దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్.?

మీకు గుర్తుందా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో, ‘హైద్రాబాద్, సెకెండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అనే డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. అయితే, అప్పట్లో దాన్ని ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీయార్ తీవ్రంగా ఖండించారు.

కానీ, ఇప్పుడు అదే కేసీయార్ సమక్షంలో, రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, ‘రెండో రాజధాని’ ప్రస్తావన తీసుకొచ్చారు. బాబా సాహెబ్ అంబేద్కర్, దేశానికి రెండో రాజధాని వుండాలని కోరుకున్నారనీ, హైద్రాబాద్ రెండో రాజధాని అయితే బావుండేదనీ ప్రకాష్ అంబేడ్కర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

హైద్రాబాద్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించిన విషయం విదితమే. అత్యంత భారీ విగ్రహాన్ని అత్యంత భారీ స్థాయిలో వ్యయప్రయాసలకు ఓర్చి తెలంగాణ ప్రభుత్వం నిర్మించి, జాతికి అంకితం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు.

కాగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే క్రమంలో, హైద్రాబాద్.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా అవతరించింది. పదేళ్ళకు మించకుండా ఈ ఉమ్మడి రాజధాని అమల్లో వుంటుంది. ఆ తర్వాత తెలంగాణకే పూర్తిగా చెందుతుంది హైద్రాబాద్. ఉమ్మడి రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పదేళ్ళలో కూడా అదనపు హక్కులేమీ వుండవు.

అయితే, ఇప్పటికీ హైద్రాబాద్‌ని దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్లు తరచూ వినిపిస్తుంటాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి.. అని ఘనంగా చెబుతున్న కేసీయార్, ‘రెండో రాజధాని’కి ఒప్పుకుంటారా.? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్.