Pushpa 2: ‘పుష్పా2’ టికెట్‌ పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. 17 వరకు వర్తించనున్న పెంచిన ధరలు!

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప-2’ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచగా.. అదేబాటలో ఏపీ ప్రభుత్వం కూడా ‘పుష్ప-2’కు ధరల పెంపునకు అనుమతిచ్చింది. డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్‌ షోతో పాటు, అర్దరాత్రి 1 గంట షోలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ రెండు బెనిఫిట్‌ షోలకుగాను ఏపీ వ్యాప్తంగా ఉన్న సింగిల్‌ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌లలో ఏదైనా సరే టికెట్‌ ధర రూ. 800గా నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అధనంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్‌ 5న ఆరు షోలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్‌ స్క్రీన్‌లలో లోయర్‌క్లాస్‌ రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. ఇక్కడ కూడా జీఎస్టీతో కలిపి టికెట్లు కొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ధరలు అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలకు అదనంగా యాడ్‌ అవుతుందని, డిసెంబర 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయని ఏపీ సర్కార్‌ వెల్లడించింది.