ఎన్టీఆర్ వైసిపి సొంతం కానున్నారా?

YS Jagan and NTR

సాధారణంగా ఎవరి పార్టీ నాయకులను వారు నిరంతరం స్మరించుకోవడం, వారి స్మృత్యర్ధ్యం ప్రాజెక్టులకు, విమానాశ్రయాలకు, ప్రభుత్వరంగ సంస్థలకు వారి పేర్లు పెట్టి  గౌరవించుకునే సంస్కృతిని మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాము.  కానీ, ఇటీవలి కాలంలో తమ పార్టీ నాయకులను అవమానించుకునే దుష్ట సంస్కృతి కొన్ని పార్టీల్లో ప్రవేశించింది.  జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగటమే కాక,  కేంద్రంలో ఐదేళ్లు సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు గారిని జీవించి ఉండగా మరియు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిన సంగతి అందరికి తెలిసిందే.  అలాగే , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని ,  ఆయన కుటుంబాన్ని, మరణానంతరం సోనియాగాంధీ ఎంత నీచంగా అవమానించిందో కూడా మనం కళ్లారా చూశాము.

Read More : సీఎం కేసీఆర్ కు క‌రోనా!

అలాగే తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయపార్టీని ఏర్పాటు చేసి, కేవలం తొమ్మిది నెలల సమయంలోనే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్ ను  1995  సంవత్సరంలో ఆయన కుటుంబ సభ్యులే సొంత అల్లుడు చంద్రబాబు మాయమాటలకు ప్రభావితులై ఎంత దారుణంగా అవమానించి గద్దెనుంచి దించేసి చివరకు ఆయన మరణానికి కారణమైన వైనం మనం పాతికేళ్ళక్రితం చూశాము.  ఆ తరువాత ఎక్కడా ఎన్టీఆర్ బొమ్మ కూడా కనిపించకుండా చేసి ప్రజల మనసుల్లోనుంచి ఎన్టీఆర్ ను తొలగించడానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల్లో ప్రముఖులైన నాయకులకు నీరాజనాలు పట్టి తమవాడిగా మలుచుకోవడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ సఫలమవుతున్న దృశ్యాలు ఆశ్చర్యం కలిగించక మానదు.     సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు.  మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రు లతో కలిసి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి ఉక్కుమనిషిగా ఖ్యాతినొందినవాడు.  తీరా స్వతంత్రం వచ్చాక గాంధీ కుటిల వ్యూహానికి బలైపోయి ప్రధానమంత్రి కావలసినవాడు హోమ్ మంత్రిగా మిగిలిపోయాడు.  హోమ్ మంత్రిగా పనిచేసిన కొద్ది కాలంలోనే దేశంలోని చిన్న చిన్న సంస్థానాలు అన్నింటిని ఏకం చేసి అఖండభారత్ ను నిర్మించిన సాహసవంతుడు.  అలాంటి మహానాయకుడిని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది.  కానీ, మోడీ గుజరాత్ కు చెందినవాడు   కావడంతో ప్రధానమంత్రి అయ్యాక మోడీ చాలావేగంగా స్పందించి  3500  కోట్ల రూపాయల భారీ వ్యయంతో సర్దార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో ప్రతిష్టించారు.  పటేల్ జయంతులు, వర్ధంతులు నిర్వహించడం, ఆయన విగ్రహానికి పూలమాలలు వెయ్యడం, నివాళులు అర్పించడం బీజేపీ వారు భక్తిప్రపత్తులతో చేస్తున్నారు.  మరో పదేళ్లు  ఇలాగే జరిగితే సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న విషయాన్నీ ప్రజలు మర్చిపోవడం ఖాయం.  అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవడం లేదు. 

Read More : బీజేపీ శ్రేయస్సు కాంక్షిస్తున్న సాయిరెడ్డి.. టార్గెట్ టీడీపీలో భాగమా

ఇక తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు.  ఊహించని పరిస్థితుల్లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి తనదైన శైలిలో ఆర్ధిక సంస్కరణలకు స్వగతం పలికి దివాళా తీసిన దేశాన్ని అయిదేళ్ల పాలనలో ఒడ్డున పడేసిన అపార మేధావి.  తిమ్మరుసు, యుగంధరుడు, చాణక్యుల కలబోత ఆయన.  అంతేకాకుండా కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని తన మంత్రాంగంతో, యుక్తులతో ఐహిదేళ్లు నిలబెట్టి జీవం పోసిన బ్రహ్మదేవుడిగా చెప్పుకోవాలి.  అలాంటి పాలనాదక్షుడిని కాంగ్రెస్ పార్టీ నీచాతినీచంగా అవమానించి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరగకుండా అడ్డుపడింది.  పీవీ నామస్మరణ చెయ్యడం కూడా నేరమేమో అన్నట్లు ప్రవర్తించింది. 

అలాంటి మహానాయకుడి శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని టీఆరెస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ నిర్ణయించడం రాజాకేయ పరిశీలకులనే కాక సాధారణ ప్రజలను కూడా ఆశ్చర్యచకితులను చేసింది.  ఆ చెయ్యడం ఏదో ఒకరోజు రెండు రోజులు కాదు.  ఏడాది పొడవునా జరపాలని నిర్ణయించడం, అందుకు తగిన బజెట్ కేటాయింపులను చెయ్యడం కూడా ఆగమేఘాల మీద జరిగిపోయింది.  పత్రికలలో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చేశారు.  ఇప్పుడిప్పుడే రాజకీయాలను గమనిస్తున్న యువతరం పీవీ నరసింహారావు టీఆరెస్ నేత అని నమ్మినా మనం విస్తుపోవాల్సిన పనిలేదు.  జరిగిన డామేజీని చివరి నిముషంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గ్రహించి సోనియాకు విన్నవించి ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించడానికి అనుమతి తీసుకున్నప్పటికీ, ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. 

Read More : ప్రపంచంలోనే పెద్దదైన కోవిడ్ హాస్పిటల్.. భారత్ అనుకుంటే ఏదైనా సాధ్యమే

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు.  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించి ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచెత్తారు.  అప్పట్లో చాలామంది దీన్ని విశ్వసించలేదు.  అయితే ఇటీవల జరిగిన ఒక అధికారిక సమావేశంలో ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో పార్లమెంట్ నియియోజకవర్గాల సంఖ్య ప్రాతిపదికగా జిల్లాలను విస్తరించబోతున్నట్లు జగన్ తెలియజేసారని సమాచారం.  ఇది రూపుదాల్చితే ప్రస్తుత కృష్ణా జిల్లా రెండు జిల్లాలుగా మారుతుంది.  దానిలో ఒకదానికి నందమూరి పేరు పెట్టడం ఖాయం.  ఇది జరిగిన మరుక్షణం వైసిపి సౌహార్ద్రత, ప్రజాభిమానం అనంతంగా పెరిగిపోవడం ఖాయం.  సొంత కుటుంబమే వదిలేసినా, జగన్ ఎన్టీఆర్ ఖ్యాతిని చిరస్మరణీయం చేశాడన్న పేరు జగన్ సంపాదించుకుంటారు.  ఎన్టీఆర్ సామాజికవర్గం మెజారిటీ వంతు జగన్ అభిమానులుగా మారిపోతారు.  ఇది రాజకీయంగా కూడా వైసిపికి కలిసివచ్చే అంశం. 

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు