విలవిలలాడిపోతున్న రాధాకృష్ణ! 

అబ్బో  అబ్బో…రోజురోజుకు రాధాకృష్ణ బాధ కేన్సర్ లా పెరిగిపోతున్నది.  జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ, అదేసమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ గల్లంతైపోతున్నారన్న బాధ, చంద్రబాబు పాలనలో చేసిన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న ఆవేదన అశ్రువుల రూపంలో జలజలా జలపాతంలా ప్రవహిస్తున్నాయి.  ఆ బాధను పంచుకునే ప్రయత్నంలో “జలరాజకీయం” పేరుతో జగన్ మీద దుమ్మెత్తిపోపోయడం, అదే సమయంలో కేసీఆర్ జగన్ల మధ్య పచ్చగడ్డి వేసి మంటలు రాజెయ్యడం, తద్వారా జగన్ ప్రభావాన్ని తగ్గించే కుటిలయత్నం …వెరసి బాధాకృష్ణ కక్కిన తక్షక విషాగ్నిని ఒకసారి పరిశీలిద్దాం. 
 
***
“1999 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజలలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికై తటస్థులు, మేధావులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. దీనివల్ల ప్రజలలో ఆయనపై సానుకూల అభిప్రాయం ఏర్పడింది… రాజధాని అమరావతి తమది అని ఇతర ప్రాంతాల ప్రజలు అనుకోకుండా చేయగలగడంలో జగన్‌ అండ్‌ కో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సైకాలజీని ఒడిసిపట్టుకున్న జగన్‌ అండ్‌ కో అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుని ప్రజల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచగలిగింది.”
 
తటస్తులను, మేధావులను చంద్రబాబు ఒకప్పుడు పార్టీలోకి ఆహ్వానించింది నిజమే.  కానీ, ఆ పిలుపు వెనుక పరమార్ధం ఏమిటి?  ఎన్టీఆర్ ను అక్రమంగా కూలదోసి సింహాసనాన్ని చెరబట్టిన దుష్కృత్యాన్ని గుర్తుంచుకుని ప్రజలు తనను ఓడిస్తారనే భయం అప్పట్లో చంద్రబాబులో మిక్కుటంగా ఉన్నది.  అందుకే తటస్తులు, మేధావులు అన్న ప్రయోగం చేశాడు.  ఒకసారి ఏదొక పార్టీలో చేరాక ఇక తటస్తుడు అనే పదానికి అర్ధం ఏముంది?  
 
రాజధాని తమది అని ప్రజలు అసలు ఏనాడు అనుకున్నారు?  చంద్రబాబు అమరావతిని రాజధాని అని ప్రకటించిన మరుక్షణమే అది చంద్రబాబు సామాజికవర్గం వారి రాజధాని అని రాష్ట్రం మొత్తం నిర్ణయించుకుంది.  శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తన సామాజికవర్గం వారు అధికంగా ఉన్న జిల్లాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పగానే మిగిలిన అన్ని జిల్లాల వారు అసంతృప్తులైపోయారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉందా? 
 
ఇవాళ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని జగన్ ప్రకటించగానే అక్కడ రైతుల పేరుతో  జరుగుతున్న కుహనా ఉద్యమాన్ని ప్రజలు గమనించడం లేదని రాధాకృష్ణ అభిప్రాయమా?  కనీసం పదిహేను లక్షలమంది జనాభా ఉన్న ఆ రెండు జిల్లాల్లో ఉద్యమ గుడారాల్లో వందమంది కూడా కనిపించడం లేదంటేనే అది ఎవరి రాజధానో తెలియడం లేదా?  నలభై ఏళ్ల అనుభవం ఉన్నదని స్వోత్కర్షలు చేసుకునే చంద్రబాబు జగన్ కన్నా ఎక్కువగా ఆలోచించి ప్రజల సైకాలజీని ఒడిసిపట్టి ఉండవచ్చు కదా!   ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదే కాబోలు! 
 
***
“మద్యం ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపిన జగన్‌ తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికి, ”మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికై ధరలు పెంచి మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తున్నాను” అని ఫుల్‌ పేజీ ప్రకటనలను జారీ చేశారు.  పొరుగున ఉన్న తెలంగాణలో తక్కువ ధరకు మెరుగైన బ్రాండ్ల మద్యం దొరుకుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోంది. ఆ విషయం అంగీకరించడానికి కూడా వారు సిద్ధపడరు. మద్యం ధరల మాదిరిగానే విద్యుత్‌ చార్జీల విషయంలో కూడా ఫుల్‌ పేజీ ప్రకటనలు జారీ చేస్తారేమో చూడాలి. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడానికి చార్జీలు పెంచామని చెబుతారేమో! రేపోమాపో ఆర్టీసీ చార్జీలను మరోమారు పెంచబోతున్నారు.”
 
మద్యపానాన్ని అరికట్టడం కోసం ధరలను పెంచి అందుబాటులో లేకుండా చేస్తామని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రకటించారు.  తదనుగుణంగా 75  శాతం ధరలను పెంచడంతో రెండోరోజున మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి అన్న వాస్తవం కనిపించింది.  అసలు మద్యం నుంచి వచ్చే ఆదాయమే వద్దు అనుకున్నప్పుడు ఇక ఆదాయం తగ్గిందని అంగీకరించడమేంటి బుర్రతక్కువ కాకపొతే! 
 
ఇక విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతారంటూ బెదిరిస్తున్న రాధాకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు గారు ఏలిన సమయంలో ఎన్నిసార్లు కరెంట్ చార్జీలు పెంచారో గుర్తుందా?  కరెంట్ చార్జీలు తగ్గించమని ఉద్యమం చేసిన రైతుల మీద తుపాకీ గుడ్లను ప్రయోగించిన విషయం అయినా గుర్తుందా?  బస్ చార్జీలు ఎన్నిసార్లు పెంచారు?  పోనీ…మొన్నటిదాకా ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన చంద్రబాబు ఒక్కసారి కూడా చార్జీలు పెంచలేదా?  
 
****
“కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించి రాజకీయ ప్రయోజనం పొందడం ఆ ప్రాంత నాయకులకు అలవాటుగా మారిపోయింది. కర్నూలులో హైకోర్టు కావాలని హడావుడి చేశారు. సరే అయితే హైకోర్టు పెడతామని, కర్నూలును జ్యుడీషియల్‌ రాజధానిగా చేస్తాననీ జగన్‌ ప్రకటించారు. ఆ ప్రకటనతో రాయలసీమ అంతా అభివృద్ధి చెందినట్టేనని ప్రజలు సంతృప్తి పడిపోయారు. అయితే హైకోర్టు వస్తే కర్నూలు ఎలా బాగుపడిపోతుందో తెలియదు. అయినా కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు..”
 
జగన్ రాజకీయ చతురతను, నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబును ఎలా చిత్తూ చేసి చెత్తబుట్టలోకి విసిరేశాడో చూసి రాధాకృష్ణ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు పాపం!  భావోద్వేగాలు రగిలించడం చంద్రబాబుకు ఎందుకు చేతకాలేదు?  చంద్రబాబు జన్మించిన రాయలసీమలో తెలుగుదేశం పార్టీని కేవలం మూడు స్థానాలకే ఎందుకు పరిమితం చేశారు?   హైకోర్టు కావాలని హడావిడి చెయ్యడం ఏమిటి అజ్ఞానం కాకపొతే?  ఎప్పుడో అరవై అయిదేళ్ల క్రితం చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలును రాజధాని చెయ్యాలి లేక హైకోర్టు పెట్టాలి.  కానీ, ఆ ఒప్పందాన్ని నీరుగార్చి అన్ని వ్యవస్థలను హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేసిన పాపం ఎవరిది?  ఇన్నాళ్లకు రాష్ట్రం విడిపోయాకైనా చంద్రబాబు అలనాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించే ప్రయత్నం ఏమైనా చేశారా?  రాజధాని, హైకోర్టు అన్నీ తన సామాజికవర్గం వారు డామినేట్ చేసే ప్రాంతంలోనే పెట్టారు.  దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు.  వారి ఆవేదనను గమనించిన జగన్ మూడు ప్రాంతాలకు న్యాయం చెయ్యాలనే సదుద్దేశ్యంతో హైకోర్టు ను కర్నూలుకు తరలించాలని నిశ్చయించారు.  దాన్ని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తూ రాయలసీమవాసుల భావోద్వేగాలతో ఆడుకుంటున్న దుర్మతులు ఎవరు?  
 
***
“అయితే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగైదేళ్లుగా సాగిన రాజకీయం వేరు. సరికొత్త పంథాలో సాగింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని అప్రతిష్ఠపాల్జేయడానికై జగన్‌ పకడ్బందీ వ్యూహరచన చేసుకున్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను గరిష్ఠంగా వాడుకున్నారు. అవాస్తవాల ప్రచార హోరులో నిజం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితిలోకి ప్రజలను నెట్టారు.”
 
అయ్యయ్యో ఆచార్యదేవా! ఎంతమాట!  హేంతమాట!!!  చంద్రబాబు జగన్ కు రాజకీయ ప్రత్యర్థి.  మరి ఆయన్ను టార్గెట్ చేసుకోక నిన్నూ నన్నూ టార్గెట్ చేసుకుంటారా?  తనకన్నా పాతికేళ్ళు చిన్నవాడైన జగన్ ను టార్గెట్ చేసుకుని వ్యక్తిత్వహననానికి పాల్పడలేదా చంద్రబాబు?  ఆయన మీద కేసులు పెట్టించి, బెయిల్ రాకుండా చేసి, లక్షకోట్లు కాజేశాడంటూ పచ్చమీడియాతో  భూ నభోంతరాళాలు చిల్లులు పడేట్లు రచ్చ రచ్చ చేసి, జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి జగన్ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలని విశ్వప్రయత్నం చేసింది ఎవరు?  అయినా…ఐటీకి ఆద్యుడినని కోతలు కోసుకునే చంద్రబాబుకు సోషల్ మీడియాను వాడుకోవడం చేతకాలేదా! హవ్వ…నవ్విపోదురు గాక!
 
***
ఈ క్రమంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విశ్వసనీయత కలిగివున్న కొంతమందిని చేరదీసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించారు. ఈ జాబితాలో జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, అజయ్‌ కల్లం, లక్ష్మణరెడ్డి వంటివారు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వారందరికీ ప్రభుత్వ పదవులు కట్టబెట్టారు. రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్‌ కో అంతులేని అవినీతికి పాల్పడ్డారని రాష్ట్రమంతా పర్యటించి ప్రచారం చేసి.. పుస్తకాలు రాసిన అజయ్‌ కల్లం ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉన్నారు.
 
హమ్మయ్య….సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విశ్వసనీయత కలిగిఉన్న వారిని జగన్ చేరదీశారని రాధాకృష్ణ అంగీకరించినందుకు సంతోషం.  చంద్రబాబును లీగల్ కేసుల నుంచి రక్షించే కనకమేడల, స్టాక్ బ్రోకర్ కుటుంబరావు,  ఇక అనునిత్యం చంద్రబాబు భజనలు చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసిన తన లాంటి విశ్వసనీయత లేనివారిని చంద్రబాబు చేరదీసి కొంపముంచుకున్నాడని రాధాకృష్ణ గారి అభిప్రాయం కావొచ్చు.  భళా!  
 
*** 
ఇక కేసీఆర్ కు, జగన్ కు మధ్య తగాదాలు పెట్టాలని కూడా కొన్ని విషపు చుక్కలు విసిరాడు రాధాకృష్ణ.  వారిద్దరూ విజ్ఞత కలిగినవారు.  చంద్రబాబు హయాంలో పరిష్కారం కాని అనేక విభజన సమస్యలను వారిద్దరూ ఒకటి రెండు సమావేశాల్లో కూర్చుని క్షణాల్లో పరిష్కరించుకున్నారు.  కనుక జలగండాలు, నీటి సమస్యలు వారికి ఒక లెక్క కాదు.  అంతగా సామరస్యం కుదరదా! 
 
ఓకే…తన్నుకుంటారు…కొట్టుకుంటారు…కోర్టులకు వెళ్తారు.  వారిద్దరికీ వారి వారి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.  దానికి రాధాకృష్ణ సంతోషించాల్సిన అవసరం, ప్రజలను రెచ్చగొట్టాల్సిన అగత్యం లేనేలేదు!  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు