చెరపకురా చెడేవు

Chandra Babu Naidu
 
విశాఖపట్నం విమానాశ్రయంలో తనకు ఎదురైనా ఘోరావమానాన్ని తలచుకుంటూ చంద్రబాబు తన జీవితంలోనే చేసిన ఒకే ఒక పెద్ద తప్పుకు బహుశా నేడు చింతిస్తుంటారేమో?  తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అయిదేళ్లపాటు నవ్యఆంధ్ర ముఖ్యమంత్రిగా, పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్షనేతగా, 1996 నుంచి 2004  వరకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన  నేతగా,  ఇంకా అనేకానేక బిరుదులు, విశేషణాలతో కైవారాలు చేయించుకున్న నాయకుడిగా, ప్రాంతీయ, జాతీయ మీడియాకు ముద్దుబిడ్డగా ముద్రపడిన  ప్రముఖుడిగా యశస్సునొందిన చంద్రబాబు ఒక్కసారిగా పాతాళానికి జారిపోవడం చూపరులను దిగ్భ్రమకు గురిచేసేదే.   ఒకసారి చరిత్రను క్లుప్తంగా పరిశీలిద్దాము.  
 
   2004 నుంచి 2014  వరకూ…పదేళ్ళపాటు చంద్రబాబు  అధికారానికి దూరంగా ఉన్నారు.  ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపించలేదు.  వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు రెండుసార్లు అధికారం అందని మానిపండయింది.  తెలుగుదేశం భూస్థాపితం తథ్యం అనుకున్నారు.  కానీ, ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కావడంతో చంద్రబాబు అదృష్టం తిరగబెట్టింది.  తొమ్మిదేళ్ల అనుభవం పేరుతో ప్రజలను మభ్యపెట్టారు.  భాజపా తో పొత్తు, మోడీ క్లీన్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ పరోక్షమద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు.  వైసిపికి, తెలుగుదేశం కు ఓట్లశాతంలో తేడా ఒకటిన్నర శాతమే అయినప్పటికీ, రెండు పార్టీల మధ్యా దాదాపు ముప్ఫయి అయిదు సీట్ల తేడా వచ్చింది.  
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనకు లభించిన అపూర్వమైన అవకాశాన్ని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకుని రావడం, ఉద్యోగకల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం, కేంద్రంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని ప్రత్యేకహోదా సాధించడం, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలయ్యేలా చూడటం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యడం, పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కు ఉన్నది కాబట్టి తెలంగాణతో సత్సంబంధాలను కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలమధ్య హృత్పూర్వక సంబంధాలను నిలబెట్టడం, సంక్షేమపథకాల ద్వారా పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించే పనులు చెయ్యడం మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చెయ్యడం, తెలంగాణాలో ఓటుకు నోటు ఇస్తూ ఎసిబి వారి వీడియోలకు దొరికిపోయి దాదాపు రాష్ట్ర బహిష్కరణ అనదగ్గ శిక్షకు గురై  రాత్రికి రాత్రే అమరావతికి వెళ్లాల్సి రావడం లాంటి విపరీతాలకు పాల్పడ్డారు.  పోలవరంలో విపరీతమైన అవినీతి, రాజధాని నిర్మాణంలో గ్రాఫిక్స్ తో నాలుగేళ్లు జాప్యానికి చోటు ఇవ్వడం, భూకబ్జాలు, కాల్మనీ సెక్స్ రాకెట్లు, మహిళా అధికారులను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లడం, ఐపీఎస్ అధికారుల కాలర్ పట్టుకుని బెదిరించడం లాంటి రాక్షస కృత్యాలకు అవకాశం ఇవ్వడం ద్వారా చంద్రబాబు ప్రజలు తన నొసట లిఖించిన   అదృష్టరేఖను పూర్తిగా చెరిపేసుకున్నారు.     కనీసం తాను పోటీ చేసిన నియోజకవర్గం పేరునైనా ఉచ్చరించలేని కొడుకును భావి ముఖ్యమంత్రిని చెయ్యాలనే దురాశతో ప్రజలతో ఎన్నుకోబడకపోయినా, ఏకంగా మూడు మంత్రిత్వశాఖలు కట్టబెట్టి ప్రజలతో ఛీ కొట్టించుకున్నారు.  “డర్టీఎస్ట్ పొలిటీషియన్ అని ఒకప్పటి తన శిష్యుడు, నేటి తెలంగాణ ముఖ్యమంత్రితో అసహ్యించుకోబడ్డారు.     
 
మరొక అతిముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్య భారతంలో అనే అంశాన్ని విస్మరించి తన అధికారం శాశ్వతం అని భ్రమించారు.  అక్రమార్జన కేసుల్లో అక్రమ కేసులను ఒంటరి అభిమన్యుడిలా సాహసంతో ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి రెండు మూడేళ్ళలో జైలుకు వెళ్లక తప్పదని గుడ్డిగా విశ్వసించారు.  వివిధ వ్యవస్థలను మేనేజ్ చెయ్యడంలో తనకున్న అనుభవాన్ని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయగలనని, వైసిపి చెల్లాచెదురు అవుతుందని, ఆ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ తన శరణు కోరక తప్పదనే రంగుల కలల్లో తేలియాడారు.   తన తరువాత తన కొడుకుని వారసుడిగా చేసి సింహాసనాన్ని అప్పగించాలని, తాను జాతీయ రాజకీయాల్లో మళ్ళీ చక్రాలు తిప్పెయ్యాలని ఊహాగానాలు చేసుకున్నారు.  జగన్ కు భవిష్యత్తు లేకుండా చేయగలనని విర్రవీగి, అయిదేళ్ల అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేశారు.  దానికి తోడు ఎల్లో మీడియా చేస్తున్న భజనలు వాస్తవం అనుకుని మురిసిపోయారు.  తనపట్ల వ్యతిరేకత  చాపకింది నీరులా వేగంగా పాకిపోతున్నా గ్రహించడానికి నిరాకరించారు.  “పోగాలము దాపురించినవాడు మిత్రవాక్యమును, అరుంధతిని , ధూపనిర్వాణ గంధమును వినడు కనడు మూర్కొనడు” అన్న పెద్దల వాక్యాన్ని వాస్తవం చేశారు.  జగన్ జీవితాన్ని నాశనం చెయ్యాలనే కుత్సితపు ఆలోచనలు లేకుండా రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టినట్లయితే ఈరోజు చంద్రబాబు జీవితం మరొకవిధంగా ఉండేది.    తనకు రెండు కళ్ళు పోయినా సరే, ఎదుటివాడికి ఒక కన్ను పోవాలి అనే దుర్మార్గపు ఆలోచనలు చెయ్యడమే చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు.  తన తప్పును చంద్రబాబు గ్రహిస్తారా లేదా అనేది ఆయన విజ్ఞత మీద ఆధారపడి ఉంది.  గ్రహించినా ప్రయోజనం లేకపోవచ్చు.  ఎందుకంటే, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం వృధాప్రయాస అని పెద్దలు ఏనాడో చెప్పారు కదా!   
 
మనం రోడ్డు మీద వెళ్తుండగా ఏదైనా ప్రమాదానికి గురైనపుడు మన మనసు ఒకసారి జరిగిన సంఘటనను రివైండ్ చేసుకుంటుంది.    “అయ్యో…మనం అంత స్పీడ్ గా వెళ్లకుండా ఉండాల్సింది….మనం కొంచెం లెఫ్ట్ నుంచి వెళ్ళాల్సింది….ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యకుండా ఉండాల్సింది…”  అని మన మనసు మనకు బోధిస్తుంది.   అలాగే చంద్రబాబు కూడా “అయ్యో…ఆనాడు నేను అలా చెయ్యకుండా ఉండాల్సింది…”  అనుకుంటూ తాను చేసిన వందల తప్పిదాలను తలచుకుంటూ భోరున ఏడుస్తుంటాడు! 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు