తొలి ఏడాదిలోనే టాప్ పొజిషన్ కు చేరుకున్న జగన్ 

YS Jagan
“నాకు ఏడాది సమయం ఇస్తే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను” అని ప్రమాణస్వీకారం సందర్భంగా తనను నమ్మి అధికారం అప్పగించిన ప్రజలకు మనవి చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.  ఏడాది ముగిసేలోపే ప్రజలతోనే కాదు., జాతీయస్థాయిలో కూడా మొదటి అయిదుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల స్థానంలో నిలిచి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.  ఇది ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా, రాష్ట్రానికి కూడా ఒక ప్రతిష్టాత్మక విజయంగా భావించాలి.  
 
జగన్మోహన్ రెడ్డికి పైన ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ రాజకీయాల్లో, పాలనలో చాలా తక్కువ అనుభవం కలిగినవాడు.  ముఖ్యంగా నవీన్ పట్నాయక్ వారసత్వంగా తండ్రి స్థానాన్ని స్వీకరించి తనదైన సత్పరిపాలనతో ప్రజాదరణకు పాత్రుడు అయ్యాడు.  ఇక కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ కూడా నలభై ఏళ్లకు పైగా రాజకీయానుభవం కలిగిన సీనియర్ నేత.  అలాంటి నాయకుల సరసన జగన్ స్థానం సంపాదించారంటే అది గొప్ప విషయమే.  
 
జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా అధికారం చేపట్టిన వెంటనే అధికారమత్తులో మునగకుండా నవరత్నాల అమలుకు నడుం కట్టారు.  ఒక్కొక్కటిగా హామీలను నెరవేర్చుకుంటూ కోట్లాదిమంది ప్రజలకు లబ్ది కలిగించారు.  ముఖ్యంగా గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లారు.  అయిదారు వందల రకాల సేవలను క్షణాల్లో ప్రజలకు అందేట్లు చేయగలిగారు.  వాలంటీర్ వ్యవ్యస్థ ద్వారా సంక్షేమ పథకాలలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  జగన్ కు ప్రజల గుండెల్లో స్థానం కల్పించడం ఈ వ్యవస్థకు సాధ్యం అయింది అని చెప్పుకోవచ్చు.  
 
అయితే ఎన్ని మంచిపనులు చేసినా, కొన్ని అడ్డంకులు జగన్ కు ఎదురు అవుతున్నాయి.  ముఖ్యంగా న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.  వాటిని గతంలో వివరంగా చర్చించుకున్నాము.  పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు పక్కన పెడితే రాజకీయంగా జగన్ ఆదినుంచి ఒంటరిగానే మిగిలిపోయారు.  ఏదైనా సంక్లిష్టస్థితి ఎదురైనపుడు జగన్ కు అండగా నిలబడే ఒక్క రాజకీయపక్షమూ లేదు.  సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, అధికారపక్షానికి ఒకటో రెండో మిత్రపక్షాలు ఉంటాయి.  ఇబ్బందులు ఎదురైనపుడు ఆ మిత్రపక్షాలు అధికారపక్షానికి ఆసరాగా నిలుస్తాయి.  కానీ, ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేతిలో ఉన్నప్పటికీ, వైసిపి ఒంటరిగానే మిగలడం ఆశ్చర్యం.  తెలుగుదేశం అంటే సరే…అది ప్రధాన ప్రత్యర్థి.  మిగిలిన పార్టీలు బీజేపీ, జనసేన, ఉభయ కమ్యూనిస్టులు, జనసేన,, లోక్ సత్తా పార్టీలు అన్నీ కట్టగట్టుకుని జగన్ మీద కత్తులు నూరుతున్నాయి. 
 
ప్రస్తుతానికి ఇది బాగుండవచ్చు కానీ, సుదీర్ఘకాలంలో రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెడతాయి.  ముఖ్యముగా బీజేపీ, వైసిపి లు శత్రువులుగా ఉండాల్సిన అవసరమే లేదు.  బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు రావనేది ఒక భయం.  ఇదే బీజేపీ దేశం మొత్తం పరిపాలిస్తున్నది.  బీజేపీలో ముస్లిమ్స్ అనేకమంది ఉన్నారు. బీజేపీతో డజను పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.  వాటిలో కొన్ని పక్షాలు వారి వారి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.  అంతెందుకు, 2014 లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించలేదా?  బీజేపీతో పొత్తు తెంచుకున్నంతమాత్రాన 2019 లో తెలుగుదేశం గెలవగలిగిందా?  పార్టీ పట్ల, నాయకుడి పట్ల విశ్వాసం కలిగినవారు ఏ వర్గం వారైనా ఓటు వేస్తారు.  రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందనేది నిస్సందేహం.  రాష్ట్ర ప్రయోజనాలకోసం బీజేపీతో వైసిపి పొత్తు లేకపోయినా కనీసం అవగాహన కలిగి ఉండాలి.  కేంద్రంలో అధికారంతో ఉన్న పార్టీతో పొత్తు ఉంటే రాష్ట్రానికి, పార్టీకి కూడా మేలుచేస్తుంది.
 
ఇక తెలుగుదేశం పార్టీకి చెందినవారిని ఆకర్షించడానికి వైసిపి ఎందుకు ఉబలాటపడుతున్నదో అర్ధం కాని విషయం.    జగన్ ముఖం చూసి ప్రజలు 151  సీట్లు ఇచ్చారు.  అంత మెజారిటీ భవిష్యత్తులో మళ్ళీ వైసిపికి కూడా వస్తుందో రాదో తెలియదు.  జనం ఛీ కొట్టిన తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నించడం నైతికంగా ఏమాత్రం సమర్ధనీయం కాదు.  గతంలో తెలుగుదేశం ఇలాంటి అనైతిక కార్యానికి పాల్పడిందని విమర్శలు చేసిన వైసిపి మళ్ళీ అదే పనిని తాను ఎలా చేస్తుంది?  చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇచ్చారు.  ఆ హోదా లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చెయ్యడం ప్రజల తీర్పుకు విరుద్ధం కాదా?  ఒక పార్టీని లేకుండా చెయ్యాల్సింది ప్రజలే తప్ప అధికారంలో ఉన్న పార్టీ కాదు.   ఇలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టను పలుచబరుస్తాయి.   ఆ వచ్చేవారు స్వార్ధంతో వస్తారు తప్ప జగన్ మీద ఆపేక్షతో కాదు.  వారికి బదులుగా జగన్నే నమ్ముకున్నవారికోసం ఏదైనా మేలు చేకూర్చడం మంచిది.  
 
జగన్ ఎన్ని మంచిపనులు చేస్తున్నా, ఆయన మీద దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు.  పార్టీలు, నాయకులు, మీడియా మొత్తం కట్టగట్టుకుని రోజుకో ఆరోపణతో జగన్ పరువు తీయాలని శతధా ప్రయత్నిస్తున్నారు.  జగన్ కు నష్టం కలుగుతుంది అనుకునే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.  డాక్టర్ సుధాకర్ వ్యవహారం కావచ్చు, రంగనాయకమ్మ వ్యవహారం కావచ్చు, కోర్టు తీర్పులు కావచ్చు, రాజధాని మార్పు, ఎల్జీ పాలిమర్స్..ఇసుక విధానం…ఇలా ఏ అంశాన్ని ముట్టుకున్నా జగన్ కు వ్యతిరేకంగా ఇరవైనాలుగు గంటలూ విషప్రచారం జరుగుతున్నది.  అంతే కాకుండా, నిన్న జగన్ ఢిల్లీ పర్యటన విషయంలో కూడా అనేక వ్యతిరేక వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి.  జగన్ కు అపాయింట్మెంట్ రద్దు చెయ్యడం వెనుక రాష్ట్ర బీజేపీ నాయకుల హస్తం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.  దానిలో వాస్తవం ఎంతున్నదో తెలియదు కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చి చివరి నిముషంలో రద్దు చేయడం మాత్రం ముఖ్యమంత్రికే కాదు…రాష్ట్ర ప్రజలకు కూడా అవమానకరమే. 
 
ముఖ్యమంత్రితో అరగంట సేపు మాట్లాడినంతమాత్రాన అమిత్ షా తుఫాను సహాయకచర్యలను పర్యవేక్షించడంలో అడ్డంకులేమీ రావు.  ఇది మొదటిసారి కాదు…గతంలో రెండు మూడుసార్లు మోడీ, అమిత్ షా లు జగన్ పట్ల ఇదేవిధంగా వ్యవహరించారు.  కేంద్రంతో లాబీయింగ్ చెయ్యడంలో వైసిపి ఎంత బలహీనంగా ఉన్నదో ఈ ఉదంతం రుజువు చేస్తుంది.  ఇలాంటి లోపాలను  జగన్  నివారించగలగాలి.  రాష్ట్రం ఆరేళ్లక్రితమే విభజించబడ్డది.  రెవిన్యూ లోటు ఉన్నది.  ఖజానా ఖాళీగా ఉన్నది.  విభజన హామీలు ఒక్కటీ నెరవేరలేదు.  పెద్ద స్థాయిలో పరిశ్రమలు  లేవు.  రాజధాని లేదు.  పోలవరం ఎన్నాళ్లకు పూర్తవుతుందో తెలియదు.  గత ఏడాదిలో ఒక్క పరిశ్రమకు కూడా శంకుస్థాపన జరగలేదు.  దానికి తోడు క్షణక్షణం జగన్ మీద కత్తులు నూరే విపక్షాలు….  చిత్తశుద్ధితో అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తే కనీసం ఇరవై ఏళ్ళు పడుతుంది.  ఇందుకు కేంద్ర సహకారం తప్పనిసరి.
 
మొదటి ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆడుతూ పడుతూ గడిచిపోయింది.  ఇకపై అభివృద్ధి గూర్చి ప్రశ్నలు ఎదురవుతాయి.  ప్రతి చిన్నవిషయానికి కేంద్రం ఆమోదం, కేంద్రంలోని పలు మంత్రిత్వశాఖల ఆమోదాలు, అనుమతులు అవసరం అయ్యే పాలనా వ్యవహారాల్లో కేంద్రం తో సత్సంబంధాలు ఆవశ్యం.  జగన్ కు ఈ విషయం తెలియదు అని కాదు కానీ, వాటిని ఆయన ఆచరణలో పెట్టాలని ఆశిస్తున్నాను.  అభివృద్ధిపథంలో రాష్ట్రాన్ని నడిపించే సత్తా జగన్ కు ఉన్నదనే సంపూర్ణ విశ్వాసం ప్రజలకు ఉన్నదనే విషయంలో సందేహం అవసరం లేదు.  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు