కరోనాలోనూ తెలుగుదేశం శవరాజకీయాలు 

కరోనాలోనూ తెలుగుదేశం శవరాజకీయాలు 
సమయం సందర్భం అవసరం లేదు.  వేళాపాళాతో పనిలేదు…విపత్తులు అనేవి  తుఫాను, సునామీ, భూకంపం, వైరస్…ఏ రూపంలో అయినా కానీవండి…తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ లాంటివి.  శవ రాజకీయాలు చెయ్యడంలో తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో ఆరితేరింది.   విపత్కర సమయాల్లో రాజకీయాలు చెయ్యకూడదు అని సూక్తిముక్తావళి వల్లిస్తూనే నీచరాజకీయాలు చెయ్యడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.    ప్రపంచం మొత్తం కరోనాతో వణికి  చస్తుంటే, దేశమంతా లాక్ డౌన్ చేసి  రవాణా సౌకర్యాలు, వ్యాపార సామ్రాజ్యాలు, చివరకు ప్రసిద్ధినొందిన దేవాలయాలు సైతం షట్టర్లు వేసి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న సమయంలో కూడా అమరావతి ఉద్యమం అంటూ పెయిడ్ ఆర్టిస్టులతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపించడం,  ఆ ఉద్యమం వందరోజులు పూర్తి చేసుకున్నదంటూ సంతోషం వ్యక్తం చెయ్యడం చంద్రబాబు శవరాజకీయాలు   ఏ స్థాయిలో ఉంటాయో తెలియజేస్తుంది.  
 
దేశంలోని అన్ని ప్రతిపక్షాలు, వివిధ  రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు ఈ ఆపత్సమయంలో రాజకీయాలకు స్వస్తి పలికి ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి.  ప్రభుత్వాధినేతలను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శించడం లేదు.  సలహాలు ఇవ్వడం లేదు.  నిన్న లాక్ డౌన్ ను మరో  పందొమ్మిది రోజులు పొడిగించాలని మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికాయి.  ఇక తెలంగాణాలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆమోదిస్తున్నాయి.  ప్రజలు భయపడేట్లుగా ప్రవర్తించడం లేదు.  మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అత్యంత నికృష్టమైన రాజకీయాలను నడుపుతున్నారు.  తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు అడుగడుగునా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పు పడుతున్నారు.  తెలుగుదేశం పార్టీ అంటే సరే…మరి బీజేపీ సంగతి ఏమిటి?  మోడీ నిర్ణయాలను, చర్యలను జగన్ మోహన్ రెడ్డి మొదటిరోజు నుంచి సమర్థిస్తున్నారు.  ప్రధాని ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నా కూడా అమలు చేస్తామని నొక్కి చెబుతున్నారు.  అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాల్సిన బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద కాళియ సర్పం కన్నా భయంకరంగా విషం కక్కుతున్నారు.  జగన్ ను ఇరుకున పెట్టాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.  తన స్వీయ అస్తిత్వాన్ని విడనాడి చంద్రబాబుకు వ్యక్తిగత బానిసలా పనిచేస్తున్న కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ శ్రేణులు కూడా అసహ్యించుకుంటున్నారు.  పోనీ, ఈయనేమైనా పెద్ద మొనగాడా,  జగన్ ను విమర్శించే స్థాయి ఈయనకు ఉన్నదా అని ప్రశ్నించుకుంటే….ఒకప్పుడు ఎనిమిది శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు కన్నా లక్ష్మీనారాయణ అసమర్ధ నిర్వాకం కారణంగా ఒకటి కన్నా తక్కువ శాతానికి పడిపోయి బీజేపీ సర్వభ్రష్ట అయింది.  తన కింది నలుపు చూసుకోకుండా యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన యువనేతకు అడ్డుపడటానికి కన్నాకు సిగ్గు అనేది ఉన్నదా అని వైసిపి అభిమానులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు.  
 
ఇదిలా ఉండగా …కరోనా భయంతో తెలంగాణ రాష్ట్రానికి పారిపోయిన చంద్రబాబు నిన్న పెద్ద కామెడీ షోను నిర్వహించారు.  నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందుగా మోడీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని, తన సలహాలు, సూచనలు తీసుకున్నారని,  తన యోగక్షేమాలు కనుక్కున్నారని, తన దార్శనికతను తెగ మెచ్చుకున్నారని డప్పు కొట్టుకున్నారు.  దానికి మరికొంత వెల్లుల్లి, అల్లం పేస్ట్ కలిపి ఆయన భజన పత్రికలు కంపు కొడుతున్న వంటకాన్ని వండివార్చి “స్వయంతృప్తిని”  అనుభవించాయి.  ఇందులో విశేషం ఏమిటంటే…మొన్ననే ముఖ్యమంత్రి జగన్ లాక్ డౌన్ విషయంలో మూడు రకాల జోన్లను ప్రతిపాదించి గ్రీన్ జోన్ లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ఒక ప్రతిపాదన తెచ్చారు.  దాన్ని తెలుగుదేశం నాయకులు తీవ్రంగా విమర్శించారు.  జగన్ కు రాజకీయాలే ముఖ్యం అని, ప్రజారోగ్యం పట్టదని నానా కారుకూతలు కూశారు.  విచిత్రంగా నిన్న చంద్రబాబు తన షో లో దేశాన్ని మూడు జోన్లుగా విభజించాలని తాను ప్రధానికి సలహా ఇస్తూ ఈ నెల పదో తారీఖున ఒక లేఖను రాశానని చెప్పుకొచ్చారు.  ఆ లేఖ రాయడం  నిజమే అయితే,  అదే ఆలోచన జగన్ ముఖతా వెలువడినపుడు నిజంగా ప్రజా సంక్షేమం చంద్రబాబు కోరుకున్నట్లయితే…తన ఆలోచనే జగన్ కు కూడా వచ్చినందుకు అభినందించాలి.  తన పార్టీవారితో జగన్ మీద బురద చెల్లించి…ఇవాళ తనకు కూడా అలాంటి ఆలోచన ఉన్నదని బొంకడం ఒక్క చంద్రబాబుకే చెల్లిన క్షుద్రవిద్య.  పైగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జగన్ కు ఓ పనికిమాలిన సలహా!  చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినపుడు ఏనాడైనా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారా?  ఏనాడైనా ప్రతిపక్ష వైసిపి సలహాలను స్వీకరించారా?  తానేదో సర్వం సహా చక్రవర్తిని అన్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి జగన్ ను గడ్డిపరకలా తీసిపారెయ్యలేదా?  అలాంటి చంద్రబాబు ఈరోజు జగన్ కు తనను సంప్రదించాలని, సలహాలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నాడు!  ఎంత హాస్యాస్పదం!  
 
ఇక చంద్రబాబుకు పక్క వాయిద్యాల లాంటి సిపిఐ నేత రామకృష్ణ, లోక్ సత్తా మాజీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారితో పాటు, జనం ఏనాడో మర్చిపోయిన తొంభై ఏళ్ల ముదివగ్గు వడ్డే శోభనాద్రీశ్వర రావు కూడా జగన్ మీద విరుచుకుని పడుతున్నారు నిస్సిగ్గుగా.  సిగ్గు సిగ్గు!   
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు