్నది. అలాగే నిన్నటివరకు మండలి గూర్చి మాట్లాడని వైసిపి నేడు మండలి అవసరం లేదంటున్నది. తలచిందే తడవుగా మండలిని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది. ఇక దానిపై కేంద్రం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది రాష్ట్రం కేంద్రం మధ్యగల సంబంధాలను బట్టి ఉంటుంది. అంతకన్నా మోడీ, జగన్ ల మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాలి. మోడీ, జగన్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా తెలియదు. జగన్ కేసుల్లో సిబిఐ కోర్ట్ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే ఇద్దరిమధ్యా సత్సంబంధాలు లేవనేది పరిశీలకుల అభిప్రాయం. నిజం చెప్పాలంటే ఏడేళ్లుగా వారం వారం విచారిస్తున్నా, ఇంతవరకూ ఏమీ తేల్చలేని సిబిఐ కోర్టు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కనీసం మినహాయింపు గౌరవం ఇవ్వడానికి అంగీకరించడం లేదు అంటే మోడీ, జగన్ ల మధ్య సంబంధాలు అంత గట్టిగా లేవనేది నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. కనుక జగన్ పట్టును మోడీ తీర్చుతారా?
ఇక ప్రతిపక్షం తెలుగుదేశం తో కూడా బీజేపీకి సంబంధాలు లేవు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఎన్ని పాజిటివ్ సంకేతాలను పంపించినా, మోడీ పట్టించుకోవడం లేదు. తన పార్టీలోని ఆర్ధిక ఉగ్రవాదులైన రమేష్, సుజనా చౌదరిలను, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులను బీజేపీ లోకి పంపించి శరణు వేడినా కరుణించలేదు. మరి చంద్రబాబు కోరికను అనుసరించి మండలి రద్దును తిరస్కరిస్తారా?
అదలా ఉంచితే, శాసనమండలి రద్దును వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు కొందరు హర్షించలేకపోతున్నారని ఆ పార్టీలోని వారే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ రానివాళ్లు కొందరు బలమైన నాయకులు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారని, ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలైనాయని బాధపడుతున్నారట. ఎలాగూ రాబోయే ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు పదిహేను మంది సభ్యులు రిటైర్ అవుతారని, వారిస్థానాల్లో వైసిపి వారే ఎమ్మెల్సీలు అవుతారని, ఈ లోపలే తొందర పడ్డారని భావిస్తున్నారని గుసగుసలు వ్యాపిస్తున్నాయి. అయితే మండలిని రద్దు చెయ్యడం వలన పదవులను కోల్పోయిన తమవారికి తత్సమానమైన పదవులు, హోదాలు కల్పిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారని, తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా, మళ్ళీ ఏవో రకమైన పదవులు తమకు దక్కుతాయని వారికివారే సమాధానం చెప్పుకుంటున్నారు.
ఇక మండలి రద్దు అమలుకు సమయం ఎన్నాళ్ళు పడుతుందో కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, రాష్ట్రంలో వైసిపి బలంగా ఉండటం, ఇప్పటికే ఉన్న ఇద్దరు కాకా, మరో రెండు మూడు నెలల్లో వైసిపినుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు వెళ్లే అవకాశం ఉండటం, మరో రెండేళ్ల తరువాత రాజ్యసభలో వైసిపి బలం పది వరకు చేరుకునే ఛాన్స్ ఉండటంతో, రాజ్యసభలో మెజారిటీ లేని బీజేపీ జగన్ ప్రతిపాదనను అంగీకరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపటి పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు ప్రతిపాదన ఉభయసభల్లో ఆమోదించబడితే, అది జగన్ కు మరో మహోన్నతమైన విజయం అవుతుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు