అడ్డంగా దొరికిపోయిన బాధాకృష్ణ!

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టడం సాధ్యం అవుతుందేమో కానీ, మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణ వారాంతపు విషపు రాతలకు, ఈర్ష్యాద్వేషాలకు మందు కనిపెట్టడం దేవవైద్యుడైన ధన్వంతరికి, ముల్లోకాలను కాచుకునే గరళకంఠునికి  కూడా సాధ్యం కాకపోవచ్చు,   యధాప్రకారం ఈ వారం కూడా “పోరాడితే వచ్చేదేమిటి” అంటూ పచ్చ చొక్కాలకు సాధ్యమైనంతవరకు పిరికిమందు నూరిపోయడంలో యమా ఆత్రపడిపోయాడు.  అంతే కాదు……ఇంతకాలం చంద్రబాబు అనుసరిస్తున్న కుటిలవిధానాలను, ఎన్నికల్లో తెలుగుదేశం విజయరహస్యాలను  అనుకోకుండా బయటపెట్టేశాడు.
 
“స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదు. ఎవరైనా డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే వారిపై అనర్హత వేటు వేయడంతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం చేశాం”… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన ఇది! ”ఏ పార్టీ వారు అయినా డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోండి”… జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జారీచేసిన ఆదేశం ఇది!”
 
ప్రజాస్వామ్యప్రియులు అందరూ కోరుకునే నిబంధన ఇది!  మనదేశంలో ఎన్నికలు అంటే మందు సీసాలు, డబ్బులు…ఎవరు ఎక్కువ పంచితే వారిదే గెలుపు.  చంద్రబాబు నాయుడు చేతిలోకి తెలుగుదేశం పగ్గాలు వచ్చాక ఈ జాడ్యం నిర్మల కాసారంలో కుళ్ళిన పచ్చ నాచులా విస్తరించిపోయింది.  డబ్బు ఉన్నవాడే ఎన్నికల్లో పోటీ చెయ్యగలుగుతున్నాడు.   “ఓటుకు అయిదు వేలు ఇవ్వగలను” అని బహిరంగంగా నిస్సిగ్గుగా ప్రకటించిన భారతదేశంలోని ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు.  పదేళ్లు ప్రతిపక్షంలో ఉండికూడా ఓటుకు రెండువేలు పంచిన చరిత్ర చంద్రబాబుది.    ఇలాంటి ప్రజాస్వామ్య మానభంగానికి ఒక శాసనం ద్వారా అడ్డుకట్ట వేసిన సాహసి జగన్మోహన్ రెడ్డి.  దీన్ని స్వాగతించాల్సింది పోయి,  అదేదో నేరం అన్నట్లు హాహాకారాలు చెయ్యడం ఒక్క రాధాకృష్ణకే చెల్లింది.  ఇక ఏ పార్టీవారు డబ్బు, మద్యం పంపిణీ చేసినా చర్యలు తీసుకోండి అని డీజీపీ తన శాఖకు ఆదేశాలు జారీ చెయ్యడం నేరమా?  డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంచి గెలిచారు అని ఓడిపోయినవారు విమర్శించడం మనం ఇప్పటివరకూ అనేకసార్లు చూశాము.  అలాంటి ఉపద్రవాలు రాకుండా చూడమని పోలీస్ బాస్ ఆదేశిస్తే ఆయన్ను మెచ్చుకోవాల్సింది పోయి విమర్శించడం ఏమిటి?  
 
***
“ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీ జెండా రంగులున్న దుస్తులు ధరించడం మినహా పార్టీ కార్యకర్తలను మించిపోయి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులు ఇచ్చే ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి.”
 
అహో….వయసు మళ్ళిన, మేను కుళ్ళిన వేశ్య మహా పతివ్రత అన్నట్లు… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించారో మరచిపోవడానికి యుగాలేమీ గడవలేదు.  సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినవారిని ఎలా వేధించారో తెలియదా?  రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎలా బెదిరించి లొంగదీసుకున్నారో ఎవరికి తెలియదు?  సాక్షాత్తూ ప్రతిపక్షనేత జగన్ మీద విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినపుడు అరగంట కూడా గడవకముందే నాటి డీజీపీ చంద్రబాబు బంటులాగా, బానిసలాగా వ్యవహరించడం మర్చిపోయామా?  నాటి  ఇంటిలిజెన్స్ అధిపతి ఎబి వెంకటేశ్వరరావు వైసిపి నాయకులను ఎంతగా బెదిరించాడో, ఎలా దౌర్జన్యాలు చేశాడో రాధాకృష్ణకు గుర్తు లేకపోయినా, జనం మతులు పోలేదులే!  
 
***
“ప్రత్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు అధికార పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫిర్యాదులు చేయించి ఆయా నేతలపై కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా పోలీసులు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతుండటాన్ని చూస్తున్నాంగా! ఎన్నికలలో ప్రత్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్టు సాక్ష్యాలు సృష్టించడం పోలీసులకు పెద్ద కష్టం ఏమీకాదు.”
 
వీటినే అతితెలివితేటలు అంటారు.   చంద్రబాబు హయాంలో పోలీసులను తమ పార్టీ కార్యకర్తల్లాగా ఎలా వాడుకున్నారో రాధాకృష్ణ పరోక్షంగా ఒప్పుకుంటున్నారు.  ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు పోలీసులు సృష్టించినట్లు  అంగీకరిస్తూనే, రేపు అదే ప్రమాదం తమ బాస్ కు ఎదురవుతుందేమో అని రాధాకృష్ణ ఆందోళన అంతా!  
 
****
“ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. స్థానిక ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నట్టు జనసేన, బీజేపీ ఇది వరకే ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆంతర్యం ఏమిటో, పోలీసులు ఏమి చేయబోతున్నారో స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది.”
 
ఇస్సీ…చంద్రబాబు కంటే ముందే కాడి పడేశాడు రాధాకృష్ణ!  రాజకీయపార్టీలకు ఎన్నికలు అంటే పరీక్ష వంటివి.  డిపాజిట్లు రావని తెలిసినా, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తాయి.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలకు ఎక్కడా ధరావతులు కూడా దక్కలేదు.  అందుకని రాబోయే ఎన్నికల్లో అవి పోటీ చెయ్యకుండా ఉంటాయా?  జగన్ పట్ల విపరీతమైన వ్యతిరేకత పెరిగిందని అబద్ధపు రాతలు రాస్తున్న రాధాకృష్ణకు అంత భయం దేనికి?  పోలీసులు ఏమి చేస్తారు?  ఏదో చేస్తారని  కుంటిసాకులు చెబుతూ ఎన్నికల్లో పోటీ చెయ్యవద్దు అంటే అర్ధం ఏమిటి?  జగన్ హవా మధ్యాహ్నపు సూర్యతేజంలా మండిపోతున్నదని ఒప్పుకోవడమే కదా!  
 
***
“పోటీచేసిన స్థానాల్లో కనీస స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని పక్షంలో ఈ రెండు పార్టీల కలయిక ఒక విఫల ప్రయోగంగా ఉండిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో బీజేపీ చేతులు కలపడం జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఇష్టం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో బీజేపీ జట్టుకట్టడం జగన్మోహన్‌ రెడ్డికి ఇష్టం లేదు. బీజేపీ పెద్దలకేమో రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. జగన్మోహన్‌ రెడ్డికేమో తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చల్లనిచూపు అవసరం. ఫలితంగా తెలుగుదేశం ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి. టూకీగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రం ఇదీ!”
 
హహ్హాహ్హా …జనసేన బీజేపీ పార్టీలు పొత్తుపెట్టుకున్నప్పుడే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అనే సామెతకు చాలామందికి అర్ధం తెలిసింది.  మొన్నటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఓటర్లతో ఛీ కొట్టించుకున్నాయి.  పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ రాజుగారి దేవాతావస్త్రాల లాంటిది అని దేశం మొత్తం తెలిసిపోయింది.  రేపు స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే కాదు…రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిపి కట్టగట్టుకుని పోటీ చేసినా, జగన్ పాదరోమం కూడా రాలదని అందరికీ తెలుసు.   ఇక కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కయి జగన్ మీద సోనియాగాంధీ అక్రమకేసులను పెట్టి జైల్లో బంధించినపుడే జగన్ చలించలేదు.  ఆ కేసులన్నీ నిర్వీర్యం అయిన నేటి పరిస్థితుల్లో కేంద్రానికి జగన్ భయపడతాడంటే  ఒక అమ్మ ఒక అబ్బకు పుట్టినవాళ్ళు ఎవరూ నమ్మరు.  ఆ సంగతి రాధాకృషకు కూడా తెలుసు.  కాకపొతే తన విషంలో ఆ చుక్క అనివార్యమైన భాగం..అంతే!  
 
****
“ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పరిస్థితి అనుకూలంగా లేదనుకున్నప్పుడు, శత్రువు ఊపుమీద ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గడం యుద్ధతంత్రంలో ఒక భాగం. ఇలా చేయడాన్ని పలాయన వాదంగా భావించడానికి లేదు. అయితే, ఎన్నికలలో పోటీచేయకుండా తప్పుకుంటే పార్టీ శ్రేణులు మరింత డీలాపడే ప్రమాదముందని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలే తదనంతరం జరిగే స్థానిక ఎన్నికలలో గెలవడం సహజం”.
 
ఓహో…మన జిత్తులమారి శకునిమామ దుర్యోధన చంద్రబాబుకు ఎలాంటి సలహా ఇస్తున్నాడో చూశారా!  ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా పారిపొమ్మని యుద్ధ కుతంత్రాన్ని బోధిస్తున్నాడు!   హహ్హాహ్హా…కుటిలనీతితో ఎన్నికల యుద్ధాలు చెయ్యడం మరిగిన చంద్రబాబుకు జగన్ పెడుతున్న కఠిన నిబంధనలు జీర్ణం కావడం లేదు.   అయితే ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఉంటే పార్టీ కార్యకర్తలు డీలాపడిపోతారని రాధాకృష్ణకు బాధ ఎందుకో మనకు అర్ధం కాదు.  ఎన్నికల్లో పోటీ చెయ్యాలో వద్దో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది.  మధ్యలో రాధాకృష్ణకు ఎందుకు నొప్పి?  ఇదేనా పాత్రికేయత అంటే?  గతంలో ఏనాడైనా, ఏ సంపాదకుడైనా ఫలానా పార్టీని పోటీ చెయ్యమని, లేదా వద్దని చెప్పిన ఉదంతం ఉన్నదా?  చంద్రబాబు బదులు నువ్వెందుకు వణికిపోతున్నావయ్యా బాధాకృష్ణా?
 
***
 
“సంక్షేమం పేరిట తమకు డబ్బులు పంచుతున్నారు కనుక వారిలో అసంతృప్తి ఉండటానికి అవకాశం లేదు. మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వ పనితీరు పట్ల పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగా స్థానిక ఎన్నికలలో వారు ఓటింగులో పాల్గొంటారా? అన్నది సందేహమే. సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందినవాళ్లు మాత్రం కచ్చితంగా ఓటు వేస్తారు. “
 
హర్రె!  ఈ ఫిటింగ్ ఏమిటి?  సంక్షేమం పట్ల లబ్ధిదారులకు అసంతృప్తి లేదని రాధాకృష్ణ ఒక నిజాన్ని ఒప్పేసుకున్నారు…గత్యంతరం లేక.  అంటే చంద్రబాబు హయాంలో దోపిడీ తప్ప సంక్షేమం లేదని ఇప్పుడు చేతులు కాలిన తరువాత అర్ధం అయింది మనవాడికి!   సంతోషం.   ఇక మధ్యతరగతి వారు మాత్రం అధరాలను శివధనుస్సును శ్రీరాముడు విరిచినట్లు  విరిచేస్తున్నారట!  ఓహ్…  ఇదెక్కడి లాజిక్?  ఒళ్ళు కొవ్వెక్కిన ధనికవర్గాలవారు ఓటింగ్ లో పాల్గొనకపోవడం సాధారణంగా జరుగుతుంది కానీ, మధ్యతరగతి వర్గాల వారు ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండటం తొంభై తొమ్మిది శాతం జరగదు.  మధ్యతరగతివారికి ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటువేసి ప్రదర్శిస్తారు తప్ప ఓటు వెయ్యకుండా ఇంట్లో దాక్కుంటారా?  
 
***
“ప్రస్తుతానికి రైతుల ఉద్యమ ప్రభావం కృష్ణా – గుంటూరు జిల్లాల్లో అంతోఇంతో కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు ఈ రెండు జిల్లాల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వస్తే దాని ప్రభావం రైతులు చేస్తున్న పోరాటంపై కచ్చితంగా పడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇదే కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు పోటీచేసిన తర్వాత కూడా కృష్ణా – గుంటూరు జిల్లాలలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డు ఉండదు.”
 
హమ్మయ్య….పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమప్రభావం అంతో ఇంతో మాత్రమే ఉన్నదని రాధాకృష్ణ ఉవాచ!  ఈ ట్విస్ట్ ఏమిటయ్యా బాబూ….రైతుల అమరావతి ఉద్యమం బీభత్సంగా మండిపోతున్నదని, రగిలిపోతున్నదని, జాతీయస్థాయి దాటి అంతర్జాతీయస్థాయికి చొచ్చుకుని వెళ్లిందని ఒకవంక పచ్ఛాచానెళ్ళలో, పచ్చపత్రికల్లో విశ్వామిత్ర సృష్టిని ప్రదర్శిస్తూ ఇపుడు ఉద్యమం అంతో ఇంతో ఉన్నదని చెబుతున్నావే!  దేనితో నవ్వలయ్యా మేము?  అక్కడ జరిగేదంతా డ్రామాయే అని, రేపటి ఎన్నికల్లో అక్కడ కూడా వైసిపి విజయం ఖాయమని భలేగా  ఊళలు వేస్తుంటే  వినేవారికి ఎలా ఉంటుంది?  
 
***
“తమ తరఫున ఒకరికి రాజ్యసభ సీటు కావాలని ముఖేశ్‌ అంబానీ ఒక రాజకీయ పార్టీని కోరడం ఇదే మొదటిసారి. అదికూడా ఒకప్పుడు రాజశేఖర్‌ రెడ్డి మరణానికి తానే కారణమని నిందించిన జగన్మోహన్‌ రెడ్డిని స్వయంగా వచ్చి ముఖేశ్‌ అంబానీ కలవడం వింతగా భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల ముఖేశ్‌ అంబానీ స్థాయి తగ్గి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్థాయి పెరిగింది. నిజానికి ముఖేశ్‌ను కలవడానికి తానే ముంబై వస్తానని జగన్మోహన్‌ రెడ్డి చాలాకాలంగా కోరుతున్నారట. అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని ముఖేశ్‌.. ఇప్పుడు తానే స్వయంగా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖేశ్‌–జగన్‌ మధ్య సమావేశాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేశారని చెబుతున్నారు.”
 
ఇదే నిజం అయితే…హురేహురే జగన్…అయ్యారే విజయసాయిరెడ్డి…భళా భళా అని కీర్తించక తప్పదు!  ఇరవై ఏడు అంతస్తుల కొండమీద నివసించే…భారతీయ ఆర్ధిక సామ్రాజ్యాన్ని శాసించే….లక్షలాదిమందికి తమ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తూ మోడీని సైతం ఇంటికి రప్పించుకునే ముఖేష్ అంబానీ లాంటివాడు తన గోరోజనం మొత్తాన్ని తాత్కాలికంగా విసర్జించి జగన్ ను కలవడానికి వచ్చాడంటే…అది నిస్సందేహంగా జగన్ ప్రాభవం మాత్రమే!  అంతటి చాణక్యాన్ని ప్రదర్శించిన విజయసాయిరెడ్డి ముందు వంద మంది చాణక్యులు కూడా సరిపోలరు అని ప్రశంసించాల్సిందే!  ముఖేష్ అంబానీ లాంటివాడు దిగివచ్చి తన సహచరుడికో సీటు ఇమ్మని జగన్ ను  అభ్యర్ధించాడంటే….శ్రీకృష్ణుడు వెళ్లి కుచేలుడిని కలిసి బతిమాలినట్లు కనిపించడం లేదూ?  జగన్ జీవిత చరిత్ర ఎవరైనా వ్రాస్తే…అందులో ఈ సంఘటన గూర్చి కచ్చితంగా రెండు పేజీలు ఉండాల్సిందే.  ఇక ఇందులో కూడా ఒక చిలిపి కుళ్ళుమోతుతనం!  ముకేశ్ అంబానీ ఒక వ్యాపారి.  ఆయన వ్యాపారం కోసం ఎక్కడికైనా వెళ్తాడు.  ఎవరినైనా కలుస్తాడు.  అయితే వ్యాపార నిమిత్తం కాకుండా మరోపనిమీద ఆయన స్వయంగా వచ్చి జగన్ ను కలిశారంటే దాన్ని కచ్చితంగా ఒక అద్భుతంగా చెప్పుకోవాలి.  దానివలన ముకేశ్ అంబానీ స్థాయి తగ్గిందని రాయడం ఒక బానిస స్థాయికూడా లేని రాధాకృష్ణకు మాత్రమే చెల్లింది.  
 
ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే…చంద్రబాబు ఒకనాటి రెమింగ్టన్ టైప్ రైటర్ లాంటివాడు…టకటక శబ్దం చేసుకుంటూ పని తక్కువ…బిల్డప్పులు ఎక్కువ బాపతు.  ఏదైనా చిన్న తప్పు దొర్లిందంటే అప్పటివరకు టైపు చేసిన పేపర్ మొత్తాన్ని చించేసి మళ్ళీ మొదటినుంచి కొట్టుకోవాలి.  జగన్ నేటి ఆధునిక కంప్యూటర్ లాంటివాడు.  నిశ్శబ్దంగా, పనిచేసుకుంటూ, తప్పులు దొర్లినా వెంటనే ఆటోమేటిగ్గా సవరించుకుంటూ శరవేగంతో పని పూర్తిచేసే అవకాశం ఉన్నట్టిది.  ఒకప్పుడు “చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్” అన్నాడు జగన్.  “చంద్రబాబు డర్టీఎస్ట్ పొలిటీషియన్”  అన్నాడు కేసీఆర్.  ఆ రెండు అక్షరసత్యాలు!  
 
ఇంకా చెప్పాలంటే …వందమంది వైఎస్సార్ లు ఈజ్ ఈక్వల్ టు  ఒక్క వైఎస్ జగన్!  మరో రెండేళ్లలో జగన్ విశ్వరూపాన్ని భరించలేక చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ సింగపూరో పారిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు