సర్పాలు నెలకోసారి కుబుసం విడిచి మత్తు వదుల్చుకుంటాయట! అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ కూడా వారానికోసారి “కొత్త పలుకు” పేరుతో వారం రోజులపాటు కడుపులో దాచుకున్న కాలకూటవిషాన్ని కక్కేసి ఫ్రెష్ అప్ అవుతుంటాడు. తాను కక్కిన గరళాన్ని తన పాఠకులు సరళంగా తీసుకుని మెదడులో భద్రపరచుకుంటారని దురాశకు లోనవుతుంటారు. ఆ క్రమంలోనే ఈరోజు కూడా తన చెత్తను పాఠకులమీద కుమ్మరించాడు.
యధావిధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన తనయుడు జగన్ కు పోలికలు తెచ్చాడు. పనిలోపనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలికి కూడా ముడిపెట్టాడు. వైఎస్ ప్రతిరోజూ స్వయంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించేవారట. ఆ రకంగా జగన్, కేసీఆర్ చేయకపోగా అసలు ప్రజలతో మాట్లాడరట….
ఒకప్పుడు మనం దూరప్రాంతంలో ఉన్న మనవాళ్లతో మాట్లాడాలంటే ఎక్కడో ఉన్న టెలిఫోన్ బూత్ కు వెళ్లి క్యూలో నిలబడి మనవంతు వచ్చేవరకు ఎదురుచూస్తూ కూర్చునేవాళ్ళం. మరి నేటి పరిస్థితి ఎలా ఉన్నది? బాత్ రూమ్ లో కూర్చుని ప్రపంచంలో ఉన్న మనవాళ్లందరితోనూ క్షణాల్లో మాట్లాడుతున్నాము. పెరుగుతున్న సాంకేతికత మనిషి శ్రమను తగ్గిస్తున్నది. సామాన్య ప్రజలు ఎవరైనా తమకు పౌరసేవలు, సంక్షేమ పధకాలు క్రమం తప్పకుండా అందుతున్నాయా లేదా అని చూస్తారు తప్ప ప్రతిరోజూ మంత్రులను, ముఖ్యమంత్రులను కలవాలని కోరుకోరు. కేసీఆర్ ప్రజలు ఎవ్వరితో మాట్లాడకపోయినా, రెండోసారి ఆయన మొదటిసారి కన్నా అఖండమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ఎలాంటి సంక్షేమ పధకాన్ని ప్రకటించినా, ఇరవైనాలుగు గంటలు గడవకముందే సదరు పధకం లబ్ధిదారులకు చేరుతున్నది. రాధాకృష్ణ యజమాని చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినపుడు ప్రతిరోజూ ప్రజలను కలిసారా? పైగా ఎవరైనా సమస్యలతో తనవద్దకు వచ్చినపుడు “తోకలు కోస్తా…కత్తిరిస్తా…అసలు మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రానిచ్చారు?” అని హుంకరించేవారు. రాధాకృష్ణ మర్చిపోయినా, జనం మర్చిపోరు.
“ఆంధ్రప్రదేశ్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఇతర వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టినా జగన్మోహన్ రెడ్డిలో చలనం ఉండదు. రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రావడం లేదు” అంటూ ఏడుస్తున్నాడు రాధాకృష్ణ. ఆ ఆందోళన ఎలాంటిదో ఎవరికి తెలియదు? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంతమంది తమ స్థలాల ధరలు కుంగిపోవడంతో “పెయిడ్ ఆర్టిస్టులతో” చేస్తున్న కృత్రిమ విన్యాసాలు తప్ప అవి ఆందోళనలా? ఇరవైతొమ్మిది గ్రామాలలోని అయిదు లక్షల జనాభాలో కేవలం రెండు గ్రామాల్లో గుడారాలు వేసుకుని దానిలో ఓ యాభై మంది కూర్చుంటే అవి ఆందోళనలు అవుతాయా బాధాకృష్ణా?
ఇక ఎప్పటిలాగే రాజధాని మార్పు కేవలం చంద్రబాబు మీద, ఒక సామాజికవర్గం మీద కోపంతోనే అంటూ మరో బుస కొట్టాడు రాధాకృష్ణ. మరి ఆనాడు చంద్రబాబు చేసింది ఏమిటి? నూజివీడులో రాజధాని అని ఒకసారి, గుంటూరులో అని ఒకసారి రకరకాలుగా లీకులు ఇచ్చి, తన బినామీలను మాత్రం అమరావతిలో వందలాది ఎకరాలను కొనేట్లు చేసి, వారు కొన్న తరువాత అమరావతిని రాజధాని అని ప్రకటించలేదా? రాజధాని నిర్మాణానికి దొనకొండ అనువైన ప్రాంతం అని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చిన తరువాత కూడా దాన్ని చెత్తబుట్టలో పడేసి, తన భృత్యుడు నారాయణతో ఒక కమిటీని వేసి అమరావతిని నిర్ణయించలేదా? ఇది ముందుగా అనుకున్నది కాదా? మొత్తానికి రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలకోసం కాకుండా తన కులానికి అన్యాయం జరిగింది అని గుండెలు బాదుకోవడం పాత్రికేయ వృత్తిలో ఉన్నవారికి తగునా? అది వ్యభిచారం కన్నా హీనం కాదా?
Also Read – కాపు కులం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుందా?
ఇక అమరావతి మార్పు తెలంగాణకు వరప్రసాదంగా మారిందని, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తరుగుతుండగా, హైదరాబాలో పెరుగుతున్నదని మరో బాధ పాపం! అమరావతి, ఆంధ్రాలతో సంబంధం లేకుండా గత నలభై ఏళ్లుగా హైద్రాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూనే ఉన్నది. నోట్లరద్దు నేపథ్యంలో దేశం మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించినా, హైద్రాబాద్ లో బాగానే ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయినా, అమరావతి ప్రాంతంలో ధరలు తగ్గాయేమో కానీ, కర్నూల్, విశాఖ ప్రాంతాల్లో పెరగలేదా? అంటే అమరావతిని రాజధాని చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా?
ఇక రాజధాని మార్పు అనేది కేసీఆర్ ఇచ్చిన సలహా అని మరొక చెత్త ఆరోపణ! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంటె కేసీయార్ కు నష్టమా? విశాఖలో పెడితే ఆయనకు లాభమా? ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కేసీఆర్ కు ఆంధ్రాలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆంధ్రాలో ఎక్కడైనా కేసీఆర్ ఓ వంద గజాల స్థలం కొన్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అమరావతి రాజధాని అనగానే, ఆ కార్యక్రమానికి వెళ్లి కేసీఆర్ ఆశీస్సులు అందించలేదా? అవసరమైతే సాయం చేస్తామని ప్రకటించలేదా? రాధాకృష్ణ ఏడుస్తున్నట్లు అమరావతి మహానగరం కావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుంది? అది జరిగే పనేనా? విశాఖపట్నం ఇప్పటికే మహానగరం కాదా? రాజధాని ఏర్పాటుతో హైద్రాబాద్ ను మించిపోయే మహానగరంగా విశాఖ పరిణమించదా?
“రోజూ చచ్చేవాడి కోసం ఏడుపు ఎందుకు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే జీవచ్ఛవం అయ్యింది. ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రానికి పెట్టుబడులు రావుగాక రావు! మూడు రాజధానుల విషయం అలా ఉంచితే ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి చేయడానికి అవకాశమున్న అమరావతిపై ముఖ్యమంత్రికి మొహం మొత్తింది. చేసేది ఏముంది – అనుభవించడమే!“…
ఇవీ పరమనీచ నికృష్ట కులగజ్జి దుర్మదాంధుడు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడుతున్న శాపనార్ధాలు! ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవం అయిందట! చంద్రబాబు పాలనలో ఏవో లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్రం వెలిగిపోయినట్లు…ఇక జగన్ పాలనలో పెట్టుబడులు రావంటే రావని పిల్లిశాపాలు పెట్టడానికి తెగించాడు. మూడు రాజధానుల్లో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు అని తన మనసులోని మాటను కక్కేస్తున్నాడు. జగన్ ను ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తూ అనుభవించండి అంటూ శోకాలు పెడుతున్నాడు!
Also Read – మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరికొంప కూల్చబోతోంది?
అలాగే జనసేన – భాజపా పొత్తు మీద కూడా కొంత విషం కక్కాడు రాధాకృష్ణ. తెలుగుదేశం తో పొత్తు లేకుండా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసిపి నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని మొత్తుకుంటున్నాడు.
“అయినా పరపతి, విశ్వసనీయత కోల్పోయిన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎవరితో కలిసినా, విడిపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ పరిస్థితులలో ప్రజలే తమ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికై ఉద్యుక్తులు కావడం ఒక్కటే మార్గం. రాజకీయ ప్రత్యర్థులను లం..కొడుకు, దొంగముండా కొడుకు అని బహిరంగంగా తిట్టగలుగుతున్న నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు గర్వపడండి అప్పటిదాకా!” అంటూ మరో విషగుళికను ప్రజల మీద ప్రయోగించాడు రాధాకృష్ణ. రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టమని ఎవరూ చెప్పరు కానీ, రాజకీయాల్లో బూతులకు, దౌర్జన్యాలకు, హత్యారాజకీయాలకు మారుపేరైన తెలుగుదేశాన్ని వదిలి వైసిపి ఎమ్మెల్యేకు నీతులు చెప్పడమే ఆశ్చర్యం. తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని అధికారమదంతో సాక్షాత్తూ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టుబట్టుకుని ఈడ్చుకెళ్ళిన హృదయవిదారకమైన దృశ్యం రాధాకృష్ణ మరచిపోయినత తేలికగా జనం మరచిపోరుగదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు