Sunita Williams: సునీతా విలియమ్స్.. అంతరిక్షంలో ఉన్నందుకు ఆమె సంపాదన ఎంతంటే?

Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో తొమ్మిది నెలలుగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఈ మిషన్ కేవలం 8 రోజులపాటు మాత్రమే ఉండాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా అది అనూహ్యంగా పొడిగింపబడింది. అయితే, ఈ అనుభవానికి వారికి ఎంత పారితోషికం లభించనుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా, నాసా వ్యోమగాములు GS-15 అనే జీత శ్రేణిలో ఉంటారు, ఇది అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యున్నత స్థాయికి చెందినది. ఈ స్థాయిలో వార్షిక జీతం $125,133 నుంచి $162,672 (రూ. 1.08 కోట్లు – 1.41 కోట్లు) మధ్య ఉంటుంది.. అయితే, సునీతా విలియమ్స్ మరియు బచ్ విల్‌మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండటంతో, వారి జీతం $93,850 – $122,004 (సుమారు రూ. 81 లక్షలు – రూ. 1.05 కోటి) వరకు లభించనుంది.

ఇదే కాకుండా, అంతరిక్షంలో వారు రోజుకు కేవలం $4 (రూ. 347) మాత్రమే అదనంగా పొందుతున్నారు. మొత్తం 287 రోజుల అనుసంధానంగా గణన చేస్తే, సునీతా విలియమ్స్‌కు అదనపు భత్యంగా $1,148 (రూ. 1 లక్ష) మాత్రమే లభించనుంది. అంటే, మొత్తం మీద ఆమె ఈ మిషన్‌లో రూ. 82 లక్షలు – 1.06 కోటి వరకు సంపాదించే అవకాశం ఉంది. నాసా ప్రకారం, వ్యోమగాములు ‘ఇక్కడి ఉద్యోగుల్లానే’ కొనసాగుతారని, వారి పని గంటలకు ఎలాంటి అదనపు ఓవర్‌టైం వేతనం ఉండదని స్పష్టంగా తెలిపింది.

ఇప్పటికే సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ రాకెట్ ద్వారా భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ మిషన్ నాసా-బోయింగ్ సంయుక్తంగా చేపట్టినదిగా చెబుతున్నా, అనేక సాంకేతిక లోపాలు దీనిని సుదీర్ఘంగా మార్చేశాయి. అయితే, నాసా ఎట్టకేలకు వారికి తిరిగి భూమికి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ డ్రాగన్ నౌకను ఉపయోగిస్తూ రిస్క్ తక్కువ చేసే ప్రయత్నం చేస్తోంది.