ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది?  అని ప్రజలకు ఎవ్వరూ చెప్పాల్సిన పనిలేదు.  పాలితులు నిరంతరం పాలకుల చర్యలను గమనిస్తూనే ఉంటారు.  నచ్చితే మెచ్చుకుంటారు.  మరో అవకాశం ఇస్తారు.  లేదంటే గద్దెనుంచి కిందికి తోసేస్తారు.  ప్రజలలో ఆ చైతన్యం నిత్యమూ జాలువారే జలపాతంలా తొణికిసలాడుతూనే ఉంటుంది.  
 
చంద్రబాబుకు విభాజిత ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చారు ఆంధ్రులు.  కానీ, ఆ అయిదేళ్ల కాలాన్ని ప్రజలను, రాష్ట్రాన్ని దోపిడీ చెయ్యడానికే వినియోగించారు చంద్రబాబు.  ఫలితంగా ప్రజాగ్రహానికి గురయ్యారు.  కేవలం డ్రాయర్ మాత్రం ఉంచి మిగిలిన భాగాన్ని అనాచ్ఛాదితం చేసి తరిమి కొట్టారు.  జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజలెప్పుడూ చైతన్యవంతులే.  జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు.  తనదైన శైలిలో సంక్షేమ పథకాలతో దూసుకుని పోతున్నాడు.  చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా నాలుగు లక్షలమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు.  అమ్మఒడి కింద లక్షలాది తల్లులకు ఏటా పదిహేనువేలు ఇస్తున్నారు.  చేనేత కార్మికులకు, మత్స్యకార్మికులకు, డయాలసిస్ రోగులకు, జూనియర్ లాయర్లకు, ఆటోవాలాలకు ఏటేటా వివిధ పధకాల కింద వేలాదిరూపాయల ఆర్థికసాయం అందిస్తున్నారు.  అన్నింటికన్నా ప్రధానమైనది వైఎస్సార్ కూడా సాహసం చెయ్యలేని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా మార్చారు.  ఇంకా ఆశా వర్కర్లకు, మునిసిపల్ కార్మికులకు జీతాలను భారీగా పెంచారు.  గ్రామసచివాలయాలను ఏర్పాటుచేసి పౌరసేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లారు.  ఇలాంటి సంక్షేమ చర్యలతో ప్రజాదరణను పెంచుకుంటున్నాడు జగన్.  ప్రస్తుతం అయితే జగన్ మీద వ్యతిరేక లేదు.  మరి ఇలాంటి సమయంలో ప్రజా చైతన్య యాత్రలు అంటూ బయలుదేరారు చంద్రబాబు. ఎవరిని చైతన్యపరుస్తారో?
 
జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.   తాజాగా  మూడు రాజధానుల ప్రతిపాదన తో చంద్రబాబు, ఆయన పార్టీ వారు పాల్పడిన అక్రమ లావాదేవీల్లో భయంకరమైన నష్ఠాలను ఎదుర్కొంటున్నారు. దాంతో రాజధానిని మార్చడానికి వీలు లేదంటూ రెండు నెలలుగా కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.  రాష్ట్రం మొత్తానికి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గత నాలుగు నెలలుగా కేవలం మూడు గ్రామాలకు పరిమితం అయ్యారు.  
 
ఎంత బురద చల్లినా, ఎంత విషం చిమ్మినా, జగన్ పట్ల ప్రజలకున్న అభిమానం తగ్గడంలేదు.  రాజధాని మార్పు ఆగే అవకాశం కనిపించడం లేదు.  రాజధాని తరలింపును శాసనమండలి ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అసలు మండలే రద్దు కానుండటంతో చంద్రబాబుకు పిచ్చెక్కినట్లయింది.  ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవుతున్నారు.  మరొకవంక తనవద్ద పాతికేళ్లుగా పని చేస్తున్న కార్యదర్శి శ్రీనివాస్, మరికొందరు ముఖ్యుల ఇళ్లపై ఐటి అధికారులు జరిపిన సోదాల్లో రెండువేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.  అదంతా చంద్రబాబు డబ్బేనని అందరూ అనుమానిస్తున్నారు.  ప్రజల్లో పరువు పోతుండటంతో ప్రజాచైతనయ యాత్రలు అంటూ మరో సరికొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.  ఒకవేళ కేసులు సీరియస్ గా మరి చంద్రబాబును అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే, అది జనం చూస్తుండగా జరిగితే తనకు సానుభూతి పెరుగుతుందని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.   
 
అయితే చంద్రబాబు మాటలను ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది తరువాతి విషయం.  ప్రజలు సంపూర్ణ చైతన్యవంతులుగా ఉన్నారు.  తమకు ఎవరు మేలు చేస్తారో, ఎవరు కీడు చేస్తారో వారికి అవగాహన ఉన్నది.   వారిని కొత్తగా చైతన్యపరచాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. కానీ, జగన్ కు వ్యతిరేకంగా కావలసినంత విషాన్ని కక్కడానికి పచ్చపత్రికలు సిద్ధంగా ఉంటాయి.  రాజధాని మార్పుతో విశాఖనుంచి ఇతర ప్రాంతాలకు నడుపుతున్న విమాన సర్వీసులను నిలిపేస్తున్నామని ఇండిగో సంస్థ ప్రకటించిందని ప్రచారం ఆరంభించాయి ఎల్లో పత్రికలు.  పరిశ్రమలు వెనక్కు వెళ్తున్నాయని, పెట్టుబడులు రావడం లేదని, అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని రకరకాలుగా దుష్ప్రచారాన్ని చేస్తున్నాయి.  పచ్చపత్రికలు ఏమి రాస్తే వారిని చంద్రబాబు ప్రజలముందు చదువుతాడు.  ఆయన చదివినదాన్ని మరునాడు తాటికాయంత అక్షరాలతో పచ్చపత్రికలు ప్రచురిస్తాయి.  జగన్ కు అనుకూలంగా సాక్షి మీడియా తప్ప మరొకటి లేదు.  ఆ సాక్షి కూడా జగన్ ను సమర్ధించే రాతలు రాయడంలో విఫలం అవుతున్నది.  ఈనాడు, జ్యోతి రాతలు ఎక్కినంతగా సాక్షి వారి రాతలు ప్రజల మనసులలోకి వెళ్లడం లేదు.  ఇక వైసిపి సోషల్ మీడియా పూర్తిగా చప్పబడిపోయింది.   తెలుగుదేశం వారికి దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు కనిపించడం లేదు.   పార్టీ తమను పట్టించుకోవడం లేదని జగన్ అభిమానులు వాపోతున్నారు.     “చంద్రబాబు చెబితే జనం నమ్మరులే” అనుకుంటే అది అతివిశ్వాసం అవుతుంది.  
 
పాము విషం కొంచెమే అయినాసరే, అది ప్రాణాలు తీస్తుందని జగన్ గ్రహించాలి.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు