కేంద్రం ప్రకటన తర్వాత రాజధాని తరలింపు ఆగుతుందా ?

 
మొన్నీమధ్యనే ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు అమరావతి ప్రాంతంలో పర్యటించి వచ్చి నాకు ఫోన్ చేశాడు.  “ఎలా ఉన్నది అక్కడ రైతుల ఉద్యమం?  టీవీల్లో చూస్తుంటే అక్కడ మహోద్యమం జరుగుతున్నట్లు అనిపిస్తున్నది..”  అడిగాను.  అతను నవ్వుతూ “నేను మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలూ తిరిగాను.  కేవలం మూడు గ్రామాల్లో సెంటర్లో ఓ వందమంది కుర్రాళ్లు, వృద్ధులు షామియానాలు వేసుకుని కూర్చుని ఎల్లో మీడియా వాళ్ళు రాగానే జై అమరావతి అని అరుస్తున్నారు.  మిగిలిన అన్ని గ్రామాల్లో ఎలాంటి అలజడి లేదు.  ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులతో ఆడిస్తున్న డ్రామా” అన్నాడు.  
 
రాజధాని కోసం మొత్తం పాతికవేలమంది రైతులు ముప్ఫయి మూడువేల ఎకరాలను ఇచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  మరి కనీసం పదివేలమంది రైతులైనా ధర్నాల్లో కనిపించాలి కదా?  ఏరీ?  పైగా తమ జిల్లాలనుంచి రాజధాని వెళ్ళిపోతుంది అని బాధ ఉన్నపుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగాలి కదా?  కేవలం మూడు గ్రామాలకే పరిమితం కావడం అంటే అర్ధం ఏమిటి?  
 
ఇదిలా ఉండగా రాజధాని భూ కొనుగోళ్ల వ్యవహారాల్లో లెక్కలేనంత అవినీతి జరిగిందని, తెల్ల రేషన్ కార్డులు కలిగిన ఏడు వందల తొంభై ఏడుమంది రైతుల నుంచి భూములు కొన్నారని సిఐడి తేల్చింది.  దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టింది.  ఆ విషయం అలా ఉంచితే అమరావతిలో కొందరు సుప్రీమ్ కోర్ట్ జడ్జీలు, ఏజీలు, పత్రికాధిపతులు కూడా భూములు కొనుగోలు చేసారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరొక బాంబు పేల్చారు.  దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాజధాని అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా చరిత్ర సృష్టించిందని నమ్మవచ్చు.  తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నారని తేటతెల్లమవుతుంది.  
 
ఏడాదికి యాభైవేల రూపాయల కౌలు, దానికి ప్రతిఏటా పదిశాతం పెంచుకుంటూ పోవడం,  వెయ్యిగజాల నివాస స్థలం, నాలుగువందల యాభై గజాల కమర్షియల్ స్థలాన్ని పొందుతూ రాజధాని కోసం త్యాగం చేశామని రైతులు చెప్పుకోవడం సిగ్గుచేటు.  ఏడాదికి మూడు పంటలు పండే ముప్ఫయి మూడు వేల ఎకరాల పచ్చని పొలాలను తన కుంభకోణానికి బలిచేసిన చంద్రబాబు ముమ్మాటికీ శిక్షార్హుడు.   అంతే కాదు…చంద్రబాబు దుర్మార్గం కారణంగా నూట ముప్ఫయి రకాల పంటలు విధ్వంసం  అయ్యాయి.  ఆ లోటును భవిష్యత్ తరాలు అనుభవించక తప్పదు.
 
ఇక రాజధాని కోసం మహోద్యమం జరుగుతుందంటూ ఎల్లోమీడియా తన శక్తియుక్తులు అన్నింటిని  ప్రదర్శిస్తున్నది.  చివరకు టీవీ 5 వారు తమ ప్రతినిధులను దక్షిణ ఆఫ్రికా దేశానికి కూడా పంపించి అక్కడున్న కొందరు తెలుగువారితో రాజధాని తరలింపు అక్రమం  అంటూ ఉపన్యాసాలిప్పించారు.  అంత స్వామిభక్తి వారికి!  ఇక కర్ణాటకనుంచి, తమిళనాడు నుంచి రైతులు విచ్చేసి రాజధాని రైతులకు సంఘీభావాన్ని తెలుపుతున్నారని ఆకాశం చిల్లులు పగిలేట్లు ప్రచారం చేస్తున్నారు.  అక్కడ అసలు ఏ అలజడి లేకపోయినప్పటికీ, రాజధాని రైతుల ఆందోళనతో ప్రపంచం మొత్తం అట్టుడుకిపోతున్నదని బిల్డప్పులు ఇస్తూ ప్రజలను వంచించాలని విశ్వప్రయత్నం చేస్తున్నది.  అదే చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ అంటే మరి!  తమ అక్రమ ఆస్తులు, కులగజ్జిని  కాపాడుకోవడానికి చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు అనేది మరోసారి   దేశానికి స్పష్టం అయింది.  
 
“ఇక రాజధాని తరలింపును అడ్డుకుంటాము…కేంద్రం చూస్తూ ఊరుకోదు… రాజధాని మార్పును కేంద్రం ఒప్పుకోదు” అంటూ గత కొంతకాలంగా తమ వాచాలతను ప్రదర్శిస్తున్న  సుజనా చౌదరి లాంటి ఆర్ధిక ఉగ్రవాదులు,  చంద్రబాబుతో కుమ్మక్కై నమ్మిన పార్టీని సర్వనాశనం చెయ్యడానికి తెగించిన కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు,  చంద్రబాబు ఇచ్చే పాకేజికి ఆశపడి పిచ్చి పిచ్చి వాగుడు వాగే పవన్ కళ్యాణ్ లాంటి నిరక్షరకుక్షులు షాక్ తీనేట్లుగా “రాజధాని మార్పు విషయం రాష్ట్ర అధికార పరిధిలోని అంశం.  కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు” అంటూ నిన్న పార్లమెంట్ లో హోమ్ శాఖా సహాయమంత్రి తెలుగుదేశం ఎంపీలకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.  కేంద్రమంత్రి ప్రకటనతో భాజపా రాష్ట్ర నేతలు, తెలుగుదేశం, జనసేన నాయకులు ఒక్కసారిగా కంగు తిన్నారు.  కేంద్రం ఏదో విధంగా అడ్డుపుల్ల వేస్తుందని ఇన్నాళ్లూ ఆశలు పెంచుకున్న నాయకులు అందరూ ఆత్మరక్షణలో పడిపోయారు.     
 
వారు ఇంతటితో ఆగుతారని నేను అనుకోవడం లేదు.  న్యాయస్థానాల్లో తాము నాటిన విత్తనాల ద్వారా అయినా రాజధాని తరలింపును అడ్డుకుంటారని భావిస్తున్నాను.  అయితే పాలనాసంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఏ కోర్టుకూ మన రాజ్యాంగం హక్కును ఇవ్వలేదు.  కనుక ఎవ్వరు ఎంత గింజుకున్నా, జగన్ తలచుకుంటే రాజధానిని మూడు కాదు…ఆరు ముక్కలు చేసినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు!  
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు