అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు బాధను తన బాధగా భావించే క్షుద్రజ్యోతి రాధాకృష్ణ మొన్నటి ఐటి దాడులతో  చంద్రబాబుకు ఏదో అవుతుందేమో అన్న విహ్వలతను ప్రదర్శించాడు..    ఈ ఆణిముత్యాన్ని అవధరించండి:  
 
“”అవినీతి కేసులతో జగన్మోహన్‌రెడ్డి, అవినీతి ఆరోపణలతో చంద్రబాబు గబ్బు పట్టిపోతే, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. నిజానికి ఈ ఇరువురు నాయకులపై అవినీతి మరక అంటించడం వల్ల వారిద్దరికీ కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులు ఉండరన్న అభిప్రాయానికి వచ్చిన ప్రజలు జగన్మోహన్‌రెడ్డిపైన రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారన్న అభిప్రాయానికి వచ్చారు.””
 
నలభై ఇళ్లనుంచి నిప్పులాగా బతికామని ఒకవైపు శ్రీమాన్ చంద్రబాబు గారు ఊళలు వేస్తుంటే ఆయన కట్టప్ప మాత్రం చంద్రబాబు అవినీతి ఆరోపణలతో గబ్బుపట్టి పోయే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.  అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులు ఉండరని ప్రజలు అభిప్రాయానికి వచ్చారని “నువ్వేక్కే రైలు ఒక జీవితకాలం లేటు” అని కవి అన్నట్లు ఇంత లేటుగా తెలిసిందేమిటి రాధాకృష్ణకు?   గతంలో జగన్ మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక క్షుద్ర అధికారితో చేతులు, చెవులు కలిపి ఎన్నెన్ని కట్టుకథలను  ధారావాహికలుగా అందించాడు ఈ ధూర్త దూసరుడు!   ఆ కేసులన్నీ రాజకీయ కక్షలతోనే పెట్టారని నేడు ఆ అభిప్రాయాన్ని ప్రజలపై తోసేస్తున్నాడు.. అవును…రేపు ఐటి, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు చంద్రబాబు మీద కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా…రాజకీయ కక్షలతోనే కేసులు పెట్టారని వార్తలు వండటానికి ముందుగా రంగం సిద్ధం చేస్తున్నాడు!  ఔరా నీ తెలివి!  
 
“ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబువేననీ, ఆ డబ్బంతా శ్రీనివాస్‌ ఇంట్లోనే దొరికిందనీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత మీడియాలో ప్రచురించడం, దానిపై మంత్రులు, వైసీపీ నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.”
 
అయ్యయ్యో…గతంలో ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి జేబు దొంగతనము జరిగినా దానివెనుక జగన్ హస్తం ఉన్నదని,  జగన్ చేసిన నేరాలను విచారించడానికి సిబిఐ వారు ప్రపంచదేశాలు మొత్తం వెళ్తున్నారని, లేఖలు రాస్తున్నారని, పనామా పాత్రల్లో జగన్ పేరున్నదని, ఎవరి కంపెనీలో లక్ష రూపాయలు దొరికినా అది జగన్మోహన్ రెడ్డిదే అంటూ ఎన్ని దుర్మార్గపు రాతలు రాసావు రాధాకృష్ణ?   రాధాకృష్ణ ఒక చెత్తను పోగేయగానే, తెలుగుదేశం మారీచులు మీడియా సమావేశాలు పెట్టి దాన్ని చిలవలు పలవలు చేసిన సంగతి విస్మరించారా?  ఇప్పుడు తన యజమాని మోసాల గూర్చి వైసిపి మంత్రులు మాట్లాడితే నొప్పి అంత తీవ్రంగా ఉన్నదా?  
 
ఇక రాధాకృష్ణ ఐటి వర్గాల వారికి ఫోన్ చేస్తే విస్మయకరమైన వాస్తవాలు తెలిశాయట!  ఈ సోదాల ఆధారంగా చంద్రబాబు పై కేసులు పెట్టలేమని ఆదాయపన్ను శాఖవారు రాధాకృష్ణకు చెప్పారట!  
 
అహో…ఏమి పలుకుబడి రాధాకృష్ణది!  ఆయన మోడీతో మాట్లాడగలడు…అమిత్ షా తో మాట్లాడగలడు…సిబిఐ, ఈడీ  ఎవరితో అయినా ఫోన్లలో మాట్లాడగలడు.  వారు కూడా రాధాకృష్ణ అడగగానే వినయంగా మొత్తం జవాబులు చెప్పేస్తారు!  చంద్రబాబు మీద కేసులు పెట్టబోమనే వార్తను రాధాకృష్ణ చెవిలో చెప్పింది ఎవరబ్బా?  
 
“”రాజధాని తరలింపు వంటి అంశాలతోపాటు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకోకపోతుందా? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు గానీ, కేంద్రంలో అటువంటి కదలిక కనిపించడం లేదు.””
 
హమ్మయ్య…మన రాధాకృష్ణకు ఎట్టకేలకు సినిమా అర్ధం అయింది.  రాష్ట్రం అనేది కేంద్రానికి బంటు కాదు.  ఎవరి పరిధిలో వారికి రాజ్యాంగం అనేక అధికారాలను కట్టబెట్టింది.  రాష్ట్రం విషయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు.  రాజధాని మార్పు విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికారప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పలుమార్లు స్పష్టం చేసారు.  కేంద్రం జోక్యం చేసుకుంటుందని, రాజధానిని ఆపేస్తుందని పవన్ కళ్యాణ్ వంటి నిరక్షరకుక్షి, అమరావతిలో టెంట్లు వేసుకుని కూర్చున్న పెయిడ్ ఆర్టిస్టులు తప్ప లోకంలో ఎవరూ నమ్మడం లేదు.  ఆ విషయం రాధాకృష్ణకు ఇప్పటికి తెలియడమే విచారకరం.  
 
“”జగన్‌ ఎన్‌డీఏలో చేరితే ముస్లింలు దూరమవుతారు. అయితే అవినీతి కేసులలో జగన్‌కు శిక్ష పడితే ఎదురయ్యే నష్టంతో పోల్చితే.. ముస్లింలు దూరమవడం వల్ల కలిగే నష్టం స్వల్పమేనని వైసీపీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్‌కు శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితమే కాకుండా.. పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఆయన విశ్లేషించారు. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేనందున ఎన్‌డీఏలో చేరడం వల్ల ఇప్పటికిప్పుడు కలిగే నష్టం ఏమీ ఉండదనీ, కేంద్రంతో డీల్‌ కుదిరితే జగన్‌ నిర్దోషిగా బయటపడతారనీ, తమకు అంతకంటే కావలసింది ఏముందనీ ఒక సీనియర్‌ మంత్రి కూడా వ్యాఖ్యానించారు.””
 
పై వాక్యాలు చదివితే పంచతంత్రంలోని బ్రాహ్మణుడు – పేలపిండి కథ గుర్తుకు రావడం లేదూ?  ఎన్డీయే లో చేరితే ముస్లిములు దూరం అవుతారట!  ఈ దేశంలో ఏ రాజకీయపార్టీ కూడా ఒక్క మతం వారికోసం పనిచేయవు.  అలా చేసేవి మజ్లీస్ లాగా ఒక్క పాతబస్తీకే పరిమితం అవుతాయి.  ముస్లిములతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా ఓట్లు వేస్తారు.  పార్టీ విధానాలు నచ్చకపోతే కొందరు వెళ్లిపోవచ్చు.  అంతే కానీ, గంపగుత్తగా ఏ ఒక్క మతమూ వెళ్లిపోదు.  చంద్రబాబు తన పాలనలో యాభై దేవాలయాలను కూలగొట్టించారు. హిందువులు అందరూ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారా?  ఇప్పటికీ బ్రాహ్మణులలో ఎనభై శాతం మంది చంద్రబాబునే సమర్థిస్తారు.   ఇక జగన్ కు శిక్ష పడుతుందని ముందుగానే నిర్ధారించేస్తున్నాడు రాధాకృష్ణ…మరి ఈ రహస్యాన్ని ఆయనకు ఏ జడ్జి చేరవేసారో తెలియదు.   కేంద్రంతో డీల్ కుదిరితే కేసుల నుంచి జగన్ బయట పడతాడట!  ఇక మనదేశంలో కోర్టులు దేనికి?  ఈ వ్యాఖ్య న్యాయవ్యవస్థను అవమానించడం కాదా?  న్యాయమూర్తుల్లో ఎవరికైనా చీమూ నెత్తురూ ఉంటె రాధాకృష్ణ మీద కోర్ట్ ధిక్కారం కేసు పెట్టి బొక్కలో తొయ్యాలి.  
 
టోటల్ గా చూస్తే చంద్రబాబు బొక్కలోకి వెళ్తాడేమో,  జగన్ కేసులనుంచి బయటపడతాడేమో అన్న ఆందోళన బాధాకృష్ణ ముఖం నుంచి పుండు నుంచి చీము కారినట్లు కారిపోతున్నది!
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు