వేల ఏళ్ల నాటి క్యాలెండర్ ఏది.. ప్రపంచంలో అత్యంత పాత, అత్యంత కొత్త క్యాలెండర్ ఇదే..!

ప్రతి ఉదయం మనం కొత్త రోజుని చూస్తున్నామంటే.. దాని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, పరిశీలన, ప్రకృతి కదలికలపై మనిషి చేసిన అధ్యయనం దాగి ఉంది. మన జీవితానికి రోజులు, నెలలు, సంవత్సరాల రూపంలో క్రమబద్ధత ఇచ్చిన గొప్ప ఆవిష్కరణ క్యాలెండర్. పండుగలు, శుభదినాలు, గ్రహణాలు, పంట కాలాలు.. ఇవన్నీ మనకు ముందుగానే తెలిసేలా చేసింది ఇదే. కానీ ఈ క్యాలెండర్ ఎక్కడ మొదలైంది.. మొదట ఎవరు కాలాన్ని లెక్కించారు.. అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాల్లో ప్రపంచంలోని అత్యంత పురాతన క్యాలెండర్ సుమారు క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ షైర్ ప్రాంతంలో ఇది బయటపడింది. అప్పట్లో మనిషి వేట, సేకరణ జీవన శైలిలో ఉన్నప్పటికీ, సూర్యుడి కదలికలు, ఋతువుల మార్పులను గమనిస్తూ కాలగణనపై అవగాహన పెంచుకున్నాడని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు, ఫ్రాన్స్‌లో లభించిన కొన్ని ఆధారాలు మనిషి దాదాపు 30 వేల సంవత్సరాల కిందటే కాలాన్ని లెక్కించేందుకు గుర్తుల రూపంలో క్యాలెండర్ వాడినట్లు సూచిస్తున్నాయి.

భారతదేశానికి వస్తే, హిందూ పంచాంగానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. సూర్యుడి, చంద్రుడి గమనాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ కాలగణన విధానం క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలకు ముందే ఉపయోగంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఇందులో తిథులు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు ఉంటాయి. అందుకే పండుగలు, శుభకార్యాలు, వ్రతాలు, వ్యవసాయ పనులన్నీ పంచాంగాన్ని ఆధారంగా చేసుకునే సంస్కృతి మన దేశంలో బలంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన మొదటి ఆధునిక క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్. రోమనుసామ్రాజ్యాధిపతి జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 40లో దీనిని ప్రవేశపెట్టాడు. ఏడాదికి 365 రోజులు, ప్రతి నాలుగో ఏడాది ఒక అదనపు రోజు అనే లెక్కతో లీప్ ఇయర్ విధానం అప్పుడే మొదలైంది. ఇదే విధానాన్ని ఆధారంగా చేసుకుని, కాలాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించేందుకు 16వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందింది.

ఈరోజు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే గ్రెగోరియన్ క్యాలెండర్. యేసుక్రీస్తు జననాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర గణన జరుగుతోంది. జనవరి 1తో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఇప్పుడున్న 12 నెలల పేర్లు కూడా జూలియన్ క్యాలెండర్ నుంచే వచ్చాయి. లీప్ ఇయర్ విధానం కూడా ఇందులో యథాతథంగా కొనసాగుతోంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, నేటి జీవనశైలికి అనుగుణంగా మారిన క్యాలెండర్‌గా గుర్తింపు పొందింది.

గ్రెగోరియన్‌తో పాటు ప్రపంచంలో ఇంకా అనేక క్యాలెండర్లు ఉన్నాయి. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ పూర్తిగా చంద్రుని ఆధారంగా నడుస్తుంది. ఇందులో 12 నెలలు కలిపి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అందుకే రంజాన్, బక్రీద్ వంటి పండుగలు ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలకు వస్తుంటాయి. హీబ్రూ క్యాలెండర్ సౌర-చాంద్రమాన విధానంపై ఆధారపడి ఉంటుంది. బౌద్ధ క్యాలెండర్ ఆగ్నేయాసియాలో విస్తృతంగా వాడుతారు. ఇవన్నీ ఒకే ప్రకృతిని చూసినా, కాలాన్ని లెక్కించే విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది.

మొత్తానికి, క్యాలెండర్ అనేది కేవలం తేదీల పుస్తకం కాదు. అది మనిషి ప్రకృతిని అర్థం చేసుకున్న విధానానికి ప్రతిరూపం. సూర్యుడు, చంద్రుడు, తారల గమనాల్ని అధ్యయనం చేస్తూ, వేల సంవత్సరాల కిందట మనిషి వేసిన కాలరేఖే.. ఈరోజు మన ఫోన్ స్క్రీన్‌లో కనిపించే క్యాలెండర్. ప్రతి కొత్త రోజు వెనుక అంతటి గొప్ప చరిత్ర దాగి ఉందన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.