ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. అయితే వారిలో ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి బదిలీ మాత్రం అటు అధికారుల్లోనూ ఇటు జనాల్లోనూ బాగా చర్చనీయాంశంగా మారింది. ఆయన బదిలీ సందర్భంగా చోటుచేసుకున్న ప్రకంపనలు వారం గడుస్తున్నా సద్దుమణగలేదు సరికదా ఒక వర్గం వారిలో ఇదో విస్తృత చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. కారణం కొన్ని నెలల కిందట ఇలాగే ఒక సీనియర్ మోస్ట్ ఐఎఎస్ అధికారిని అసాధారణ రీతిలో బదిలీ చేసి ఇక్కడే పోస్టింగ్ ఇవ్వగా ఆయన అదే చోట రిటైర్ అవ్వాల్సివచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో సినియర్ ఐఎఎస్ అధికారిని అనూహ్యంగా బదిలీ చేయడంతో పాటు ఆయనకు కూడా ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడంతో ఇది ఖచ్చింతగా పనిష్మెంటేననే సంకేతం గోచరించింది. అయితే అత్యంత భక్తిపరులు,నిజాయితీపరులు పరులైన వారిద్దరినీ ఈ రకంగా అవమానించడం ఏమిటని హిందూత్వవాదులు మండిపడుతున్నారు.
చర్చనీయాంశంగా మారిన బదిలీ
ఏపీలో ఈ నెల 8న ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్‌కు ఎండోమెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్.హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమించారు. అయితే వీరిలో సీనియర్ ఐఎఎస్ జేఎస్వీ ప్రసాద్ బదిలీ వ్యవహారం హిందూత్వవాదుల్లో పెద్ద చర్చకు దారితీయడంతో పాటు ఆగ్రహానికి కారణమైంది.
గతంలో ఆయనను అలా…
గత ఏడాది నవంబర్ నెలలో ఛీప్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను ఆయన కంటే హోదాలో,సీనియార్టీ ప్రకారం జూనియర్ అయిన అధికారి బదిలీ చేయడం సంచలనం సృష్టించింది. కొద్ది నెలల్లో రిటైర్ అవ్వబోతున్న ఆయనను చట్ట ప్రకారం సవ్యమో కాదో తెలీని రీతిలో బాపట్ల మానవ వనరుల అభివృద్ది సంస్థకు డైరెక్టర్ గా ట్రాన్స్ ఫర్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. పైగా ఆయనను బదిలీ చేయడానికి కారణం తిరుమల క్షేత్రం అన్యమతస్థుల అడ్డా కారాదని అంటూ ఆ క్రమంలో తన జూనియర్ అధికారికి షోకాజ్ ఇచ్చినందుకు ఇలా చేశారని చర్చ జరిగింది. ఈ పరిణామాన్ని అసలు ఊహఇంచిన ఎల్వీ సుబ్రమణ్యం కోర్టును ఆశ్రయించడం వంటివి చేయకుండా సెలవు పెట్టి ఆ తరువాత రిటైర్ అయిపోయారు.
సేమ్ టు సేమ్ అలాగే
అదే క్రమంలో ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధం ఘటనలో హిందూ భక్తాగ్రేసరుడిగా,నిప్పులాంటి నిజాయితీపరుడిగా పేరొందిన దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ పై బదిలీ వేటు వేయడం, ఆయనను కూడా అదే బాపట్ల మానవ వనరుల అభివృద్ది సంస్థకు డైరెక్టర్ గా ట్రాన్స్ ఫర్ చేయడం ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ అనే భావించాల్సి వస్తోందని హిందూత్వవాదులు మండిపడుతున్నారు. జరిగే తప్పులు ఆపలేకపోగా సరిదిద్దేందుకు ప్రయత్నించే సమర్థులు,నిజాయితీపరులు, హిందూ భక్తాగ్రేసరులు అయిన వారిని బలి చేయడమేమిటని వారు రగిలిపోతున్నారు.
ఇద్దరు సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లకు ఇలా జరగడం వారు జీర్ణించుకోలేక అంతర్గత చర్చల్లో తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు.