కరోనా కాలంలో చెత్త రాజకీయ పలుకు 

కరోనా కాలంలో చెత్త రాజకీయ పలుకు 
 
భుజం మీదున్న భేతాళుడు మాయమైపోగానే మళ్ళీ చెట్టు దగ్గరికి పరుగెత్తే పట్టు వదలని విక్రమార్కుడిలా, ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ జగన్ మీద విషం చల్లడం అనే నిత్యకర్మను మాత్రం మానుకోలేడు.  గురువింద గింజ సామెతను తలుపుకు తెస్తూ ఈ రోజు  “కరోనా కాలం  … కొత్త రాజకీయం”   కక్కిన కల్మష రుధిర వాంతులలో లుకలుకలాడుతున్న క్రిమికీటకాలను ఒకసారి పరికిద్దాం. 
 
***
బస్సు రూట్ల జాతీయీకరణ నిర్ణయంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
ఇది ఒకప్పటి మాట! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రోజూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా హైకోర్టుతో కొనడానికే జగన్మోహన్‌ రెడ్డి సిద్ధపడుతున్నారు.”
 
అవును మరి!   ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినా, అందులో తప్పులేదని తీర్పులు ఆనాటి కోర్టులు ఇచ్చేవని మన ఊహకు కూడా అందదు.  చంద్రబాబు  మీద దర్యాప్తు జరపడానికి సిబ్బంది లేరని నాటి సిబిఐ  అధికారి కోర్టుకు చెప్పినపుడు  ‘సిబ్బందిని తెప్పించుకుని దర్యాప్తు జరపమని ఆదేశించలేని అశక్తత కలిగిన కోర్టులు ఆరోజుల్లో లేవు. 
 
రహస్యంగా జరగాల్సిన విచారణ వివరాలు ప్రతిరోజూ పత్రికలకు ఎలా ఎక్కుతున్నాయని నాటి కోర్టులు అయితే సిబిఐ ని కచ్చితంగా ప్రశ్నించేవి.  ఒక మాజీ ముఖ్యమంత్రి మీద పద్దెనిమిది కేసుల్లో స్టే పాతికేళ్లుగా ఉంటే, నాటి కోర్టులు కచ్చితంగా విచారణకు ఆదేశించేవి.  జగన్ మీద విచారణకు ఆదేశించి, పదవీవిరమణ చేసిన మరునాడే మరొక కేబినెట్ మంత్రి హోదా పదవిని స్వీకరించే న్యాయమూర్తులు నీలం సంజీవరెడ్డి కాలంలో లేరు. 
 
ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ముఖ్యమంత్రి పున్నమిఘాట్ లో అర్ధరాత్రి ఇచ్చిన విందులకు హాజరై ఆయనతో రాసుకుని పూసుకుని తిరిగిన న్యాయమూర్తులు నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో లేరు.  ఆ కాలం కోర్టులతో నేటి కోర్టులను పోల్చితే నవ్వు రాదా రాధాకృష్ణా?  
 
***
 
“సుజనా చౌదరి అప్పట్లో తప్పులు చేశారని ఇప్పుడు చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కూడా విజయసాయిరెడ్డి పరోక్షంగా హెచ్చరికలు పంపారా? అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాను జగన్మోహన్‌ రెడ్డి చేతిలో కీలుబొమ్మ కాదని పదిమందికి తెలియజేయడంతోపాటు తనను తక్కువగా అంచనా వేయవద్దని జగన్మోహన్‌ రెడ్డికి తెలియజెప్పడానికే పాత విషయాలను విజయ సాయిరెడ్డి ఎత్తి చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు.”
 
ఇద్దరు మిత్రుల మధ్య తగాదా పెట్టాలంటే ఎవరో ఒకరిని ఆకాశానికి ఎత్తేసి అతని ద్వారా ప్రమాదం వస్తుందేమో అన్న శంకను రెండోవాడిలో కలిగించాలి!  సుజనాచౌదరి తప్పులు చేశాడని ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పడం ఏమిటి?  అదేమైనా రహస్యమా?  విజయసాయిరెడ్డి గూర్చి జగన్ కు తెలియదా? 
 
జగన్ తాతల కాలం నాటినుంచే ఆ కుటుంబానికి విజయసాయిరెడ్డి తెలుసు.  విజయసాయిరెడ్డి చాణక్యానికి ప్రధానమంత్రి సైతం ఫిదా అయి ఎన్నోసార్లు బహిరంగంగా మెచ్చుకున్నారు.  జగన్ – విజయసాయిరెడ్డి ల మధ్య విభేదాలు సృష్టించి జగన్ ను బలహీనపరచాలనే కుటిలయత్నం కాదా ఇది?  
 
***
 ” సుజనా చౌదరిపై ఆరోపణలు నిజమా? కాదా? అన్నది పక్కనపెడితే, వాటిని ఇప్పుడు వెల్లడిస్తున్న విజయ సాయిరెడ్డి భవిష్యత్తులో జగన్మోహన్‌ రెడ్డితో చెడితే ఆయన వ్యవహారాలను సైతం బయట పెట్టరని గ్యారంటీ ఏమి ఉందని గుంటూరుకు చెందిన నా మిత్రుడొకరు సందేహం వ్యక్తంచేశారు”
 
ఏమి జోకు ఏమి జోకు?  హహ్హాహ్హా…..సుజనాచౌదరి మీద ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కన పెట్టాలి.  జగన్ మీద ఆరోపణలు మాత్రం పక్కా నిజం అంటూ చిలవలు పలవలుగా కట్టుకథలు అల్లి పేజీలకు పేజీలు దుర్గంధం విరజిమ్మాలి! 
 
భళా బాధాకృష్ణ…ఈ దేశంలోని దర్యాప్తు సంస్థలు అన్నీ కట్టకట్టుకుని సుజనాచౌదరి మీద దండయాత్ర చేసినపుడు ప్రాణభయంతో వెళ్లి మోడీ కాళ్ళు పట్టుకుని బీజేపీలో చేరి జైలు జీవితాన్ని తప్పించుకున్న సుజనాచౌదరి మీద ఆరోపణలు నిజమా కాదా అన్నది రాధాకృష్ణకు మాత్రమే కలిగే చిత్రమైన సందేహం! 
 
ఎనిమిదేళ్లు దర్యాప్తు జరిపి ఈరోజు వరకు ఒక ఆరోపణను కూడా రుజువు చెయ్యలేక  దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం తలలు బద్దలు కొట్టుకుంటుంటే …ఇంకా లక్ష కోట్లు తిన్నాడని జగన్ మీద తుచ్ఛమైన ఆరోపణలు చేస్తూ పోతుండాలి.  అదే మన రాధాకృష్ణ నేర్చుకున్న జర్నలిజపు విలువలు!  
 
****
“రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌ కుమార్‌ను తొలగించి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించే విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒక సందర్భంగా స్పష్టం చేసింది.
 
ఇందులో వాస్తవం లేకపోతే, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ అంత హడావుడిగా సంతకం చేసి ఉండేవారు కాదేమో!
 
బీజేపీ కేంద్ర నాయకత్వానికీ, వైసీపీ అధిష్ఠానానికీ మధ్య ఇంత సఖ్యత ఉన్న విషయం నిజమైన పక్షంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.”
 
ఓహో…ఓహో…బీజేపీ మీద ఎంత జాలి!  బీజేపీ పుట్టి నలభై ఏళ్లయింది.  అప్పటినుంచి నేటివరకు చంద్రబాబు, వెంకయ్యనాయుడుల కులగజ్జి కోరలలో చిక్కుకుని, ఈరోజు వరకు ఒక్క అంగుళం కూడా ఎదగని బీజేపీ …నేడు వైసీపీతో సఖ్యత నేర్పితే ఎదగలేదు అని తీర్పు ఇచ్చేస్తున్నాడు. 
 
ఇదే బీజేపీ 2014  ఎన్నికల్లో తెలుగుదేశం తో పొత్తు పెట్టుకుని నాలుగు ఎంగిలిమెతుకులు దక్కించుకున్నప్పుడు …. తెలుగుదేశంతో సఖ్యత పెట్టుకుంటే బీజేపీ పరిస్థితి ఏమిటి అని ఒక్క కన్నీటిబొట్టు కూడా జారవిడవలేదు!   చంద్రబాబుతో పొత్తు ఉంటే బీజేపీ సర్వనాశనం అయినా బేఫికర్.  జగన్ తో సఖ్యత పెట్టుకుంటే మాత్రం ఎక్కడాలేని సానుభూతి వర్షం!!
 
***
“నిజానికి కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేస్తే, అవినీతి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, విజయ సాయిరెడ్డికి శిక్ష వేయించగలరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది.
 
గతంలో తమిళనాడులో జయలలిత మరణానంతరం తమ దారిలోకి రాని శశికళపై ఉన్న పాత కేసులను అప్పటికప్పుడు తిరగదోడి జైలుశిక్ష పడేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. జగన్‌, విజయ సాయిరెడ్డిలపై ఉన్న కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది.”
 
ఇక్కడ…మన రాధాకృష్ణ తన మనసులోని కోరికను బయటపెట్టుకుని పెద్ద బరువు దించుకున్నాడు.!    అర్జెంట్ గా మోడీ కన్నెర్ర చెయ్యాలి.  జగన్ ను విజయసాయిరెడ్డిని జైలుకు పంపించాలి.  అప్పుడే చంద్రబాబు దోపిడీ యథేచ్ఛగా సాగిపోతుంది.  మళ్ళీ తన రాజ్యాన్ని తెచ్చుకుని భ్రమరావతులను సృష్టించి లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. 
 
జయలలిత, శశికళల మీద వచ్చిన ఆరోపణలు కోర్టులో రుజువై వారికి శిక్షలు పడ్డాయి తప్ప నేరాలు రుజువు కాకుండా పడలేదు.  ఇక్కడ జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద ఆరోపణలను ఏ కోర్టు కూడా నిర్ధారించలేదు.  పైగా ఆ కేసుల్లో నిందితులుగా కుట్రపూరితంగా సిబిఐ ఇరికించిన అనేకమంది ఐఏఎస్ అధికారులు క్లీన్ చిట్ తో బయటపడి తమ పదవుల్లో కొనసాగుతున్నారు. 
 
లక్షకోట్లు అని కుక్కల్లా మొరిగిన రాధాకృష్ణ లాంటి అనేక పచ్చమీడియా దుష్టాత్ముల దవడలు పగిలేట్లు ఆ అవినీతి తగ్గి తగ్గి ఇప్పుడు పన్నెండు వందల కోట్లకు వచ్చేసింది.  అది కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు.  ఏమైనప్పటికీ, ప్రజాకోర్టులో జగన్ ను గెలవడం అసాధ్యమని రాధాకృష్ణకు అర్ధమై కళ్ళు బైర్లు కమ్మి కనీసం న్యాయస్థానాల ద్వారా అయినా జగన్ పీడా వదిలించుకోవాలని తహతహలాడిపోతున్నాడు.
 
ఇక్కడ రాధాకృష్ణ గ్రహించాల్సింది ఏమిటంటే, కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తక్షణమే అరెస్ట్ అవుతాడు.  తనను బండబూతులు తిట్టిన చంద్రబాబు మీద   మోడీ కన్నెర్ర జేస్తే  చంద్రబాబు మీదున్న స్టే లు మొత్తం వెకేట్ అయి చంద్రబాబు కటకటాల వెనక్కు వెళ్లడం క్షణాల్లో పని! 
 
****
“బీజేపీ–వైసీపీ మధ్య మొదలైన లడాయి టీ కప్పులో తుఫానుగా తేలిపోవడంతో, ఉభయ పక్షాల మధ్య ఢిల్లీస్థాయిలో లోతైన అవగాహన ఉందని మాత్రం స్పష్టమవుతోంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలపడటం అనేది ఇప్పట్లో జరగదన్న అనుమానాలు మొదలయ్యాయి.”
 
పాపం!  అంతర్జాతీయ స్థాయి నాయకుడు,  నిప్పులాంటి మనిషి కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద చావుకేకలు పెడుతుంటే, ఆ కేకల దెబ్బకు జగన్ వణికిపోయి పారిపోవడం ఖాయం అనే చిత్తభ్రాంతికి లోనైన రాధాకృష్ణకు బీజేపీ వైసిపి ల మధ్య లడాయి ఇంత తేలికగా ముగిసిపోవడం ఏమాత్రం జీర్ణం కావడం లేదు. 
 
కన్నాను సవ్యసాచిగా, పరశురాముడుగా ఊహించుకుని తన చానెల్లో, పత్రికల్లో పేజీలకు పేజీలు కవరేజ్ ఇచ్చిన రాధాకృష్ణ…కేంద్రం కన్నా మీద కన్నెర్ర చేసి నోరు మూసుకోమని చెప్పడంతో కంగు తిని గింగిరాలు ఎత్తుతున్నాడు!  తాను ఇంతగా మోసిన కన్నాకు కేంద్రం ముందు విన్న విలువ ఏమిటో కళ్లారా చూసాక రాధాకృష్ణ కళ్ళు తిరిగిపోతున్నాయి!!!
 
****
“ప్రభుత్వ కార్యాలయాలకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై హైకోర్టు తప్పుపట్టడమే కాకుండా.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.”
 
నిజమే…ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వెయ్యడం తప్పే.  మరి చంద్రబాబు గారు తన పాలనలో మరుగుదొడ్లకు, వాటర్ ట్యాంకర్లకు, అన్నా కాంటీన్లకు వేసిన రంగుల పేర్లు ఏమిటి?  ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే కట్టడాలకు పసుపు రంగు వెయ్యడం తప్పు అని ఏనాడైనా హైకోర్టు కన్నెర్ర చేసిందా?  రంగులు తొలగించాలని ఆదేశించిందా? 
 
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.  జగన్ అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినపుడు ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు లేవు.  ప్రజలు రంగుల హంగులు చూసి ఓట్లు వేయరు.  రంగులతో ఓట్లు వచ్చేట్లయితే తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు ఎలా వస్తాయి?  
 
తలనుంచి తోకవరకు విషం ప్రవహించే ఖలులకు ఎన్నిసార్లు తలంటినా సిగ్గా ఎగ్గా?  విషంలో పుట్టిన పురుగులకు ఆ విషమే ఆహారం.  మన రాధాకృష్ణ అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు.  
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
 
 
 
 
 
 
 
 
 
ABN Radha Krishna in his usual style used his editorial to spit venom on YS Jagan. ABN Radha Krishna from the bottom of his heart wants YS Jagan to go to jail